సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-722
'సహైవ దశభిః పుత్రై ర్భారం వహతి గర్దభీ' న్యాయము
****
సహైవ అనగా కూడా,కలిసి.దశభి అనగా పదిమంది.పుత్రై అనగా పుత్రుల యొక్క. ర్భారం అనగా బరువు.వహతి అనగా మోయు,వీచు,ప్రవహించుకొనిపోవు,ఓడ.గర్దభ అనగా  గాడిద అని అర్థము.
"పది పిల్లలతో కలిసి పోవుచున్న సమయంలో భారమంతా తల్లి గాడిద ఒక్కటే మోస్తూ వుంటుంది" అని అర్థము.
దీనినే మరో రెండు విధాలుగా చెబుతూ ... "సహకారిత్వం కర్మణాం న విద్యాయాః.....సత్సు కర్మసు విద్యైవ స్వకార్యే వ్యాప్రియతే యథా దశభిః పుత్రైః......."అనగా విద్యకు కర్మలు సహకారులు కాబోవు..... అనేక కర్మలున్నను విద్యయే తన కార్యమున ప్రవర్తించును..... అలాగే ఇంటిలో పది మంది తినేవారు ఉన్ననూ ఇంటి యజమాని ఒకడే ఆ ఇంటి పోషణ భారమంతయూ మోయునట్లు"అని ఉదాహరణలతో అర్థము చేయించడం జరిగింది.
ఈ న్యాయమును నిశితంగా పరిశీలించి చూసినట్లయితే ఇందులో ఎంతో గొప్ప అర్థము ఇమిడి ఉంది.అనేక రకాల కోణాల్లో దీనిని చూడవచ్చు.
మొదటి కోణంలోంచి చూస్తే.."ఎంత మంది పిల్లలు ఉన్నా ఎలాంటి బాధ మనసులోకి రానీయకుండా మోసే తల్లి" గురించి చెప్పబడింది.తల్లి సేవల గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు.అక్షరాలలో ఒదగవు.ఎంత చెప్పినా తక్కువే. అందుకే  "కనిపెంచే తల్లికి పిల్ల భారమా!" అంటారు. అందుకనే మన భారతీయ సంస్కృతిలో మాతృమూర్తిని ప్రథమ స్థానంలో నిలిపి "మాతృ దేవోభవ" అన్నారు. వ్యక్తులు పుట్టిన దగ్గర్నుంచి ఏ వయస్సులో ఉన్న వారికైనా అమ్మ ఉంటే చాలు సకల సద్గురువులు, హితైషులు వెంట ఉన్నట్లే.ఎన్నో మంచి మాటలు చెప్పి సన్మార్గంలో నడిపిస్తుంది .
ఇక 'ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లి ఎప్పుడూ వారిని భారం అనుకోదు'.అలాంటి అమ్మను గురించి రాసిన చక్కని సినిమా పాటను చూద్దాం... "ధరణికి గిరి భారమా! గిరికి తరువు భారమా/ తరువుకు కాయ భారమా/కనిపించే తల్లికి పిల్ల భారమా/"అంటూనే మన పెద్దవాళ్ళు "కుపుత్రో జాయేతా క్వచిదపి కుమాతా నభవిష్యతి" అని అంటారు.అంటే 'చెడ్డ పుత్రుడు ఉండవచ్చేమో కానీ చెడ్డ తల్లి  ఎక్కడా ఉండదు' అని అర్థము.
 ఇక విషయానికి వద్దాం.చాలా మంది సంచార జీవులను చూస్తూ వుంటాం. వారిది వలస జీవితం. వారిలో ప్రతి కుటుంబానికి ఒక్క గాడిదైనా వుంటుంది. వాళ్ళు ఒక చోటి నుండి మరో చోటుకు వెళ్ళేటప్పుడు వారి వస్తు సామగ్రి బరువునంతా దాని మీద వేస్తుంటారు. అది ఎంత బరువైనా కిక్కురుమనకుండా మోస్తూనే వుంటుంది. అందుకే ఇక్కడ పది పిల్లలతో అంటే "పదిమంది పిల్లలతో వెళ్తున్న కుటుంబం "అని అర్థము చేసుకోవాలి.
ఇక ఇంటి విషయానికొస్తే... ఒకప్పుడు ప్రతి ఇంట్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. పిల్లలు చాలా మంది ఉండే వారు. వారి పోషణ భారం వహించే వ్యక్తి  మాత్రం ఒక్కడే ఉండేవాడు. అయినా అతడు వారికి అన్ని విధాలా సౌకర్యాలు కలిగిస్తూ, ఎలాంటి లోటు లేకుండా చూసేవాడు . అందుకోసం ఆ వ్యక్తి లేదా యజమాని అహర్నిశలు కష్టపడేవాడు.  "సంపాదించే వాడు ఒక్కడు- కూర్చుని తినేవారు పదిమంది అన్నట్లు"ఇప్పుడు కూడా అక్కడక్కడా అలాంటి కుటుంబాలను మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తుంటాం.అయితే ఇక్కడ యజమానులు ఇద్దరని చెప్పుకోవచ్చు."ఒకరిది సంపాదన అయితే మరొకరిది సంభాళించుట".యజమాని తెచ్చిన దానితో అందరినీ సంతృప్తి పరిచేలా చూస్తూ ,ఒళ్ళెరుగని చాకిరీ చేస్తూ కష్టపడేది తల్లియే.
 ఇక విద్యకు  సంబంధించి చూస్తే "విద్యకు కర్మలు సహకారులు కాదు విద్యే అన్ని కర్మలకు/ పనులకు సహాయకారిగా ఉంటుంది" అని అర్థం చేసుకోవాలి.
 ఇలా  ఈ  "సహైవ దశభిః పుత్రైః ర్భారం వహతి గర్దభీ న్యాయము" ద్వారా కుటుంబంలోని యజమాని యొక్క పాత్ర, చదువు పాత్ర ఎంత గొప్పదో,ఎంత బాధ్యతాయుతమైనదో  తెలుసుకోగలిగాం.
 అలా  కేవలం కుటుంబమే కాకుండా  సమాజంలో నడుపబడే వివిధ సంస్థల యజమానులకు కూడా ఇది వర్తిస్తుంది. "బాధ్యతను బరువు అనుకుంటే నిర్వహించడం కష్టంగా ఉంటుంది".అదే "బరువును అమ్మలా  బాధ్యత అనుకుంటే నిర్వహించడంలో ఇష్టం, ఆనందం రెండూ వుంటాయనేది గ్రహించాలి.
 మనదే బాధ్యత అయినప్పుడు బరువును అమ్మలా ఆనందంగా స్వీకరిద్దాం.అప్పుడే మానసిక ఒత్తిడి లేకుండా మన వాళ్ళ కోసమేగా ఇదంతా అనే ఆనందం సర్వదా ఉంటుంది. ఇదండీ ఈ న్యాయము లోని అంతరార్థము. మీకు కూడా ఈ న్యాయము బాగా నచ్చింది కదూ!

కామెంట్‌లు