అక్షరతోరణం:-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాలని
వడబోస్తా
మనసుని
పురికొలుపుతా

అక్షరాలని
ఏరుకుంటా
హస్తానికి
పనిపెడతా

కాగితాలని
కైపడతా
కలానికి
కార్యమప్పగిస్తా

రంగములోకి
దిగుతా
కవితలని
సృష్టిస్తా

అక్షరసంపదని
ఆకాశంలో చల్లుతా
నక్షత్రాలను చేసి
తోరణంకడతా

అక్షరావిరిని
గగనానికి పంపుతా
అంబుదాలను చేసి
తేలించుతా

అక్షరమేఘాలని
కరిగిస్తా
కవితా జల్లులని
కురిపిస్తా

అక్షరజలాన్ని
నదిలో కలుపుతా
కవితామృతాన్ని
క్రిందకు పారిస్తా

అక్షరసమూహాలని
కడలిలో వదులుతా
కవన తరంగాలని
ఎగిసిపడేస్తా

అక్షరజ్యోతులని
రవికిరణాలకు జోడిస్తా
కైతా కిరణాలని
ప్రసరింపజేస్తా

అక్షరవెలుగులని
చంద్రునిపై చల్లుతా
కయితా కౌముదిని
వెదజల్లిస్తా

అక్షరసుమాలని
బుట్టనిండాతెస్తా
అందంగా అల్లి
కవితాతోరణం కట్టేస్తా


కామెంట్‌లు