సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-721
శ్వా కర్ణేవా పుచ్ఛేవా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభ న్యాయము
*****
శ్వా అనగా కుక్క.కర్ణేవా అనగా చెవ్వు కానీ. నరుక పుచ్ఛేవా అనగా తోకగానీ.ఛిన్నే అనగా నరుకబడిన. శ్వైవ అనగా కుక్కే. భవతి అనగా అవుతుంది,ఉంది.న అశ్వో అనగా గుఱ్ఱము కాదు.న గర్దభ అనగా గాడిద కాదు అని అర్థము.
చెవ్వు గాని,తోక గాని కోసి వేయబడిన కుక్క కుక్కే అవుతుంది కాని గుఱ్ఱమో,గాడిదో కాదు కానేరదు అని అర్థము.
చదవడానికి పెద్దదిగా ఉన్నా ఈ న్యాయము ద్వారా మన పెద్దవాళ్ళు చెప్పొచ్చేదేమిటంటే  పులి పులే -నక్క నక్కే అని.చెవ్వు,తోక కోసుకున్నంత మాత్రానా దాని అసలు పేరు పోదు కదా!అంటారు.
"పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు" అనే సామెతతో దీనిని పోల్చవచ్చు. ఆ కథను పిల్లలూ పెద్దలూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
 అదేమిటో చూద్దాం...అనగనగా ఒక అడవిలో  నక్క ఉండేది.దానికి దర్జాగా తిరుగుతూ వుండే పులిని చూస్తుంటే చాలా కుళ్ళుగా ఉండేది. దాని చూసి అన్ని జంతువులు భయపడటానికి కారణం దాని ఒంటి మీద చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్న వెంటనే దానికో ఆలోచన వచ్చింది. అలాంటి చారలు తాను కూడా పెట్టించుకొని అందరిలో దర్జాగా,భయపెడుతూ తిరుగుదాం అనుకుంది.వెంటనే ఇనుప వస్తువులు చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి పులిలా కనబడేలా తనకు చారలు పెట్టమని అడిగింది.అతడు కొలిమిలో కాల్చిన ఇనుప కడ్డీతో వాతలు పెడుతుంటే ఆ బాధ భరించలేక ఈ చారలు వద్దు ఇంకేమైనా చేయమని వేడుకుంది.
అప్పుడా వ్యక్తి "రంగులు అద్దే అతని వద్దకు వెళ్ళి రంగుల చారలు వేయించుకో" అని సలహా ఇచ్చాడు. సరే నని నక్క రంగులు అద్దే వ్యక్తి దగ్గరకు వెళ్ళి  రంగు రంగుల చారలు వేయించుకుంది. ఆ రంగులు వాతలతో కొత్తగా కనిపిస్తున్న తనను తాను చూసుకుని మురిసిపోతూ అడవిలో తిరుగుతూ జంతువులను భయపెట్ట సాగింది. వింతగా ఉన్న నక్కను చూసి జంతువులు భయపడడం చూసి ఆ  సంతోషంతో  తనను తాను మరిచిపోయి గట్టిగా ఊళ పెట్టింది. ఇంకేముంది దాని మోసం బయట పడడంతో వెంట బడి ఉరికించాయి. భయంతో పరుగులు తీస్తూ ఓ నీటి గుంటలో పడింది. దాంతో ఒంటిమీద చారలన్నీ కరిగిపోయి అసలు రూపం కనిపించడంతో జంతువులన్నీ తలా ఒక మాట అని వెక్కిరించాయి.
ఇతరులతో పోల్చుకుని వాళ్ళలా ఉండాలని కోరుకోకూడదని, ఏం చేసినా తన గుణం మారదని నక్కకు తెలిసి వచ్చింది.
 పై న్యాయమును మన పెద్దలు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.ఎవరికి వారే ప్రత్యేకం అనుకోవాలి.అంతేకానీ ఇతరులతో పోల్చుకుని ఎక్కువగానో తక్కువగానో ఊహించుకుంటూ  ఏదో చేస్తే కలిగేది బాధే తప్ప ఆనందం కాదని చెప్పడమే ఈ న్యాయము యొక్క అంతరార్థము.
 కాబట్టి ఈ "శ్వా కర్ణేవా పుచ్ఛేవా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభ న్యాయము" ద్వారా   "గుణాలు , రూపు రేఖల్లో ఎవరికి వారే ప్రత్యేకం" అని గ్రహించాలి. తద్వారా తమదైన ప్రత్యేకతతో రాణించాలని కోరుకోవాలి.అంతే కదండీ!.

కామెంట్‌లు