సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-729
సుత జన్మ మృతి న్యాయము
*****
సుత జన్మ మృతి న్యాయము అనగా "పుత్రుడు జన్మించి మరణించుట కూడా సంభవించినట్లు" అని అర్థము.
"సుత జన్మ మృతి న్యాయము"అనేది ఒక ప్రసిద్ధ సూక్తికి దగ్గరగా ఉన్న న్యాయము.ఆ సూక్తి శ్లోకాన్ని, ఇది ఎందులోంచి గ్రహించబడిందో చూద్దామా...
"ఋణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయాః/ఋణక్షయే క్షయం యాంతి!కా తత్ర పరిదేవనా!!"..జీవిత వాస్తవికతను చిత్రిక పట్టిన ఈ సూక్తి  శ్రీమహా భాగవత పురాణంలోని చిత్రకేతు ఉపాఖ్యానం లోనిది.
మరి దీనిని ఎందుకు చెప్పవలసి వచ్చింది?అది ఏ సందర్భంలో? తెలుసుకుందాం.
శూరసేన దేశానికి రాజైన చిత్రకేతుడు సంతానం కోసం ఎందరినో వివాహం చేసుకుంటాడు.కానీ సంతానం కలగలేదు. దాంతో అంగీరస మహాముని సలహా ప్రకారం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఆ యజ్ఞ ప్రసాదాన్ని తన పట్టపు రాణికి ఇస్తాడు. ఆ విధంగా ఆమె గర్భవతి అయి పండంటి పుత్రునికి జన్మనిస్తుంది. ఆ పుత్రుని వ్యామోహంలో పడి రాజ్యాన్ని , వివాహం చేసుకున్న మిగతా రాణులను ఎవర్నీ పట్టించుకోలేదు.సర్వం మరిచి పోయాడు.కేవలం పుత్రునికి జన్మనిచ్చిన పట్టపు రాణిని ఎంతో అపురూపంగా చూసుకోసాగాడు. అది చూసి ఇతర రాణులు ఈర్ష్య అసూయలతో రగిలిపోయి ఆ బాలుడికి విషం పెట్టి చంపేస్తారు.
అలా మరణించిన పుత్రుడి కోసం రాజు,పట్టపు రాణి గుండె పగిలేలా ఏడుస్తూ వుండగా  తనతో పాటు నారదుడిని కూడా తీసుకొని వచ్చిన అంగీరస మహర్షి ఓదారుస్తూ దుఃఖించకు "ఓ రాజా! "ఋణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయాః...కా తత్ర పరిదేవనా !!"అంటే పశువులు, పత్నులు, కుమారులు, ఇండ్లు ,వాకిండ్లు -ఇవి ఋణానుబంధ రూపములో వచ్చి, ఋణము తీరగానే మళ్ళీ మనుష్యుని వదిలి పోతున్నాయి.అట్టి వానిని గూర్చి ప్రాజ్ఞులు విచారించరు కదా! మనిషిని ప్రాజ్ఞుడు కమ్మని ఉద్భోదిస్తూ చేసిన ఉపదేశం ఇది. మానవులు చేసుకున్న ఋణాలను బట్టి ఇవన్నీ వస్తూ, పోతూ ఉంటాయి.ఈ ప్రపంచం స్వప్నం లాంటిది.కల నిజం కాదు కదా!కర్మవశాన జీవులు, పుడుతూ, గిడుతూ వుంటారు ఎవరికి ఎవరు ఏమవుతారు? "ఈ మోహ వికారాన్ని వదిలి శ్రీహరిని ధ్యానించు" అని చెప్పాడు.
ఆ తర్వాత నారదుడు కూడా ఓదారుస్తూ" ఓ రాజా! నీకు ఈ బాలునికి ఉన్న బంధుత్వం ఏమిటో చూడు" అంటూ  ఆ బాలుని దేహాన్ని చూస్తూ " ఓ జీవా!నీ తల్లిదండ్రులు నీకై దుఃఖిస్తున్నారు.నీవు తిరిగి ఈ దేహంలో ప్రవేశించి, వీరికి సంతోషం కలిగించు" అంటాడు.అప్పుడు ఆ బాలుడిలోని జీవుడు కర్మబద్ధుడినై అనేక జన్మలు ఎత్తుతున్న నాకు, ఒక్కో జన్మలో వేరు వేరు తల్లిదండ్రులు, బంధువులు ఏర్పడుతున్నారు. మరో జన్మ మరో తల్లి,తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వస్తాను"అంటాడు.ఆ జీవుడి మాటలతో చిత్రకేతుడికి అప్పటి వరకు ఉన్న మోహం, ఆవేదన వీడుతాయి.
ఇలా "ఋణం ఉంటేనే మనం పొందగలం. భార్యా, భర్త ,పిల్లలు, పశువులు, బంధువులు, స్నేహితులు మొదలైనవి అన్నీ ఋణానుబంధాలే. ఋణం ఉన్నంత కాలం మన చెంత ఉంటాయి. బంధాలు అనుబంధాలు ఏర్పడతాయి. ఋణం తీరిన మరుక్షణం ఏవీ మన చెంత ఉండవు" ఋణం లేనిదే తృణం కూడా ముట్టదు. మనం ఎంత ప్రయత్నించినా ఋణం లేకపోతే జరగను కూడా జరగదు"అని  ఆధ్యాత్మిక వాదులు, తాత్విక ధోరణితో చెప్పే అమూల్యమైన జీవిత సత్యాలు ఇవి.
అయితే "సుత జన్మ మృతి న్యాయము"ను కొందరు వేరే అర్థంతో ఊహించుకుంటూ "అరె! ఇలా చేయక పోతే మంచి జరిగేది,అలా చేయడం తప్పేమో!" ఆని ఊహించుకోవడం కద్దు. మరి వారి ఆలోచనలో అనుకున్నది ఏమిటంటే ఒకానొక వ్యక్తి తమకిష్టమైన దేవుళ్ళలో ఒక దేవతను ఆరాధించడంతో ఒక పుత్రుడిని పొందుతాడు. మరొక దేవుడిని ఆరాధించడంతో మరొక కుమారుడు జన్మిస్తాడు. అయితే మొదట జన్మించిన కుమారుడు మరణిస్తాడు. ఆ మరణానికి కారణం మొదటి దేవతను వదిలి రెండో దేవతను ఆరాధించడం వల్ల ఆ మొదటి దేవతకు కోపం వచ్చి ప్రసాదించిన బిడ్డను వెనక్కి తీసుకుందని".. అలా ఊహించుకుంటూ ఎవరైనా ఒక్కరినే నమ్మాలి కానీ ఇలా ఇద్దరినీ (ముగ్గురిని) నమ్మకూడదని ఆ వ్యక్తి అనుకుంటాడు.
కానీ ఇది నిజం కాదనేది  మొదట చెప్పుకున్న భాగవత సూక్తి చెబుతోంది..
మరి మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పడానికి కారణం  జీవితంలో అలాంటి సంఘటనలు, ఇలాంటి మనుషులు, బాధలు , కష్టాలు మనకు తారసపడుతూ వుంటాయి.కాబట్టి స్థితప్రజ్ఞతతో ఎదుర్కొంటూ జీవితాన్ని  గడపాలని చెప్పడమన్న మాట.అది అనుకున్నంత సులభం కాదు. కానీ జీవితం అన్న తర్వాత తప్పదు.అనేదే ఇందులోని అంతరార్థం.

కామెంట్‌లు