జీవితం మూడు ముఖ్యమైన దశలను దాటుకు వెళుతుంది . ఇంచుమించు అందరూ ఈ దశలను అనుభవిస్తారని నా నమ్మకం .
అవి -యవ్వనానికి ముందు ,యవ్వనం ,యవ్వనం తర్వాత . అయితే
ఏదశనూ అనుభవించకుండా జీవితం వెళ్లబుచ్చేవాళ్ళుకూడా మన సమాజంలో లేకపోలేదు . దానికి కారణాలు అనేకం . అయితే ఆడ అయినా ,మగ అయినా కోర్కెలు సహజం . అందులో శృంగార జీవితం
అంటే ఏమిటో తెలియకుండానే ,అలంటి కోర్కెలు సహజంగానే చాలామందిలో యవ్వనం లో ప్రవేశించక ముందే ప్రారంభ మవుతాయి .
అలంటి సమయంలో పుట్టే శృంగార భరిత కోర్కెలు ,కొందరిలో గందర -
గోళాన్ని కూడా సృష్టిస్తాయి . అలాంటప్పుడు ఆ యువకుడు లేదా
యువతి తెలిసీ తెలియని విషయాల్లో చిక్కుకు పోతారు . మరికొందరు
ఏమీ చేయలేని పరిస్థితిలో మానసిక క్షోభను అనుభవిస్తారు . అంత –
మాత్రమే కాదు ,మానసికంగా కృంగిపోతారు .
ఇక యవ్వన దశ చాలా ముఖ్యమైనది ,ప్రమాదమైనది కూడాను . ఈ వయసులో ‘ శృంగారం ‘ మనిషిని కుదిపేస్తోంది . ఇక్కడ తరతమ భేదాలు కనిపించవు . ఇక్కడ అదుపు చేసుకోగల వారు అదృష్టవంతులు
మిగతావారు ప్రేమ - దోమ అంటూ చెలరేగిపోతారు . ఏది ఏమైనా తర్వాత ఏదో రూపంలో పెళ్ళి తప్పదు . తర్వాత పిల్లలు ,వాళ్ళ పెంపకం ,చదువు
లు ,వాళ్ళ ఉద్యోగాలు ,వాళ్లకి పెళ్లిళ్లు ,వాళ్లకి పిల్లలు . అంతవరకూ ఏదో
ఇంతో అంతో శృంగార జీవితం అనుభవించినా ,మనవలు పుట్టాక అది ఏదో రూపంలో స్తంభించి పోతుంది
యవ్వనం తర్వాత దశ ఇదే ! వయసు మీరినా ,మనసులు యవ్వనం
తోనే బుసకొడతాయి కొందరిలో . దీనికి ఆడ -మగ ,తేడాలేదు . ఇక్కడినుంచే ఇబ్బందులు మొదలవుతాయి . భార్యకు ఇష్టం ఉంటే భర్తకు ఇష్టంలేకపోవడం ,భర్తకు ఇష్టం ఉంటే భార్యకు ఇష్టంలేకపోవడం .
మెజారిటీ రెండోరకం వాళ్ళే వుంటారు . ఇంచుమించు వయసుమళ్ళిన
వాళ్ళల్లో ఎక్కువశాతం మందిలో ఇది ఉంటుంది . అయితే ఇది కొందరు చెప్పుకుంటారు ,మరి కొందరు బయట పడరు . దీనితో అవగాహనా లోపాలు ,కోపతాపాలు ,అనారోగ్యాలు .. ఇలా ఎన్నెన్నో కొనితెచ్చుకునే సమస్యలు —---
ఇదేవిషయాన్ని కథా రచయిత శ్రీ పాణ్యం దత్త శర్మ తన కథ ‘ రాససిద్ధి’లో
చర్చించారు . కొందరికి ఈ కథ (సరసకథ )ఈ కథా సంపుటిలో చేర్చడం నచ్చక పోవచ్చుగాని ,ఇది చాలా అవసరమైన కథగా భావిస్తాను . జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను . కథలోని అహోబిల రావు పాత్ర ,వైదేహి పాత్ర ,మన చాలా కుటుంబాలలో
కనిపించే పాత్రలే !కొందరికి చెప్పుకోవడానికి ఇది బూతుగా అనిపింఛ వచ్చు . ఈ కథలో అహోబిలరావు ,భార్య మీద కోపగించి కొన్ని రోజులు
బయటికి వెళ్లిపోవడం కాస్త అసహజంగా అనిపించింది . వైదేహికి అమ్మవారు కలలో కనిపించడం కూడా అసహజమే ! నిజానికి వైదేహి పరమ భక్తురాలు . కలలో ముందుగానే అమ్మవారు కనిపించి హెచ్చరించ వచ్చుకదా !ఇద్దరికీ జ్ఞానోదయం కావడానికి అహుశః రచయిత ఈ సన్నివేశాలు కల్పించి ఉంటారని పాఠకుడు ఊహించుకోవచ్చు . మరో
విషయం భార్య మానసిక స్థితిని అవగాహన చేసుకోకుండా ఆ వయసులో
అహోబిలరావు తొందరపడటం కూడా కరెక్ట్ కాదు . ఇద్దరి మధ్య ఈ విషయంలో సయోధ్య వున్నప్పుడే అది జరగాలి .
రచయిత,దత్త శర్మగారు సరస కథల పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాసి వుంటారుగాని ,మామూలుగా అయితే రాసివుండేవారు కాదేమో !
ఇలాంటి మనోవైజ్ఞానిక కథలు ఇంకా రావలసిన అవసరం వుంది . ఈ కథ రాసి కొందరి మెదళ్ళకు పనిపెట్టిన దత్తశర్మ గారికి అభినందనలు .
***
(ఈ వ్యాసానికి ప్రేరణ -శ్రీ పాణ్యం దత్త శర్మ గారి కథా సంపుటి ‘ దత్త -
కథాలహరి ‘ లోని కథ ‘ రససిద్ధి ‘ )




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి