తిరుమలరావుకు బొబ్బిలి రోటరీ క్లబ్ సన్మానం

 కడుము ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ, వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ పై పాతపొన్నుటూరు యుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును, విజయనగరం జిల్లా బొబ్బిలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్, కారుణ్య ఫౌండేషన్ లు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం బొబ్బిలి రోటరీ  కార్యాలయంలో నిర్వహించిన సాహిత్య సమావేశంలో ఆయన ఈ గౌరవాన్ని పొందారు. విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. రచనలు చేయుటలోను, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం సాహిత్య సేవగావించుటలోను మిక్కిలి కృషి చేస్తున్న ఐదుగురు రచయితలను గుర్తించి సత్కరించారు. వారిలో తిరుమలరావు కూడా ఎంపికై ఈ ఘనసన్మానం స్వీకరించారు. సభాధ్యక్షులు రోటరీ క్లబ్ విజయనగరం జిల్లా ఛైర్మన్, కారుణ్య ఫౌండేషన్ ఛైర్మన్ జె.సి.రాజు, ముఖ్య అతిథి బొబ్బిలి ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రి ఎం.డి. జనరల్ మెడిసన్ డా.ఎన్.అభినవ స్వామి నాయుడు, గౌరవ అతిథి ఎన్.ఆర్.ఐ.ఆసుపత్రి సి.ఇ.ఓ. బొబ్బిలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎస్.శ్రీనివాసన్, ఆత్మీయ అతిథులు రోటరీ క్లబ్ ప్రతినిధులు వి.శ్రీహరి, కె.రామకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులు బొబ్బిలి పట్టణానికి చెందిన రచయిత పెదప్రోలు నాగరాజు, బాడంగి గురుకుల పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పాలవలస వెంకటేశ్వరరావులు వేదికనలంకరించి తిరుమలరావు సాహితీ సేవలను కొనియాడారు. అనంతరం తిరుమలరావును  శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తిరుమలరావుతో పాటు సన్మానం పొందిన బొబ్బిలి పట్టణానికి చెందిన రచయిత తాడుతూరి వెంకట రమణారావు, రాజా డిగ్రీ కళాశాల అధ్యాపకులు బేతనపల్లి వేణుగోపాలనాయుడు, తెలుగు ఉపన్యాసకురాలు ఖండాపు జ్యోత్స్న, ఉత్తమ ఉపాధ్యాయని చిట్టిమోజు ఉషారాణి, ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు, సాహిత్యవేత్తలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు