సమాజ భాగస్వామ్యంతోనే పాఠశాల అభివృద్ధి

 సమాజ భాగస్వామ్యంతోనే పాఠశాల అభివృద్ధి సాధ్యమని, తల్లిదండ్రులే ఆ పురోగతికి పునాదులని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సమగ్ర ప్రగతి నివేదిక వినిపించారు. పాఠశాలకు హాజరైన తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చలు జరిపి, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వ్యూహరచనలు చేసారు. నేటి సమావేశం పండగ వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా తరగతిగదుల అలంకరణ, స్వాగత తోరణాలు, అతిథులను మేళతాళాలతో పుష్పాలు కురిపిస్తూ సంబరాలు గావించారు. పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థుల తల్లులు   వలురోతు సౌందర్య బృందం ప్రదర్శించిన కోలాటనృత్యాలు అలరించాయి. వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య నేతృత్వంలో అతిథులకు స్వాగత వందనం, పిరమిడ్ గేమ్స్ ను విద్యార్థులచే ప్రదర్శించబడ్డాయి. తెలుగు ఉపాధ్యాయులు ముదిలి శంకరరావు ప్రత్యేక గీతాలను ఆలపించగా, విద్యార్థిణిలు హేమలత, లహరి నృత్య ప్రదర్శనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ మంత్రముగ్ధులను చేసాయి. విద్యా సామర్థ్యాలలో, సాంస్కృతిక కార్యక్రమాలో, క్రీడా నైపుణ్యాలలో, క్రమశిక్షణలో మిక్కిలి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలను, షీల్డ్ లను అతిథుల చేతులమీదుగా అందజేసారు. సర్పంచ్ గుజ్జ రామారావు మాట్లాడుతూ విద్యార్థులంతా చదువులతో పాటు నైతిక విలువల పట్ల కూడా పూర్తి అవగాహన కలిగియుండాలని అలాంటప్పుడే మంచి జీవితాన్ని పొందగలరని అన్నారు. ఎంపిటిసి వలురోతు గోవిందరావు మాట్లాడుతూ విద్యార్ధుల క్రమశిక్షణతో మెలిగి విద్యను అభ్యసించిననాడే దేశాభివృద్ధికి దోహదపడగలరని అన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బూరాడ రమేష్ మాట్లాడుతూ గుణాత్మక విద్యాసాధనకై ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని, అవసరమైన సౌకర్యాలు సమకూర్చి తమవంతు సహకారాలను అందజేస్తామని అన్నారు. 
వైస్ చైర్మన్ కిల్లారి జయసుధ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాల్యం నుంచి వినయ విధేయతలను అలవరచుకోవాలని అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విజ్ఞాన సముపార్జన దిశగా అనునిత్యసాధకులవ్వాలని ఆమె అన్నారు.
పూర్వవిద్యార్ధి, కస్టమ్స్ విభాగం ఐ.ఆర్.ఎస్. విశ్రాంత సహాయ కమిషనర్ కూన రామారావు మాట్లాడుతూ మన రాష్ట్రంలో శతశాతం డ్రాపౌట్స్ నిర్మూలనకై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పట్టుదల కూడా ఉండాలని, ఇరుపక్షాలా బాధ్యత వహించినపుడే బడీడు పిల్లలంతా బడిలోనే నమోదగుట సాధ్యపడుమని అన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందినపుడే లక్ష్యసాధనకు సంసిద్ధులు కాగలరని అన్నారు. అలాగే విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తించేలా పాఠ్యాంశ బోధనాభ్యసనాలు సాగాలని అలాంటప్పుడే చదువుల స్థాయి మెరుగగునని అన్నారు. మరో పూర్వ విద్యార్ధి ఒడిశా కాశీనగర్ విద్యాశాఖ సీఆర్సీ రౌతు మధుకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం ద్వారా నైతిక విలువలపట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్గుతుందని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కూడా సర్కారు బడుల ద్వారానే ఏర్పడునని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గుణాత్మక విద్యాసాధనకై మిక్కిలి కృషి చేయుచున్నారని ఆయన అన్నారు.
విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు అందజేసి విద్యార్థుల చదువుల స్థాయిని ముఖాముఖి చర్చలు జరిపి తగుసమీక్ష నిర్వహించారు. 
సచివాలయ కార్యదర్శి ఎస్.ఉమారాణి మాట్లాడుతూ తరచుగా పాఠశాలను సందర్శిస్తూయున్నానని, మధ్యాహ్న భోజన పథకం మెనూ పాటించడంలోనూ, పౌష్టికాహారంతో పాటు, రుచికరమైన, శుచి శుభ్రతతో కూడిన విధానాలను పరిశీలిస్తున్నానని పూర్తి సంతృప్తి కలిగియున్నానని అన్నారు.  మహిళా రక్షణ విభాగ కార్యదర్శిణి గువ్వాడ ఆశ సైబర్ నేరాలకు బలి కాకుండా ఉండేలా ఏమేమి జాగ్రత్తలు వహించాలో వివరించారు. పూర్వ విద్యార్ధులు బోడసింగి రమణమూర్తి, బూరాడ అప్పలస్వామి, బి.లక్ష్మీనారాయణలతో పాటు పేరెంట్స్ బూరాడ ప్రదీప్, భూపతి లక్ష్మి, రౌతు శేషగిరి తదితరులు మాట్లాడారు. ఈ పాఠశాల విద్యార్థుల తల్లులలో ఒకరైన కిల్లారి మోహిని వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించి, సభను రంజింపజేసారు. 
విద్యాశాఖకు సంబంధించిన నినాదాలను, పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల పత్రాలను, విద్యార్థులు రూపొందించిన బోధనాభ్యసనా సామాగ్రిని ప్రదర్శించగా హాజరైన తల్లిదండ్రులు ఇతర పౌరులంతా తమ హర్షాతిరేకాలు తెలిపారు. 
ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు తాము బాధ్యత వహిస్తున్న ఆయా తరగతుల విద్యార్థుల స్థాయిని సభ దృష్టికి తెచ్చీ, తల్లిదండ్రులకు పలు సూచనలు గావించారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు చూపి వారి సామర్ధ్యాలను చర్చించడమైనది. తొలుత అతిథులు, ఉపాధ్యాయులు భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన, చివరిగా  తల్లిదండ్రులచే ప్రతిజ్ఞల గావించిన 
అనంతరం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులంతా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం భోజనాలను సహపంక్తి భోజనాలను ఆరగించి నేటి మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం వేడుకలను ముగించారు.
కామెంట్‌లు