"చావాలనుకుంటే కుడివైపుకు పో... బతకాలనుకుంటే ఎడమవైపుకు పో..." అంటారు ఆ ఊరిలో అందరూ. అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పక్కనే ఒక అడవి. ఆ అడవిలో ఒక తిక్కదయ్యం దానికి తోడుగా ఒక కుక్కదయ్యం ఉన్నాయి. అవి రెండూ చాలా మంచివే కానీ చూడడానికి చాలా భయంకరంగా ఉండేవి. అడవిలో అవి రెండే ఉండడంతో వాటికి పొద్దుపోయేది కాదు. ఎవరైనా మనుషులు అడవిలో అడుగుపెడితే చాలు వాళ్లతో కబుర్లు చెప్పాలనీ, ఊరి సంగతులు కనుక్కోవాలనీ వాటి కోరిక. కానీ వాటిని చూస్తేనే చాలు జనాలు హడలిపోయేవాళ్ళు. వెనక్కి తిరిగి చూడకుండా పంచలు పైకెగ్గట్టి పరుగు అందుకునే వాళ్లు. అవి 'ఆగు ఆగు' అంటూ వాళ్ల వెనుకే పడేవి. అది చూసి మరింత భయంతో వణికి పోయేవాళ్ళు. ఇంకా వేగంతో ఉరికేవాళ్లు. అలా ఉరుకుతా... ఉరుకుతా... కొందరు చూసుకోక కాళ్లకు రాళ్లు తగిలి కిందపడి దెబ్బలు తగిలించుకునేవాళ్ళు. మరికొందరు కాళ్లు చేతులు విరిగ్గొట్టుకునేవాళ్ళు. గుండె జబ్బులు ఉన్న ఇద్దరు ముగ్గురు అక్కడికక్కడే సచ్చి స్వర్గానికి వెళ్ళిపోయారు. దాంతో ఆ దయ్యాలే వాళ్లను పట్టుకొని చంపినాయని ఊరంతా పుకార్లు పుట్టాయి. ఇంకేముంది 'అదిగో పులి అంటే ఇదిగో తోక ' అనే జనాలు అటువైపు పోవడమే మానేశారు. పక్క ఊరికి కుడివైపున తొందరగా హాయిగా చేరుకోవచ్చు. ఎడమ వైపు పోవాలంటే నాలుగింతల సమయం పడుతుంది. అయినా జనాలు ఎడమవైపే వెళ్లేవాళ్లు. అలా "చావాలనుకుంటే కుడివైపుకుపో... బతకాలనుకుంటే ఎడమవైపుకుపో..." అనే కొత్త సామెత ఊరంతా వ్యాపించింది. దాంతో ఎవరూ చచ్చినా కుడి వైపుకు పోయేవాళ్ళు కాదు.
ఆ ఊరిలో కన్నయ్య అనే మంగళాయన ఉన్నాడు. ఆయన చానా మంచోడు. పెద్దల నుంచి కులవృత్తి నేర్చుకొని ఊరిలో అందరికీ చాలా అందంగా, చూడముచ్చటగా, మనసుపెట్టి క్షవరం చేసేవాడు. ఆయన కత్తెర చేత పడితే చాలు కొండముచ్చు అయినా కుందేలు పిల్లలా మిలమిలా మెరిసి పోయేది. ఎలుగుబంటి అయినా గంగిగోవులా ధగధగా వెలిగిపోయేది. ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళకి... వాళ్ల మొహాన్ని బట్టి, కోరికను బట్టి అందంగా క్షవరం చేసేవాడు. పొద్దున లేసినప్పటి నుండి జనాలు 'అంగడి ఎప్పుడెప్పుడు తెరుస్తాడా... ఎప్పుడెప్పుడు క్షవరం చేయించుకుందామా' అని ఎదురు చూసేవాళ్ళు.
కన్నయ్యకు తాత ముత్తాతల కాలం నుంచి నాలుగు ఎకరాల పొలం ఉంది. అది బీడు భూమి. వానొస్తే పంట. లేదంటే లేదు. అందులో బావి తవ్వించాలి అనుకున్నాడు. కానీ దానికి చాలా ఖర్చవుతుంది కదా అందుకని పైసా పైసా దాచిపెట్టి కావలసినంత సొమ్ము కూడబెట్టాడు. సరిపోయినంత సొమ్ము చేతికందగానే బావి తవ్వించాడు. అదృష్టం బాగుండి మరీ లోతుకి పోకముందే నీళ్లు ఎగదన్నుకొచ్చాయి. సంబరం సంబరం కాదు. ఊరు ఊరంతా వాణ్ని ఒకటే పొగడ్డం. "ఈ దెబ్బతో నీ జాతకం మొత్తం మారిపోతుందిరా. ఇంటి నిండా పంటలు... వడినిండా సొమ్ములు... అదృష్టం అంటే నీదే పో" అని తెగ మెచ్చుకున్నారు.
ఆ పొలం పక్కనే ఆ ఊరి జమీందారు పొలం ఉంది. వాడు పెద్ద దుర్మార్గుడు. వాని కన్ను ఈ బావి మీద పడింది. దాంతో ఎలాగైనా సరే దాన్ని కాజేయాలని కన్నయ్య వాళ్ళ తాత తనకు అప్పు ఉన్నట్టు పత్రం రాయించి దానిపై ఇద్దరితో దొంగ వేలిముద్రలు సాక్ష్యంగా వేయించాడు. డబ్బు వడ్డీతో సహా ఇస్తావా లేక పొలం అప్పచెబుతావా అని దొంగ పత్రం చూపిస్తూ గొడవకు దిగాడు. అది అన్యాయం అని తెలిసినా ఆ జమీందారును ఎదిరించలేక ఎవరు కిక్కురుమనలేదు. బావి తవ్వించడానికే చేతిలో ఉన్న ధనమంతా అయిపోవడంతో అతని చేతిలో ఒక్క పైసా కూడా మిగల లేదు. దాంతో కన్నయ్య పొలం జమీందారు గుంజుకున్నాడు. పాపం కన్నయ్య చానా బాధపడ్డాడు. కళ్ళ ముందు అంతన్యాయం జరుగుతా ఉంటే ఎదుర్కోలేని ఈ బతుకు బతకడం కన్నా చావడం మేలు అనుకున్నాడు. చక్కగా అడవిలోకి కుడివైపుకు బయలుదేరాడు.
ఆ దారిలోనే కదా ఈ దయ్యాలు ఉండేది. తిక్కదయ్యం, కుక్కదయ్యం కన్నయ్యను చూశాయి. "ఆహా... ఎన్నాళ్కెన్నాళ్లకు ఒక మనిషి అడవిలోకి వస్తున్నాడు. ఇతనితో కాసేపు కబుర్లు ఆడుదాం. ఊర్లో సంగతులన్నీ ఒక్కటి కూడా విడవకుండా తెలుసుకుందాం" అనుకున్నాయి. వెంటనే రెండూ చెట్టు పైనుండి ఎగిరి కన్నయ్య ముందుకు దూకాయి. వాటి ఆకారాలు చూస్తూనే కన్నయ్య అదిరిపోయాడు. కానీ వచ్చింది చావడానికే కదా... దాంతో భయపడకుండా "రండి... చంపండి... చంపి కమ్మగా కడుపునిండా తినండి" అన్నాడు వెనుకడుగు వేయకుండా.
ఆ మాటలకు తిక్కదయ్యం, కుక్కదయ్యం ఒకదాని మొహం మరొకటి చూసుకున్నాయి. "మేము నిన్ను చంపడానికి వచ్చినామని నీకెవరు చెప్పారు. మనుషుల మాంసం తినడం కాదు కదా... కనీసం వాటి వాసన కూడా మేము ఎప్పుడు చూడలేదు" అన్నాయి. కన్నయ్య నెత్తి గోక్కుంటూ "మరి మీ పేరు చెబితే చాలు... అందరూ నిద్రలో కూడా ఉలిక్కిపడతారే. ఇటువైపు వస్తే చావు తప్పదని వణికి చస్తారే" అన్నాడు.
"ఏం చేద్దాం అంతా మా కర్మ... నిజం చప్పగా కషాయంలా యాక్ థూ అనేటట్లుగా అసహ్యంగా ఉంటుంది. అదే అబద్ధం అయితే అందంగా, మసాలా వేసిన వంటకంలా, గుమగుమలాడుతా, యమా రుచిగా, రా రమ్మని పిలుస్తా ఉంటుంది. అందుకే నిజం గడప దాటకముందే పుకార్లు ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తాయి అంటారు పెద్దలు. మేం మనుషులతో స్నేహం చేద్దామని, మేలు చేద్దామని పలకరిస్తే... వాళ్లు భయపడి పారిపోతావున్నారు. మేమేమీ చేయకపోయినా చెడుగా ప్రచారం చేస్తా ఉన్నారు. మమ్మల్ని ఏం చేయమంటావ్" అన్నాయి దిగులుగా.
ఆ మాటలకు కన్నయ్య "మీరు ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా... చింపిరి జుట్లు, గలీజు మొహాలు, కంపుకొట్టే శరీరాలు, పెరిగిన గోళ్లు, తోముకోని పళ్ళు... ఇలా భయంకరంగా ఒక్కసారిగా కళ్ళముందు ప్రత్యక్షమైతే ఎంత ధైర్యవంతునికైనా సరే ఒళ్ళు చల్లబడి గుండె కొట్టుకోవడం మర్చిపోతుంది. మనకు మంచితనం ఉంటే సరిపోదు మంచి రూపం కూడా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటే ముళ్ళపంది కూడా ముచ్చటగానే ఉంటాది. కర్రె కాకి కూడా కంటికి ఇంపుగానే కనబడుతుంది" అన్నాడు.
"మరి మేమలా చూడముచ్చటగా... ముద్దుముద్దుగా... ఊరంతా వచ్చి చిరునవ్వులు నవ్వుతా దగ్గర కూర్చునేలా ఎలా తయారవుతాం. అది సాధ్యమేనా" దిగులుగా అన్నాయి దయ్యాలు. కన్నయ్య నవ్వి "ఓస్... అదెంతసేపు. నాకు అరగంట సమయం ఇస్తే చాలు. ఇట్లా ఇంటికి పోయి నా సామానుతో అట్లా క్షణంలో తిరిగి వచ్చేస్తా. ఆ తరువాత మిమ్మల్ని మీరే నమ్మలేనంత అందంగా తయారు చేస్తా. నా వృత్తి అదే గదా" అన్నాడు నవ్వుతూ.
"పోయి మరలా వస్తావా" అని అడిగాయి ఆ దయ్యాలు అనుమానంగా.
"మాటంటే మాటే... దేవునికైనా, దయానికైనా, చిన్న పిల్లోనికైనా, పెద్ద పిచ్చోనికైనా మాటిస్తే తప్పకూడదు అంటారు పెద్దలు. నన్ను నమ్మడి" అన్నాడు కన్నయ్య.
దాంతో ఆ దయ్యాలు "నిజంగా నీవలాల చేస్తే... నీకు ఏ సాయం కావాలన్నా మేం చేస్తాం. మా దయ్యాల దేవుడు భేతాళరాజు మీద ఒట్టు. మెరుపులా పోయి మెరుపులా రా" అన్నాయి.
కన్నయ్య సరేనంటూ సర్రున ఇంటికి పోయి కావలసిన సామానంతా తీసుకొని మరలా అంతే వేగంతో అడవిలోకి ఆ దయ్యాల వద్దకు చేరుకున్నాడు. ఆ రెండింటిని అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చోబెట్టి, తలను నీటితో బాగా తడిపి. వెంట్రుకలు బాగా దువ్వి చిక్కుదీసి, క్షవరం మొదలుపెట్టాడు. చూస్తుండగానే చింపిన జుట్టు అంతా మాయమైపోయింది. పెరిగిన గడ్డం నున్నగా మారిపోయింది. మంచి సువాసనలు వెదజల్లే సబ్బు చేతిలో పెట్టి పక్కన ఉన్న వాగులో సబ్బరిగిపోయే వరకు స్నానం చేసి రమ్మన్నాడు. అవి స్నానం చేశాక పాపిడి తీసి, ముఖానికి తెల్లని రంగు కొట్టి, బుగ్గలకు ఎర్రని రంగు అద్ది, కొత్త బట్టలు వేయించి అద్దం తీసి చూపించాడు. అద్దంలో తమ మొహాలు చూసి అవి చాలా ముచ్చట ముచ్చట పడిపోయాయి. ఒకదాని మొహం మరొకటి చూసుకొని సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాయి. "ఏమో అనుకుంటి గానీ... నీ చేయి అద్భుతాలు సృష్టించింది. దయ్యాలమైన మేము కూడా ఇంత అందంగా ఉంటామని ఇప్పుడే తెలిసింది. ఈ విషయం వేరే దయ్యాలకు గనుక తెలిస్తే ఇక నిన్ను చస్తే వదలవు. నీ కాళ్లు పట్టుకొని అయినా నిన్ను దయ్యాల లోకానికి తీసుకొని పోయి అందరికీ చక్కగా క్షవరం చేయించుకుంటాయి. నెత్తిన పెట్టుకొని మహారాజులా చూసుకుంటాయి. చెప్పు నీకేం సహాయం చేయాలో" అని అడిగాయి. కన్నయ్య వాటికి జరిగిందంతా చెప్పాడు.
"సరే... ఈరోజు వరకు మేమిద్దరమూ, ఎవరినీ ఎప్పుడూ ఎక్కడా భయపడించలేదు. కానీ ఒక మంచిపని కోసం ఆ దుర్మార్గుడైన జమీందారుని ఒక ఆట ఆడుకుంటాం. వారం తిరిగేసరికి వాడు పరిగెత్తుకోనొచ్చి నీ భూమి నీ చేతుల్లో పెడతాడు చూడు" అన్నాయి.
తిక్కదయ్యం, కుక్కదయ్యం రెండూ కన్నయ్య పొలానికి చేరుకున్నాయి. స్మశానంలో రెండు గంపల ఎముకలు ఏరుకొనివచ్చి ఎవరికీ కనబడకుండా బావి లోపల కూర్చున్నాయి.
పొద్దున్నే జమీందారు పనివాళ్ళు పొలానికి నీళ్లు తడపడానికి బావి కాడికి వచ్చినారు. ఒక పెద్ద నీళ్ళ కడవ లోపలికి వదిలారు. లోపల ఉన్న దయ్యాలు ఆ కడవ నిండా ఎముకలు నింపాయి. వాళ్ళు బయటికి లాగి చూస్తే ఇంకేముంది నీళ్లు లేవు... అంతా ఎముకలే... వాటి చూస్తూనే అదిరిపడి ఉరుక్కుంటా జమీందారు దగ్గరికి పోయి "అయ్యా... బావిలో కడవ వేస్తే నీళ్ల బదులు ఎముకలు పడుతున్నాయి. లోపల ఏ దయ్యం ఉందో ఏమో" అని చెప్పారు.
జమీందారుకు నమ్మకం కుదరక పోయి బావిలో స్వయంగా కడవ వేశాడు. అంతే ఇంకేముంది దానిలో కూడా నీళ్ల బదులు నిండుగా ఎముకలు వచ్చాయి. "ఇదేందిరా... బావినిండా ఎముకలు ఉన్నాయి. ఇదేదో దయ్యాల బావిలా ఉన్నట్టుందే" అనుకున్నాడు. ఆ చేనులో గట్టుమీద బాగా పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. ఒకటి తెంపుకొని ఇంటికి తీసుకువచ్చాడు. గుమ్మడికాయ కూర చేద్దామని జమీందారు పెళ్ళాం ఆ గుమ్మడికాయను కత్తితో మద్యకు కోసింది. అంతే లోపల తెల్లని పుర్రె బయటపడింది. అది చూసి ఆమె అదిరిపడి భయంతో కెవ్వున కేక వేసింది. 'ఏమైందో ఏమో' అని జమీందారు ఉరుక్కుంటా లోపలికి వచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది... వంటింటి మధ్యలో ధగధగా మెరిసిపోతా భయంకరంగా పుర్రె కనబడింది. దాన్ని చూస్తేనే ఆ జమీందారు గుండె గుబేలుమనింది. చూద్దామని మిగతా గుమ్మడికాయలు పగలగొట్టించాడు. అన్నింటిలోనూ పుర్రెలే... దాంతో "ఓరి దేవుడోయ్... ఇది దయ్యాల బావే కాదు... దయ్యాల చేను కూడా. పొరపాటున ఆ కన్నయ్య నుండి దీన్ని తీసుకున్నానే... ముందు ముందు ఇంకెన్ని భయంకరమైన వింతలు చూడాల్నో... ఏమో..." అనుకున్నాడు.
రాత్రి అందరూ పండుకున్నాక ఆ దయ్యం భయంకరంగా మొహానికి నల్లని రంగు పూసుకొని, తెల్లని కోరలు తగిలించుకొని, పెద్దపెద్ద గోళ్ళతో, ఎర్రని నోటితో జమీందారు గదిలోకి వచ్చింది. కుక్కదయ్యం జమీందారు మొహంలో మొహం పెట్టి 'భౌ.. భౌ' మంటూ అరుస్తా ముక్కును పట్టుకొని కసక్కున ఒక్క కొరుకు కొరికింది. దెబ్బకు ముక్కు సగానికి సగం తెగి మొహమంతా ఎర్రగా మారిపోయింది. ఆ మంటకు వాడు లబలబలాడుతా "ఎవర్రా నా మొక్కు కొరికింది" అంటూ కళ్ళు తెరిచాడు. చూస్తే ఇంకేముంది... గుండెల మీద కుక్కదయ్యం, ఎదురుగా తిక్కదయ్యం కనబడ్డాయి. వాటిని చూడగానే భయంతో వాడు అదిరిపోయాడు. నోట మాట రాలేదు. మంచానికి అట్లాగే వణుకుతా అతుక్కుపోయాడు. ఎవరనుకుంటున్నావురా నన్ను... కన్నయ్య తాతని. ఆ పొలం నాది. కష్టపడి పైసా పైసా దాచి సంపాదించిన సొమ్ముతో కొన్నది. నేను చచ్చిపోయాక నేను బాకీ ఉన్నానని చెప్పి ఆ పొలాన్ని దొంగతనంగా కాజేస్తావా... నా మనవడినే అందులోనుంచి వెళ్ళగొట్టేస్తావా... రేయ్ నా సమాధి పక్కనే నీ సమాధి కూడా కట్టే సమయం దగ్గర పడిందిరా. ఎవరినీ వదలను. మొత్తం నీ ఇల్లంతా వల్లకాడు చేసి నీ చేతికి చిప్ప పట్టిస్తా... మీ అందరినీ కట్టుబట్టలతో ఊరు దాటిస్తా" అనింది ఊగిపోతూ.
జమీందారు వణికిపోతూ ఆ తిక్కదయ్యం కాళ్ళమీద పడి "అయ్యా... తప్పు జరిగిపోయింది. ఇంకెప్పుడూ నీ మనవని జోలికి రాను. పువ్వుల్లో పెట్టి నీ చేను తిరిగి కన్నయ్యకు అందిస్తా. ఊర్లో మోసం చేసి గుంజుకున్నవన్నీ ఎవరివి వాళ్ళకు అప్పజెబుతా. ఈ ఒక్కసారికి నన్ను మన్నించు" అంటూ బోరుమన్నాడు.
"సరే... రేపటిలోగా ఇదంతా జరిగిపోవాల. లేదంటే రాత్రి మరలా వస్తా. వస్తే ఈసారి ఒంటరిగా పోను. నీతో సహా నీ వంశాన్నంతా తీసుకుపోతా. మాట తప్పినా, మడమతిప్పినా... పోతావ్. సర్వ నాశనం అయిపోతావ్. దిక్కు లేకుండా పోతావ్. జాగ్రత్త" అంటూ రెండూ మాయమయ్యాయి. జమీందారు తర్వాతరోజు పొద్దున్నే కన్నయ్య దగ్గరికి వచ్చి తప్పయిపోయింది అని కాళ్ళమీదపడి పొలాన్ని తిరిగి అప్పజెప్పాడు. ఊరిలో అందరివీ ఎవరివి వాళ్ళకు ఇచ్చి వేశాడు.
అప్పటినుండి ఆ ఊరివాళ్ళు తమకు ఏ సమస్య వచ్చినా సరే చెప్పుకోవడానికి అడవిలో కుడి వైపుకు పోవడం మొదలుపెట్టారు. అలా ఆ రోజు నుంచి దయ్యాల పాలనలో ఆ ఊరంతా ధర్మం నాలుగు పాదాలా నడవడం మొదలు పెట్టింది.
*********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి