రచయితలకు బొబ్బిలి రోటరీ క్లబ్ సన్మానాలు

 తెలుగు భాషను బ్రతికించు కుందామని, ప్రతి ఒక్కరూ తెలుగు తీయదనాన్ని ఆస్వాదించాలని
రోటరీ క్లబ్ విజయనగరం జిల్లా చైర్మన్, కారుణ్య ఫౌండేషన్ ఛైర్మన్ జె.సి.రాజు అన్నారు.
తెలుగు అనేది రోజు రోజుకు ప్రాభవాన్ని కోల్పోయేలా ఉందని, వినియోగం తగ్గిపోయేలా ఉందన్న ఆందోళనతో, మనసు కలచి వేస్తోందని ఆయన అన్నారు. తెలుగు భాషను బ్రతికించుకోవలసిన బాధ్యత తెలుగు ప్రజల తక్షణ కర్తవ్యమని రాజు పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్, కారుణ్య ఫౌండేషన్ లు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం స్థానిక రోటరీ  కార్యాలయంలో నిర్వహించిన సాహిత్య సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు.  విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల  నిర్వహణ నేపథ్యంలో, బొబ్బిలిలో  రచనలు చేయుటలో మిక్కిలి కృషి చేస్తున్న ఐదుగురు రచయితలను గుర్తించి, వారిని ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రి ఎం.డి. జనరల్ మెడిసన్ డా.ఎన్.అభినవ స్వామినాయుడు, గౌరవ అతిథిగా ఎన్.ఆర్.ఐ.ఆసుపత్రి సి.ఇ.ఓ. బొబ్బిలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎస్.శ్రీనివాసన్, ఆత్మీయ అతిథులుగా రోటరీ క్లబ్ ప్రతినిధులు వి.శ్రీహరి, కె.రామకృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా రచయితలు పెదప్రోలు నాగరాజు, పాలవలస వెంకటేశ్వరరావులు వేదికనలంకరించి సన్మానితుల సాహితీ సేవలను కొనియాడారు. అనంతరం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు,  బొబ్బిలి పట్టణానికి చెందిన రచయిత తాడుతూరి వెంకటరమణా రావు, రాజా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు బేతనపల్లి వేణుగోపాలనాయుడు, తెలుగు ఉపన్యాసకురాలు ఖండాపు జ్యోత్స్న, ఉత్తమ ఉపాధ్యాయని చిట్టిమోజు ఉషారాణిలను శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ప్రభుత్వం వారు తెలుగు భాషను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని, మాతృభాషలో విద్యనభ్యసించిన వారికి పోటీ పరీక్షల్లో ఉద్యోగాల్లో  ప్రాముఖ్యతనివ్వాలని కోరారు.  కార్యక్రమంలో ఎన్.ఆర్.ఐ ఆసుపత్రి సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు, సాహిత్యవేత్తలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు