సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-719
శాస్త్ర ఫలం ప్రయోక్తరి న్యాయము
******
శాస్త్ర అనగా సూత్రము, నియమాలు, నిబంధనల వ్రతం, సంకలనం, పుస్తకం  లేదా గ్రంథము అంటారు.ఫలం అంటే పండు,పంట, ప్రయోజనం, కార్యము, లక్ష్యము,సంతతి,కత్తివాదర.ప్రయోక్తరి ప్రయోగించు వాడు అని అర్థము.
"శాస్త్ర ఫలం ప్రయోక్త కనువర్తించును." అనగా శాస్త్రములందు నుడువ బడిన/చెప్పబడిన యజ్ఞయాగాదుల క్రియాఫలము వాటిని నిరంతరం ఆచరించు వ్యక్తికి చెందుతుంది కానీ "ముని ర్మనుతే మూర్ఖో ముచ్యతే"అనునట్లు ఇతరులకు చెందదు.
అంతే కాకుండా ఈ న్యాయమును బలపరచడానికి " అన్యు డన్య కర్మ ప్రజనితఫల భాక్కవు నెడల శాస్త్రమునకు వ్యాకులతయు సంభవించును" అని విజ్ఞులచే చెప్పబడినది.
 పై పేరాలలోని విషయాలు చదువుతుంటే కొంత అయోమయానికి గురవుతాం.అంతా సంస్కృత భూయిష్టమైన ఆ వాక్యాల అర్థం ఏమిటా?అని. నిశితంగా పరిశీలించి చూస్తే మొత్తంగా తెలిసేది శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారికే ఫలితం ఉంటుంది.అలా అధ్యయనం చేయని వారు ఎలాంటి ఫలాలు, ఫలితాలు పొందలేరు.
అంతే కదా మరి దీనిని సామాన్య పరిభాషలో చెప్పాలంటే "చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా". మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుంది. 
సాధారణంగా క్రియ అనేది అంతర్గత చర్య. శాస్త్ర ఫలం క్రియా యోగం ద్వారా సాధించవచ్చు.లక్ష్యం కోసం కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది .
 "ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు"ఎవరైతే ఇష్టపడి శాస్త్రాలు చదువుతారో వారికే అందులోని విషయాలన్నింటి మీద సరైన జ్ఞానం అలవడుతుంది.ఈ సమాజంలో కొందరు వ్యక్తులు మేధావులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు మొదలైన వారు ఉన్నారు.వీరంతా తమ తమ జ్ఞానాన్ని, ఇష్టాన్ని, సమయాన్ని పెట్టుబడిగా పెట్టి తాము ఆ స్థాయిలోకి‌ చేరుకున్నారు.ఇక వాటి నుండి ఆదాయము,ఆదరణ, గౌరవము, గుర్తింపు‌ మొదలైనవి లభిస్తాయి.
 ఇవే కాకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తే ఆ పని చేసిన వారికి ఆ పని యొక్క ఫలితం దక్కుతుంది.ఎంత కృషి చేస్తే అంత చక్కటి ఫలితం ఉంటుంది.అందుకే  "కృషితో నాస్తి దుర్భిక్షం" అంటారు.'
 ఎవరి స్వయం శక్తితో వారు ఎదగాల్సి వుంటుంది.విద్య అనేది ఎవరి సొత్తు కాదు... కొంచెం పట్టుదలతో సాధన చేస్తే పట్టుబడుతుంది.
"శాస్త్ర ఫల ప్రయోక్తరి న్యాయము"ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే విద్య, జ్ఞానం ఎవరిది కాదు.దానిని స్వంతం చేసుకోవాలని అనుకుంటే వాటి మీద దృష్టి పెట్టాలి.నిరంతర సాధన చేయాలి. కుల మతాలకు అతీతంగా శాస్త్ర జ్ఞానం అలవడుతుంది. ముఖ్యంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే తపనతో పాటు సంకల్పబలం ఉంటే  ఎంతటి విజ్ఞానాన్ని అయినా సొంతం చేసుకుని వాటి ఫలితాలను పొందవచ్చు.
ఇదండీ! "శాస్త్ర ఫల ప్రయోక్తరి న్యాయము". మనమూ దీనిని స్ఫూర్తిగా తీసుకుని మనకు ఇష్టమైన శాస్త్రాలు చదువుదాం.వాటి ఫలితాలను ఆనందంగా పొందుదాం.

కామెంట్‌లు