పౌష్టికాహార లోపం:-సి.హెచ్.ప్రతాప్

 గత ఏడేళ్లుగా, గిరిజనులు ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల కారణంగా తీవ్రమైన పోషకాహార లోప సమస్యను ఎదుర్కొంటున్నారు . భారతదేశంలోని 47 లక్షల మంది గిరిజన పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక తెలియజేస్తోంది. ఇది వారి మనుగడ, అభివృద్ధి, అభ్యాసం, ఉత్పాదకతను తీవ్రంగా  ప్రభావితం చేస్తుంది. జనజీవన స్రవంతికి దూరంగా నివసించే గిరిజనులలో వివక్ష, భౌగోళిక వేర్పాటువాదం, ప్రజా సేవలకు పరిమిత ప్రాప్యత, సాంస్కృతిక వ్యత్యాసాలు వంటి ఇతర కారణాల వలన వారు అవసరమైన సేవల కోసం ప్రభుత్వంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.  కాబట్టి, పోషకాహారం మరియు ఆరోగ్య సంబంధిత సేవల కోసం వారి పట్ల ప్రభుత్వ బాధ్యత రెట్టింపుగా వుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వ విధానాలు గిరిజనుల అభివృద్ధికి ఏ మాత్రం తోడపడదం లేదని పై నివేదిక తేటతెల్లం చేస్తోంది.గిరిజన ఆవాసాలు విచ్చలవిడిగా ఉండడంతో పాటు అంగన్‌వాడీలను ఏర్పాటు చేయకపోవడం వలన వారిలో పౌష్టికాహార సమస్య కొనసాగుతోంది. గిరిజనేతర పిల్లల కంటే గిరిజనులలో తీవ్రమైన మరుగుజ్జుత్వం ఎక్కువగా కనిపిస్తుంది. మాతాశిశు మరణాల రేటు మరియు శిశు మరణాల రేటు కూడా గిరిజన సమాజంలో అత్యధికం.అలాగే జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఏర్పాటైన ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో రోగాల బారిన పడిన తర్వాత తగిన వైద్యం అందడం లేదు. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 28 శాతం వరకు వైద్యుల పోస్టులు, 22 శాతం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఒక జాతీయ సర్వేలో తేలింది. పరిస్థితి మరింత విషమించక ముందే గిరిజనులలో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వాలు ఒక పటిష్టమైన ప్రణాళిక అమలు చేయాలి.  ప్రభుత్వం చెంచు గిరిజనులకు ప్రవేశ పెట్టిన పలు పథకాలు ఊరించి ఉసూరు మనిపిస్తున్నాయి. కొన్ని పథకాలు అర్ధంత రంగా నిలిచిపోతున్నాయి. అనాగరికతతో కునారిల్లుతున్న చెంచుగిరిజనులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. చిన్న వయస్సులోనే క్షయకు గురై మహిళలు రక్త హీనతతో  బాధపడు తున్నారు. గర్భం దాల్చిన నుంచి ప్రసవ సమయం వరకూ రక్త హీనతతో బాధపడుతూ చివరకు మృత్యు కౌగిట్లోకి వెళ్తున్నారు. రక్తహీనత మరణాల నుంచి గిరి జన మహిళలను కాపాడేందుకు ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి ఏజెన్సీ (ఐటీడీఏ) ద్వారా పౌష్టిక (బల వర్ధకమైన) ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 
కామెంట్‌లు