న్యాయములు-712
శ్వాన శీల న్యాయము
****
శ్వాన అంటే కుక్క, శునకము.శీల అనగా శుచి అయిన నడవడి అని అర్థము.
శునకం వేల సంవత్సరాల క్రితమే మానవునితో మచ్చిక చేయబడి పెంపుడు జంతువుగా జీవనం సాగిస్తున్నది. మరలాంటి శునకము యొక్క లక్షణాలు, శీలము మొదలైన వివరాలు విశేషాలు తెలుసుకుందామా...
మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్కే. సుమారుగా 14000 సంవత్సరాల క్రితమే మనిషితో కలిసి జీవించడం నేర్చుకున్నది. కుక్క వంటి అత్యంత విశ్వాసమైన జంతువు మరొకటి లేదనే చెప్పాలి.అందుకేనేమో కుక్కను గ్రామాల్లోని ప్రజలు కాపలా పెట్టుకుని దానిని గ్రామ సింహంగా గౌరవంగా పిలుచుకుంటారు. అంతే కాదు కాలభైరవుడు అనే పేరుతో దైవంగా కొలుస్తూ వుంటారు.
పూర్వ కాలంలో రాజులు వేటకు కుక్కలను తీసుకుని వెళ్ళేవారు. పశువుల కొట్టాలకు, ఇళ్ళకు కాపలాగా పెట్టుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే కుక్కలను తప్పుచేసిన వారిని శిక్షించడానికి వాడుకునే వారు.ప్రస్తుతం పోలీసు శాఖ వారు దొంగలను నేరస్తులను పట్టుకునేందుకు కుక్కల సహాయం తీసుకుంటున్నారు.
ఇక లక్షణాల విషయానికి వస్తే అది విశ్వాసానికి మారుపేరు. మానవులకు మంచి నేస్తం. దానిని పెంచుకున్న యజమానితో విడదీయరాని బంధం ఏర్పరచుకుంటుంది.
తన యజమాని ఏమైనా ఆనారోగ్యంతో బాధ పడేది గమనిస్తే అది కూడా బాధ పడుతుంది.అది ఎంతగా ప్రేమిస్తుందంటే ఓ వ్యక్తి అత్యంత ఇష్టంగా పెంచుకున్న కుక్క అతను మరణించడంతో , ఆహారం ఏమీ తీసుకోకుండా అతని సమాధి దగ్గరనే వుండి చివరికి మరణిస్తుంది.
ఇక కుక్క లక్షణాలను గమనిస్తే ముఖ్యంగా మనకు కనబడేవి విశ్వాసం, ఆధిపత్యం,రక్షణ, స్వతంత్రత, సహనం,మానవులతో బాగా పని చేసే సామర్థ్యం. ఇవన్నీ కుక్క యొక్క లక్షణాలు.
కుక్కలపై వేసిన తెలుగు సామెతలు చూద్దాం.
"మొరిగే కుక్క కరవదు."కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టూ, కుక్క తోక వంకర,ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది.కుక్కమూతి పిందెలు. మాటలు నేర్చిన కుక్కని ఉస్కో అంటే ఉస్కో అన్నదట. ఇలా అనేక సామెతలతో పాటు "గడ్డివాము కాడి కుక్క,కుక్కల కాట్లాట, కుక్క బుద్ధి , కుక్క చావు లాంటి జాతీయాలు కూడా ఉన్నాయి.
ఇక సుమతీ శతక కర్త కుక్క గురించి అనగా అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులను విమర్శిస్తూ రాసిన పద్యాన్ని చూద్దాము.
"కనకపు సింహాసనమున/శునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం/ దొనరగ బట్టము గట్టిన/ వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! అంటాడు.
ఈ విధంగా కుక్క గురించి ఎన్నో సామెతలు, జాతీయాలు, పద్యాలు ఉన్నాయి. ఈ విధంగా కుక్క యొక్క శీలం లేదా నడవడిని రెండు కోణాల్లో చూడాలి.
ఒకటి దాని యొక్క విశ్వాసాన్ని. మరొకటి వాటిలోని అనైక్యతను.అది మానవులతో ఎంత విశ్వాసంగా, కలిసిపోయి ఉంటుందో,తమ జాతి వాటితో మాత్రం సరిగా కలిసి వుండదు, తినే విషయంలో ఇతర కుక్కలను చేరనివ్వదు.నీటిని తాగడం రాదు గతకడమే.. ఇలా కొన్ని దుర్లక్షణాలు కూడా ఉన్నాయి.
మన పెద్దవాళ్ళు "శ్వాన శీలము"ను రెండు రకాలైన మనుషులకు వర్తింపజేసి చెప్పడం మనం చూస్తుంటాం. ఎవరైనా విశ్వాసంగా పనిచేసే వారిని గురించి కుక్కకు ఉన్నంత విశ్వాసం ఉంది అంటారు. ఇక వాటి అనైక్యతను చూసి కుటుంబం కానీ సోదరులు కానీ కలిసి ఉండక పోట్లాడుకుంటే "కాట్ల కుక్కలు" అంటూ తిడతారు. ఇక కుక్క బుద్ధి గురించి ఎంత ఉన్నతంగా ఉంచాలని ప్రయత్నించినా గత కాలపు గుణాలు చూపితే సుమతీ పద్యాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
ఇలా మంచికి మంచిపేరుతో, చెడుకు చెడ్డ పేరుతో కుక్కతో పోల్ఛి చెప్పడం ఆనవాయితీ.
ఇదండీ! "శ్వాన శీల న్యాయము" ఇందులో మంచి లక్షణాలన్నీ మనవి. చెడు లక్షణాలు దుష్టులవి అంతే కదండీ!
సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి