న్యాయములు-723
సంధి న్యాయము
****
సంధి అనగా కలయిక,పొందు,సందు అనే అర్థాలు ఉన్నాయి.
వ్యాకరణంలో కూడా సంధి అనగా అర్థం కలయిక. రెండు పదాలు కలవడాన్ని సంధి అనొచ్చు.అచ్చుల మధ్య కలయిక,హల్లుల మధ్య కలయిక సంధి అవుతుంది.
ఇక మామూలుగా అయితే సంధి అనేది స్నేహం యొక్క విధానం అనుకోవచ్చు. కలయిక ,పొందు అనవచ్చు. ఇది ముఖ్యంగా రాజుల లాంటి వారు తమ శత్రువు కంటే బలహీనంగా ఉన్నప్పుడు,శత్రువు వల్ల తమకు ఏమీ హాని కలగకుండా సంధి విధానాన్ని కుదుర్చుకుంటారు. రక్షణలో భాగంగా వ్యూహాత్మకంగా శత్రువుతో స్నేహాన్ని గరపడాన్ని కూడా సంధి అని అంటారు.
అయితే సాహిత్య పరంగా పదాల మధ్య సంధిని "పాణిని" రూపొందించాడని అంటుంటారు.
అయితే రాజకీయ పరంగా చూసినట్లయితే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఇతర రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఎలాంటి విధానాలు అనుసరించాలో చెప్పాడు.. అందులో మొదటిది శాంతి (సంధి), యుద్ధం (విగ్రహ)తటస్థత (ఆసన) మార్చింగ్ (యాన).అనే విధానాలు లేదా పద్ధతులు పాటించాలి.
సంధి కుదుర్చుకోవడంలో సహజ మరియు కృత్రిమ అని రెండు రకాల మిత్రులు ఉంటారని చెప్పాడు. సహజ మిత్రులతో భయం లేదు కానీ కృత్రిమ మిత్రులతో అప్రమత్తంగా ఉండాలి.
పై విషయాలన్నీ చదివిన తర్వాత ఈ "సంధి న్యాయము" గురించి తెలుసుకోగలిగిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే సంధిలో ముఖ్యంగా కలవడం మరియు కలుసు కోవడం ఉంటుందనీ. సాహిత్యంలో కూడా రెండు పదాల కలయిక అని తెలుసుకున్నాం.
అలాగే రాజకీయంలో ఈ సంధి నియమం ద్వారా కొంత అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇందులో ఆయా వ్యక్తులకు ఎవరు వాళ్ళ మిత్రులో ఎవరు శత్రువులో తెలుసుకునే వీలు,మసలుకునే అవగాహన ఉంది.
దీనికీ సంబంధించిన మరో ఉదాహరణ చూద్దాం.భజగోవిందంలో ఒక శిష్యుడు చెప్పిన శ్లోకం -" "శత్రౌ మిత్రౌ పుత్రౌ బన్దే భేదా జ్ఞానం!" అనే దీనిలో శత్రువులు, మిత్రులు, పుత్రులు, బంధనాలు, తగాదాలు వంటి కార్యాల్లో సమయాన్ని వృధా చేసుకోకుండా సంధి కుదుర్చుకోవడం మంచిదని, అంటారు. అలా కుదుర్చుకున్న సంధి ఒప్పందం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఏది ఏమైనా ఈ "సంధి న్యాయము"లో అనేక విషయాలు ఉన్నాయనేది మనకు అర్థం అయింది.మనం నిత్య జీవితంలో ఇష్టంగా, ఇష్టం లేకుండా సంధి కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తూ వుంటాం. అలాగైతేనే ప్రశాంతంగా బతుకగలం. సంధి ఒక విధంగా సర్దుకుపోవడం లాంటిది అన్న మాట.
అయితే ఆధ్యాత్మిక వాదులు ముఖ్యంగా శివుని కుటుంబాన్ని ఓ ఉదాహరణగా ఈ సంధి గురించి చెబుతుంటారు. అందులో శివుడు, పార్వతి, వినాయకుడు,కుమార స్వామి.. వీరి వాహనాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకంటే అవి ఒకదానికి మరొకటి విరోధి. అమ్మ వారి వాహనం పులికి శివయ్య వాహనం నందికి పడదు. కుమార స్వామి వాహనం నెమలికి శివుని మెడలో ఉన్న నాగుపాముకు వైరమే.వినాయకుని వాహనం ఎలుకకు నెమలికి వైరం. విచిత్రం ఏమిటంటే ఇలా వైరం కల జంతువులు అన్నీ శివ పరివార్ లేదా శివుని కుటుంబంగా ఉన్నాయి.
దీని ద్వారా శివుడు మనకు బోధించేది ఏమిటంటే కుటుంబం, సమాజంలో వైరుధ్య భావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు కానీ కలిసి బతకడం నేర్చుకోవాలి. ఒకరినొకరు చంపుకోవడం, ఈర్ష్య అసూయలతో, మోసాలతో బతకవద్దు తమవలె సంధి కుదుర్చుకుని కలిసి మెలిసి ఉండాలని చెబుతున్నాడా శివ పరమాత్మ.
కాబట్టి పై విషయాల ద్వారా "సంధి న్యాయము" అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. వీటిని దృష్టిలో పెట్టుకొని ,ఆ విధంగా జీవిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి