స్వధర్మాచరణయే శ్రేష్టం:- సి.హెచ్.ప్రతాప్
  శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో (కర్మ యోగం, 35 వ శ్లోకం) ఈ విధం గా ప్రవచించారు:
శ్రేయాన్ స్వధర్మ విగుణ : పరధర్మాత్స్వ నుష్టితాత్
స్వధర్మ నిధనం శ్రేయ: పరధర్మో భయావహ:
“ ఓ అర్జునా ! ఎంతో నైపుణ్యం తో ఆచరించే పరధర్మం కన్నా , గుణరహితం గా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహాణార్ధం సమసిపోయినా మంచిదే కాని, అమరణాంత భయావహమైన పరధర్మానుష్టానం మాత్రం తగదు."
 ఈ ప్రపం చం లో మానవులకు వారి వారి కుల, మత,ప్రాంతీయ దేశ కాలమాన పరిస్థితుల ధృష్ట్యా విధించబడిన కర్మలను చేయుట, ధర్మమును ఆచరించుట వారికే కాక యావత్ సమాజానికే ఎంతో శ్రేయస్కరం. జన్మత: ప్రాప్తించిన కర్తవ్యాలను నిర్వహించడమే స్వధర్మాచరణ.పైపైన చూసినప్పుడు స్వధర్మంలో లోపాలు కనిపించవచ్చు. పరధర్మం ఉత్తమంగా కనిపించవచ్చు. తాను, తనవారనే మోహ సముద్రంలో మునిగిన అర్జునుడు ధర్మగ్లానిని పట్టించుకోకపోవడం పరధర్మాచరణమే. అలాంటి పరధర్మాచరణ కన్నా స్వధర్మాచరణలో మరణం ఎదురైనా దానిని స్వాగతించడమే ఉత్తమమని బోధిస్తున్నాడు కృష్ణుడు.
మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా  అర్జునుడు మాయామోహం లో పడి మనస్థాపం చెంది విల్లును క్రింద పడవైచి యుద్ధం చేయలేనని అశక్తత వెల్లడించినప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు  స్వధర్మాచరణ గూర్చి అత్యద్భుతం గా బోధ చేసారు. : దేశ ప్రజల రక్షణ కోసం, అధర్మాన్ని శిక్షించేందుకు , ధర్మ పరిరక్షణ గావించేందుకు యుద్ధం చేయుట క్షత్రియ ధర్మం. ఈ ధర్మచరణ లో అసువులు బాసినప్పటికీ వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. అట్లు కాక వెన్ను చూపి పలాయనం చిత్తగిస్తే స్వధర్మాచరణ గావించని కారణం గా రౌద్రవాది నరకములు ప్రాప్తిస్తాయి. కావున నీ క్షత్రియ ధర్మమును నెరవేర్చు” అని అర్జునుడికి హితబోధ చేసి కర్తవ్యన్ముఖుడిని గావించారు. పై ఉదంతాన్ని బట్టి స్వధర్మాచరణకు తమకు విధించిన కర్తవ్య నిర్వహణకు శ్రీ కృష్ణ భగవానుడు విశిష్ట స్థానం కల్పించారు.
స్వధర్మమనగా మనకు విధింపబడిన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ప్రతీ ఒక్కరు సక్రమంగా నిర్వహించడం వలన వ్యక్తిగతం గానే కాక సమాజ పరం గా కూడా శ్రేయస్సు ఒనగూరుతుంది.
గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. 

కామెంట్‌లు