గణితశాస్త్ర అభివృద్ధికి స్ఫూర్తి - రామానుజన్ కీర్తి

 ప్రపంచ గణితశాస్త్ర అభివృద్ధికి శ్రీనివాస రామానుజన్ ఎనలేని కృషి చేసారని, అందుకే గణితశాస్త్రవేత్తగా ప్రఖ్యాతినొంది, అందరికీ ఆదర్శంగా నిలిచారని  పాత పొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి డిసెంబర్ 22 పురస్కరించుకొని నేడు నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రామానుజన్ కేవలం పదమూడేళ్ళ వయసులోనే యూలర్స్ ఫార్ములా, త్రికోణమితిలందు గల అపరిష్కృత సమస్యలను పరిష్కరించే గణిథమేథావి అని, తాను సొంతంగా పలు సిద్ధాంతాలను రూపొందించిన విజ్ఞాని అని అన్నారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ మాట్లాడుతూ బీజ గణితం, అన్ లిటికల్ జామిట్రీలందు గల 6165 సిద్ధాంతాలలో రామానుజన్ తన ప్రతిభతో 3500 సిద్ధాంతాలను పరిష్కరించారని ఇది పదిహేనేళ్ల వయసులోనే సాధించడం గొప్ప విషయమని అన్నారు. ఉపాధ్యాయులు బొమ్మాళి నాగేశ్వరరావు మాట్లాడుతూ తమిళనాట సాధారణ కుటుంబంలో 1887లో వెలసి, 1920లో కన్నుమూసిన శ్రీనివాస రామానుజన్ కేవలం ముప్పై మూడేళ్లే జీవించారని, ఐననూ తన అసాధారణ తార్కిక ఆలోచనలతో నిరంతర శ్రమించి ఈ లోకానికి విశిష్టమైన గణితభావనలు సమకూర్చి చిరస్మరణీయుడయ్యారని  అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ఆరేళ్ల పాటు పరిశ్రమించి ఇంగ్లాండ్ కు 32పరిశోధక పత్రాలు సమర్పించారని అన్నారు. ఫలితంగా ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీలనే గౌరవాలతో సత్కరించబడి, వాటిని స్వీకరించిన తొలి భారతీయుడిగా వినుతికెక్కారని అన్నారు. 
ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, అందవరపు రాజేష్ లను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తొలుత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణితశాస్త్ర అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలైన సవిరగాన శ్రావ్య, పతివాడ హరిణి, డోల దిలీప్, దామోదర నిత్యశ్రీ, బలగ హేమంత్, గంగు మణిలకు బహుమతులను అందజేసారు.  అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు