సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-709
శ్యాల శునక న్యాయము
*****
శ్యాల అనగా  పెండ్లి కూతురు తమ్ముడు. శునక అనగా కుక్క.
శ్యాల శునక అనగా కుక్కను తమ్ముడిగా లేదా వ్యక్తిగా భావించుట అని అర్థము.
"శ్యాల శునక న్యాయము"అనేది ఒక సరదా న్యాయము.అయితే ఇందులో భార్యను ఆట పట్టిస్తూ అనే మాట.అయితే దీనిని కూడా మన పెద్దలు ఒక న్యాయముగా చెప్పడం విశేషం.అదేంటో చూద్దామా!
ఒకానొక వ్యక్తి తన భార్యకు కోపం కలిగించి ఏడిపించడానికి తన ఇంట్లో పెంచుకునే కుక్కని బావా! బావా! అని పిలుస్తూ అవమానిస్తూ ఉండే వాడు. అయినా ఆ  మెతక వైఖరి, అమాయకత్వం గల ఆ ఇల్లాలు పోనీలే అని సహిస్తూ వస్తోంది.
అది తట్టుకోలేక ఆ వ్యక్తి ఒకనాడు ఆ కుక్కను చావ మోది బావా! చచ్చావా? బతికావా? ఇంకా చావలేదా? అంటూ బండబూతులు తిడుతూ ఉంటే ఇక ఆ ఇల్లాలు సహించలేక పోయింది.
 నిజంగా ఆ కుక్క స్థానంలో తన తమ్ముడుగానో,అన్నగానో ఊహిస్తూ భోరున ఏడుస్తూ భర్తతో తగువు పెట్టుకుంది.అతడికి కావాల్సింది కూడా భార్యను ఏడిపించడమే కదా! అతడి కోరిక తీరింది.
అయితే మన పెద్దవాళ్ళు దీనిని గురించి ఏమంటారంటే కొందరికి తనకు సంబంధించని వస్తువులపై కూడా మమకారం పెరుగుతుంది,ఆ వస్తువులకు ఏదేని హాని సంభవించినప్పుడు వాటి గురించి దుఃఖించడం అనేది లోక స్వభావం.అందుకే ఆ స్త్రీ అలా దుఃఖించింది అంటారు.
 ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే నిత్య జీవితంలో  చాలా మంది మనుషులు తాము పెంచుకునే జంతువులను, కొనుక్కున్న వస్తువులను ప్రాణ ప్రదంగా భావిస్తారు. వాటికేమైనా అయితే తమకే జరిగినంతగా దుఃఖ పడుతుంటారు.
అంటే ఇక్కడ మనం ఈ న్యాయమును రెండు రకాలైన కోణాల్లో చూడాలి. ఒకటి ప్రాణమున్న జంతువులతో అనుబంధం పెంచుకొని వాటిని మనలాంటి మనుషులుగా భావించడం.వాటికి ఏమైనా జరిగితే తమ ఆప్తులకు జరిగినంతగా బాధ పడటం, దుఃఖించడం. ఇక రెండో కోణంలో చూస్తే వస్తువులను కూడా ప్రాణప్రదంగా  భావించడం. అవి చేజారిపోయినా, కనబడకుండా పోయినా అయ్యో !అని  వేదనకు లోనవ్వడం.
మొదటిది మన నిత్య జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాము.తాము పెంచుకున్న కుక్కలు, పిల్లులు, చిలుకలు మొదలైన వాటితో అనుబంధం పెంచుకొని.వాటికేమైనా అయితే తట్టుకోలేక పోవడం‌.వాటినే తలుస్తూ  విపరీతమైన వేదనకు లోను కావడం చూస్తుంటాం.  దానికి దగ్గరగా ఉన్నదే ఈ "శ్యాల శునక న్యాయము".
ఇందులో తనంతట తాను అనుకోకపోయినా భర్త వల్ల  కుక్కను సోదరుడిగా భావించిందా ఇల్లాలు.
మనిషిలోని కౄరత్వం మరియు మానవత్వం రెండూ ఇందులో ఇమిడి ఉన్నాయి.మానవ మనస్తత్వంలో ఇలాంటి వారు ఉంటారని కూడా చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ.
ఇదండీ "శ్యాల శునక న్యాయము" లోని అంతరార్థము. ఎలా ఉండాలో ఉండకూడదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

కామెంట్‌లు