సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-728
సింహ మృగ న్యాయము 
    *****
సింహ అనగా సింహము కేసరి, మృగరాజు. మృగ అనగా జింక ,లేడి  అని అర్థము.
సింహమునకు లేళ్ళకు సహజమైన వైరము కలదు.ఆ వైరంలో ఏం జరుగుతుంది?బలమైన వారి  చేతుల్లో బలహీనులు,బలైపోతారు" అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.అంటే ఇక్కడ మనం శారీరక, మానసిక బలం అని కూడా చెప్పవచ్చు.
"డేగకు పావురం  సహజ సిద్ధంగా కల్పించబడిన ఆహారం" అని వేదం చెప్పినట్లు (శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి) సింహానికి జింక/లేడి సహజ సిద్ధంగా కల్పించబడిన ఆహారం.
 మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వివిధ రకాల జంతువులు కలవు.వాటిల్లో కొన్ని మాంసాహారులు మరికొన్ని శాఖాహారులు.శాఖాహార జంతువులకు సమస్యే లేదు. నేలపై పెరిగే రకరకాల గడ్డి, ఆకులు అలములు వాటి ఆహారం. మానవులు తమ పెంపుడు శాఖాహార జంతువుల కోసం ఆహారాన్ని  సేకరించి పెట్టడంలో  సులువు, వెసులుబాటు ఉన్నాయి.
ఇక మాంసాహార జంతువులు శాఖాహారం కూడా తీసుకోగలిగితే ఎలాంటి సమస్యా ఉండదు. పిల్లి, కుక్క ఇవి మాంసాహారులు ఐనప్పటికీ శాఖాహారం కూడా తీసుకుంటాయి.
అయితే కేవలం మాంసాహారం మాత్రమే తీసుకునే పులులు, సింహాలు, హైనాలు, తోడేళ్ళు, నక్కలు   తినడానికి ఏదైనా జంతువు ఆహారంగా దొరక్క పోతే ఉపవాసమైనా ఉంటాయి కానీ గడ్డీ గాదం తినవు. అందుకే పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో ఓ చోట  సింహం గడ్డి తింటుందా? అని ప్రశ్నిస్తూ తినదు అనే విషయాన్ని చెబుతాడు.
 ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు సూటిగా విషయం  చెప్పొచ్చు కదా అంటారేమో కదూ!ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే  సింహం, పులి లాంటి జంతువులు తమకు ఆహారంగా జంతువులను వేటాడి తింటాయి.
 అయితే  సింహాల వేటలో అడవి దున్న, జిరాఫీ లాంటి జంతువులతో పాటు జింకలు కూడా ఉన్నాయి.
 జింక శాఖాహార జంతువు. ఇది సమూహంగా జీవిస్తుంది.ఇది గంటకు 35 మైళ్ళ వేగంతో పరుగెత్తగలవు. వాటిని ప్రపంచంలో అత్యంత వేగవంతమైన జంతువుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
  సింహం దాడినుంచి ఎదుర్కోవడానికి, తప్పించుకొని  పారిపోవడానికి జింక ఎంతో దూరం పరుగెత్తుతుంది.కానీ  సింహం దాడికి బలై పోతుంది.
 మన పెద్దలు ఈ "సింహ మృగ న్యాయము" చెప్పడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. బలహీనుడికి బలవంతుడికి మధ్య కనిపించని పగ లాంటిది.బలహీనులు ఎక్కువగా బలవంతుల చేతుల్లో అకారణంగా కూడా బలై పోతుంటారు.
 
 అందుకే   జింకలు బలమైన జంతువైన సింహానికి దూరంగా గుంపులుగా జీవిస్తాయి.రెండూ అడవిలో ఉండే జంతువులే అయినా వేటి ప్రదేశాలు వాటికి ప్రత్యేకంగా ఉంటాయి.పొరపాటున జింక దారితప్పి సింహం ఉన్న ప్రాంతానికి వెళ్ళినా, సింహం ఆకలై జింకల ప్రదేశానికి వచ్చినా జింకకే ప్రాణాపాయం.
కాబట్టి జింకలు ఎల్లప్పుడూ తమ తమ స్వీయ రక్షణలో ఉండాలి. ఈ "సింహ మృగ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే బలవంతుడి చేతిలో బలై పోయేది బలహీనమైన యుక్తి లేని అమాయకమైన జంతువులేననీ, మనమూ జింకల్లాంటి వారం కనుక బలవంతులైన దుష్టులకు సదా దూరంగా ఉండాలి.

కామెంట్‌లు