న్యాయములు-725
సర్ప ఫణ న్యాయము
*****
సర్ప అనగా పాము. ఫణ అనగా పాము పడగ అని అర్థము.
"పాము పడగ నీడన కప్ప చందాన" అనగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండటాన్ని ఈ సామెతతో పోల్చి చెబుతారు.
"పాము పడగ నీడ" అనే పదబంధంలో పాము అనేదే విషపూరితమైనది.అది కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పడగ విప్పుతుంది అలాంటి పాము పడగను సురక్షింతంగా భావించలేం. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో ఆ నీడలో తలదాచుకుంటే కలిగేది నష్టమే.జరిగేది ప్రాణ హానియే.కాబట్టి పాము పడగ నీడ అనేది కష్టం, నష్టం కలిగించేది అని అర్థము చేసుకోవాలి.
అలాంటి భావనను దృష్టిలో పెట్టుకొని దీనిని నిత్య జీవితంలో రకరకాలుగా ఉపయోగిఃచడం విశేషం.
ఇలా ఈ "పాము పడగ నీడ"ను అనేక సందర్భాల్లోనూ, అనేక విషయాలు చర్చించేటప్పుడు ఉపయోగిస్తారు.
"ఆధిపత్యం కోరల్లో అమాయకులు చిక్కుకుని క్షణం క్షణం భయంతో బతుకుతున్నప్పుడు ఉపయోగించే వాక్యం "ఆధిపత్యం పడగ నీడలో" అమాయుకుల జీవితం అని అంటుంటారు.
అలాగే దేశంలో లేదా రాష్ట్రంలో వానలు పడకుండా ఆ ప్రాంతాలు అల్లాడి పోతున్నప్పుడు "కరువు పడగ నీడలో రాష్ట్రాలు లేదా ప్రజలు" అనడం పరిపాటి.
రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు.అక్కడికి జీవనోపాధి కోసం ఇతర దేశాల పౌరులను సురక్షితంగా తీసుకుని రావడం కష్టంగా ఉంటుంది. తమ పౌర భద్రత గురించి చెప్పేటప్పుడు పడగ "నీడలో పౌర భద్రత" అనే వాక్యాన్ని ఉపయోగిస్తారు.
అంతే కాదు దుష్టుడి యొక్క స్నేహము కానీ, దుష్టుడు అధికారి,లేక యజమాని అయినప్పుడు అతని వద్ద పనిచేయడం అనేది ఎప్పుడేం ఉపద్రవం ముంచుకొస్తుందో అనే భయాన్ని కలిగిస్తుంది.అలాంటప్పుడు ఈ "పాము పడగ నీడలో ఉన్నట్టుంది"అనే వాక్యమును ఉపయోగించడం సరిగ్గా సరిపోతుంది.ఇలా ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకునే ఈ న్యాయము గురించి ఎంతో కొంత తెలుసుకోగలిగాము.
ఏది ఏమైనా ఈ "సర్ప ఫణ న్యాయము " ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దుష్టులు,నీచుల అధికార అహంభావులది ఎప్పటికీ పాము పడగ నీడే కాబట్టి . పాముని సాధువు అనలేం కనుక ఎల్లప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.వారి సహకారం, సాన్నిహిత్యానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదూ!
సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి