అభివృద్ధికి దూరంగా యునివర్శిటీలు:-సి.హెచ్.ప్రతాప్

 తెలుగు రాష్ట్రాలలో వున్న పలు యునివర్శిటీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కేటాయిస్తున్న నిధులు సరిపోక, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విశ్వవిద్యాలయాలు విలవిల్లాడుతున్నాయి. కొన్ని వర్సిటీలలో ఇంచార్జి వి సి లతో, కాంట్రాక్ట్ అధ్యాపకులతో నెట్టుకొచ్చేస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీల సమస్యలు పరిష్కారం చేసి వాటిని అభివృద్ధి దిశగా నడిపించాలని అశేష విద్యార్ధి లోకం కోరుతోంది. అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడం, రిసెర్చ్ గ్రాంట్స్ విడుదల చేయకపోవడంతో పరిశోధనలు పక్కదారి పట్టాయి.అభివృద్ధి, నాణ్యత లేక ప్రమాణాలు దిగజారిపోయి ర్యాంకింగులలో పడిపోతున్నాయి.ఫలితంగా క్యాంపస్ రిక్రూట్మెంట్లలో కూడా మన ఉన్నత విద్యా సంస్థలు క్రమంగా వెనుకపడిపోతుండడం దురదృష్టకరం.
పేద వర్గాల విద్యార్థులను పరిశోధనలు చేయడానికి ప్రోత్సహించాలి. నేషనల్ ఫెలోషిప్స్ రాని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 25 వేల రూపాయలు,పీజీ విద్యార్థులకు నెలకు ఐదు వేలు ఫెలోషిప్‌ ఇవ్వదంతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యార్థుల స్కిల్స్ పెంచడానికి చర్యలు తీసుకోవాలి. యూనివర్శిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలి. నూతన హాస్టల్స్ నిర్మాణం, మోడ్రన్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, రిసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి.ఉన్నత విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపుకు చిత్తశుద్ధితో కృషి చేయడం ఎంతో అవసరం
కామెంట్‌లు