సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -716
శీర్షే సర్పో దేశాంతరే వైద్య న్యాయము
*****
శీర్ష అనగా తల.సర్ప అనగా పాము. దేశాంతరం అనగా తాను ఉన్న ప్రదేశానికి దూరం వెళ్ళడం,లేదా దేశం వదిలి వెళ్ళడం.వైద్య అనగా వైద్యుడు.
"తలమీద పాము; దేశాంతరమందు వైద్యుడు" అని అర్థము.
ఓ వ్యక్తి తన భార్య దూరంగా ఉండటం వల్ల పైత్య ప్రేలాపనలా తట్టుకోలేని విరహ వేదనతో బాధ ఇలా అనుకున్నాడు. "నెత్తిమీద వర్షాకాలపు మేఘాడంబరము.తలమీద పాము ,హిమాలయ పర్వతాల మీద ఆ పాము విషాన్ని నివారించే మూలికలు.దేశాంతరమున వైద్యుడు అన్నట్లు వున్నదని ఒకానొక విరహంతో బాధపడే వ్యక్తి ఈ విధంగా తన బాధని వెలిబుచ్చుకోవడాన్ని  మన పెద్దవాళ్ళు ఈ "శిరో సర్ప దేశాంతరే వైద్య న్యాయము"తో పోలుస్తుంటారు.
 ఓ వ్యక్తి తన భార్య తనకు దూరంగా ఉండటం వల్ల పడే విరహ తాపాన్ని, సంధి ప్రేలాపనను సరదాగా చెప్పుకునే న్యాయము ఇది.
 విరహం అనేది ఒక రకమైన ఒంటరితనం. ఇష్టమైన వ్యక్తి చెంత లేక పోతే పడే బాధ.
ఈ విరహం లేదా ఎడబాటు గురించి  కొన్ని విషయాలు తెలుసుకుందాం.
 ఇళ్ళకు గేట్లు ఉంటాయి కానీ మనసుకు గేట్లు ఉండవు.నీటిని నిలువ వుంచే  జలాశయం కాదు. కట్టలు తెగి ప్రవహించే యేరు లాంటిది. ఎంత బంధించాలని అనుకున్నా అంత విజృంభించి మనిషిని ఒక ఆట ఆడించే ఓ మాయల మరాఠీ.ఎంత తిట్టుకున్నా పట్టు దొరక్క దోబూచులాడే టక్కరి.
 అలా ఇష్టమైన వ్యక్తితో అనగా  భార్యతో కలిసి గడిపిన మధురమైన జ్ఞాపకాలు, సరసమైన సంభాషణలు, చిలిపి చేష్టలు. ఆ వ్యక్తి ఏవో అవసరాల కోసం అనుకోకుండా దూరంగా ఉండటంతో  పడే విరహ తాపం అంతా ఇంతా కాదు. ఆ వ్యక్తి పూర్తిగా  ఊహకు, వాస్తవానికి మధ్య ఒకానొక డోలాయమాన స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి మాటలు,చేతలు ఎదుటి వారికి విరహం వల్ల ఇలా  కూడా అవుతారా? అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
   నెత్తి మీద వర్షాకాలం మేఘాలు అంటే" కదిలిస్తే జ్ఞాపకాల వేదనలో దుఃఖం వర్షంలా కురిసేలా ఉంది" అన్నట్లు.అలాగే  విరహ తాపం తల మీద పాములా  కరవడానికి సిద్ధంగా ఉందట. ఇక కరిస్తే ఆ విషాన్ని హరించే ఔషధం ఎక్కడో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందట.కనీసానికి ప్రథమ చికిత్స చేయడానికైనా వైద్యుడు అందుబాటులో లేకుండా ఎక్కడో దేశాంతరంలో ఉన్నాడట" ఇలా  అతడి  విరహ తాపాన్ని  గురించి చెప్పడం చదువుతుంటే అతడి గాఢమైన ప్రేమకు ఆనందంగానూ ఉంటుంది. అతని స్థితికి అయ్యో పాపం అని కూడా అనిపించేలా చేస్తుంది.
 ముఖ్యంగా ఈ తాపాలు,తహతహల్లో మునిగి తన భార్య దగ్గరకు వెళ్ళడానికి తులసీదాసు చేసిన సాహసాలు ఈ సందర్భంగా మనకు తప్పకుండా గుర్తుకు వస్తాయి. అలాగే  ప్రతాప రుద్రీయంలో  వాసవసజ్జిక ఎందుకు విరహోత్కంఠిత అయ్యిందో  చదువుకున్నాం.
ఇలాంటి విరహ బాధల గాధలు పురాణేతిహాసాల్లో చదివినప్పుడు దేవతలకే తప్పలేదు.మానవ మాత్రులం మనకు మాత్రం ఈ బాధ ఎలా తప్పుతుంది.అనుకుంటాం.
అందుకేనేమో 'మేఘ సందేశం' సినిమాలో "ఆకాశ దేశాన ఆషాఢ మాసానా .... అంటూ విరహమో తాపమో విడలేని మోహమో" పాటను  ఎంతో ఇష్టంగా వింటుంటాం.
ఇదండీ! శిరో సర్ప దేశాంతరే వైద్య న్యాయము "అంటే.. సరదాగా ఉండటంతో పాటు మన జీవితంలోనివి కూడా గుర్తుకు వస్తున్నాయి కదూ!.. అందుకే కదా మన పెద్దలు ఇలాంటి న్యాయాన్ని పరిచయం చేస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నాటి రోజుల్లోలా ప్రేమానురాగాలతో కలిసి బతుకమని చెప్పేది.ఉంటాను మరి.ఇది చదివి మీరూ గుర్తు చేసుకుంటూ పెదవులపైనే కాదు కలిసి ఎదలో మధురానుభూతుల పూలను పూయించుకోండి.

కామెంట్‌లు