చావు పుట్టుకల అంతర్యం:-సి.హెచ్.ప్రతాప్
భగవద్గీత, 2 వ అధ్యాయం, సాంఖ్య యోగం, 28 వ శ్లోకం  
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
అర్జునా ! ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు,మరణం తర్వాత కూడా కనపడవు.చావు పుట్టుకల మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి అటువంటప్పుడు శోకించడం ఎందుకు అని శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడిని పై శ్లోకం ద్వారా సున్నితంగా మందలించాడు. పుట్టుక, చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు.ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది కానీ, శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది.దానిని అప్పుడు భౌతికంగా దర్శించడం అసాధ్యం. ఆత్మ ఒక శరీరంలో ఉపాధి కోసం ప్రవేశించి జీవుడు జన్మించిన తర్వాత నుండి అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది.మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు.కనుక ఆత్మ నిత్యమైనది … శరీరం అనిత్యమైనది.అనిత్యమైన వాటి కోసం శోకించడం ఎందుకని భగవానుడు మనందరినీ పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. కల కంటే ముందు కల ప్రపంచం లేదు. కలలోంచి లేచిన తర్వాత అది ఉండదు. ఇది కల ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. అతను నిద్ర లేచిన తర్వాత అది విపరీతమైన భ్రమ అని అతనికి తెలుసు. అదే విధంగా కలలోంచి మేల్కొన్న మనిషికి విశ్వమంతా, అనుభవించే సుఖదుఃఖాలన్నీ భ్రమలే.
ఈ భౌతిక శరీరాలు కాలక్రమేణా నశిస్తాయి కానీ ఆత్మ శాశ్వతమైనది అప్పుడు మనం ఎల్లప్పుడూ శరీరాన్ని గుర్తుంచుకోవాలి. ఒక దుస్తులు వంటి; అందుకే దుస్తులు మార్చుకున్నందుకు ఎందుకు బాధపడాలి ?మనం ఎంచుకున్న పాత్ర నిడివిని బట్టి నాలుగు రోజులో, నలభై రోజులో, అరవై సంవత్సరాలో మరి వంద సంవత్సరాలో మన పాత్రను పోషించి దానిని రక్తికట్టించి .. “అనుభవ జ్ఞానం” అనే పారితోషికంతో మళ్ళీ మన స్వంత నక్షత్రలోకాలకు, అధవా దివ్యలోకాలకు, తిరిగి వెళ్ళిపోతాం. సాధారణంగా జరిగే ఇలాంటి రాకపోకల మధ్య “దుఃఖం” అన్న సంభావ్యత లేనే లేదు! మరి “ఏడవడం” ఎందుకు? అని మహర్షి పత్రీజీ ఒక సందర్భంలో చావు పుట్టుకల గురించి ఒక మంచి వివరణ ఇచ్చారు.
మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు ,ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీ మించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు.అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు. నిజానికి ఈ సత్యాన్ని మనందరం మన హృదయాలలో శాశ్వతంగా పదిలపరచుకోవాలి. గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించే వారిని, యవ్వనంలో, ప్రౌఢ ప్రాయంలో ఉన్నవారి దగ్గరనుండి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకూ వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు, రోజుకు అసంఖ్యాకంగా మరణిస్తునే వుంటారు. ఇన్ని చూస్తూనే ఉన్నా, మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలో ఉంటూంటాం మనం. ఇది ఎంత అశ్చర్యకరమైన విషయం ?
మనిషికి చావు పుట్టుక రెండూ సమానమే! ఉన్నన్ని రోజులూ ఒకరికి సహాయపడుతూ,ఉన్నదానిలో కాస్త దానం చేయడం చాలా అవసరం. మనకు ఏదీ శాశ్వతం కాదని,ఉన్నప్పుడే లేనివారికి ఇవ్వడం ద్వారా మంచి మనిషిగా చిరస్థాయిగా నిలబడగలమనీ దానం మనకు నేర్పుతుంది. అందుకే అతి దుర్లభమైన ఈ మానవ జన్మకు దాన ధర్మాది సత్కర్మల ద్వారా సార్ధకత చేకూర్చుకోవడం అవసరం.  

కామెంట్‌లు