న్యాయములు-730
సుప్త డింభ ముఖ చుంబన న్యాయము
****
సుప్త అనగా నిద్రించువాడు.డింభ అనగా అనగా చిన్న బిడ్డ, చిన్న జంతువు.ముఖ అనగా నోరు , ముఖము, అగ్రభాగము,పక్షి ముక్కు, ద్వారము, ఆరంభము, ప్రస్తావన, ముఖ్యము, ఉపాయము. చుంబక అనగా ముద్దు పెట్టుకొనువాడు, మోసగాడు అనే అర్థాలు ఉన్నాయి.
"నిదురించే శిశువు లేదా బాలుని ముఖము ముద్దొచ్చి ముద్దు పెట్టుకున్పట్లు"అని అర్థము.
అసలే పసిపిల్లలు చూడటానికి ముద్దొస్తూ వుంటారు. వారి మోముల్లో దైవత్వం కనిపిస్తుంది. గులాబి పూవుల్లా సున్నితంగాను, చక్రాల్లా తిప్పే కళ్ళు చిన్ని వెలుగుతున్న బల్బుల్లా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటారు.
అందుకే పనితనాన్ని చాలా మంది కవులు వర్ణించారు.ఒక్క సారి అవేమిటో చూద్దాం.
శిశువు గురించి జాషువా గారు ఇలా అంటారు..." గానమాలింపక కన్ను మూయని రాజు/ అంబ కౌగిట పంజరంబు చిలుక/... ఉయ్యాల దిగని భాగ్యోన్నతుండు/ ఉఊలు నేర్చిన యొక వింత చదువరి....ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి/తన ఇంటి క్రొత్త పెతైతనపు దారు "అంటారు.దీని భావం ఈపాటికి అర్థమై వుంటుంది.
పాట పాడితే కానీ నిద్ర పోడు.తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుక లాగా ఒదిగిపోతాడు... కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పరదేశి.తన ఇంటికి కొత్త యజమాని... అంటారు.
ఇక దాశరథి కృష్ణమాచార్య గారు "పిల్లల్లారా. పాపల్లారా... పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా" అనే పల్లవితో వాళ్ళ కన్నుల్లో పున్నమి జాబిలి ఉన్నాడు" అంటూ అద్భుతమైన గేయం రాశారు.
అలాగే కాళోజీ నారాయణరావు గారు"ఆరుద్ర పురుగంత మెత్తన - మఖ్ మల్ గుడ్డ వేల సున్నితంగా ఉంటారు శిశువులు "అని గొప్ప కవిత రాశారు.
ఇక సినారె గారు "పాపాయి నవ్వాలి పండగే రావాలి/ మాఇంట కురవాలి పన్నీరు అంటూ గేయాలు, గజల్స్ రాశారు.
మరో మనసు కవి ఆరుద్ర గారు "పిల్లలూ దేవుడూ చల్లని వారే/ కల్లాకపటమెరుగని కరుణామయులే"అంటూ అద్భుతమైన గేయం రాశారు.
ఇలా పసితనం గురించి, బాల్యం గురించి రాయని కవులూ రచయితలూ లేరు అంటే అతిశయోక్తి కాదు. వారంతా బాల్యాన్ని, శిశువులను స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా, అమాయకత్వానికి చిరునామాగా , పెద్దలను మించిన దొడ్డగుణం పిల్లల్లో ఉండటం గురించి రాశారు.
ఇక విషయానికి వద్దాం. పసితనమే అందమైనది. ఎల్లలు కల్లలు తెలియదు. ఉయ్యాలలో శిశువుకు బొజ్జ నిండా పాలు కుడిపితే చాలు.హాయిగా ఉయ్యాలలో బజ్జొని చిద్విలాసాలను చిందిస్తూ వుంటాడు. ఎంత కర్కశ వ్యక్తి అయినా పసివాళ్ళను చూసి తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుని, వారి ముద్దు మొగాల్ని చూసి ఆనందించకుండా ఉండడు.అంత గొప్పది ఈ బాల్యం.
మరలాంటి శిశువుల్లో కొందరు మెలకువలో బాగా అల్లరి చేస్తుంటారు. వాళ్ళ అల్లరి అంతా ఇంతా కాదు. ఇక నిద్రపోయిన సమయంలో ఆ పసివాడి మొఖము చూస్తే.మెలకువలో ఎంత అల్లరినో..ఇక నిద్ర పోతే చూపులను ఎంతగా ఆకర్షిస్తాడో చెఫ్ఫుకుంటూ వుంటేనే పెదవులపైన, మోములోన దరహాసం... నిద్రపోయిన బాలుడు లేదా శిశువు చూడ ముచ్చటగా ఉన్నప్పటికీ నిద్రలో వాడిని ముద్దు పెట్టుకుంటే వాడికేం తెలియదు..
అందుకే నిద్ర పోతున్న పిల్లలకు ముద్దు పెట్టవద్దని,అలా చేస్తే పిల్లలకు ఆయుఃక్షీణం అంటుంటారు.
మరి మన పెద్దవాళ్ళు ఈ "సుప్త డింభ ముఖ చుంబన" న్యాయమును చెప్పడంలోని అంతరార్థం ఏమిటంటే.. కొంతమంది ఎప్పుడూ ముఖం ముటమటలాడించుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ అనురాగాన్ని వ్యక్తం చేయరు.అలాంటి వారు చేసేది ఎలా ఉంటుందంటే ఇలా నిద్రపోయిన తర్వాత ముద్దు పెడితే నీ వ్యక్తం చేయాలనుకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేయలేవు.కాబట్టి ..అలా చేయకూడదు అని చెప్పడమే ఇందులోని అంతరార్థం.
కాబట్టి ఇదిగో ఈ సామెతలా "మనున్నప్పుడు ( ప్రాణం) మంచినీళ్ళు కూడా ఇవ్వని వాడు సమాధి మీద సత్రదానం చేశాడట" అనే విధంగా ఎవ్వరూ ఉండకూడదు అనేది ఈ న్యాయము లోంచి మనం గ్రహించాల్సిన విషయం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి