సుప్రభాత కవిత : -బృంద
మౌనమైన మనసులో 
చిరు ఆశ కలిగించే 
ఉత్సాహపు ఊపిరిది 
ఎంత గొప్ప సాయమో!

నీరసించిన నిస్తేజపు 
నీలినీడలు కరిగించి 
నీకోసం నేనున్నాననే 
నేస్తానిదెంత గొప్ప గుణమో!

వాడిపోయిన మమతలను 
గుర్తుచేసి గుండెలో తడిని 
చెమరింపచేసి కొత్త చివురు 
తొడిగించే జ్ఞాపకాలదెంత గొప్పో!

తడబడ్డ అడుగులకు 
చేయూత నిచ్చి చేరదీసి 
చెదిరిపోని ధైర్యం నూరిపోసే 
చెలిమి ఎంత వరమో!

అందలేని  ఆనందం 
అనుకోక ఎదురువస్తే 
ఆలసించక అందుకోమనే 
ఆలోచన ఎంత మధురమో!

నిన్నలలో జరిగిన తప్పులు 
చిన్నవిగా ఎంచి మన్నించే 
మిన్న అయిన మనసుంటే 
రేపు ఎంత తియ్యనో!

చీకటిని తరిమేసి
చిరకాలపు వెలుగులిచ్చె 
లోకాలను మేలుకొలిపే 
ఆకాశదీపానిదెంత వెలుగో!

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు