సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-714
శత్రో రపి గుణా వాచ్యా వాచ్యా దోషా గురో రపి న్యాయము
******
శత్రోరపి అనగా విరోధి గురించి చెప్పునపుడు.. గుణ అనగా గుణము. వాచ్యా అనగా నిందించుట . దోషాలు అనగా తప్పులు గురోరపి అనగా గురువు గురించి చెప్పునపుడు,మాట్లాడునపుడు అనే అర్థాలు ఉన్నాయి.
శత్రువు అయినప్పటికీ వాని మంచి గుణములను చెప్పుకొనవలెను.గురువు అయినప్పటికీ సంకోచించకుండా దోషములను చెప్పవలయును అని అర్థము.
ఈ రెండింటిలో మొదటిదానికి చక్కని ఉదాహరణ రామాయణంలో ఉంది.రామాయణంలో సీతాన్వేషణ సమయంలో అశోకవనానికి వస్తున్న రావణుని గంభీరమైన ఆకారం, అతనిలోని తేజస్సును మెచ్చుకోలేకుండా హనుమంతుడు ఉండలేక పోయాడు.అలాగే యుద్ధ సమయంలో రావణునితో హనుమంతుడు తలపడ్డప్పుడు హనుమంతుని బలం చూసి మెచ్చుకుంటాడు రావణుడు.
ఇక్కడ రావణుని గురించి చెప్పాలంటే అతనిలో కేవలం స్త్రీ వ్యామోహం మాత్రమే ఉంది. సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళాడే కానీ ఆమెకు ఎలాంటి హానీ తలపెట్టలేదు.ఇది రావణుని యొక్క గొప్పతనంగా చెప్పవచ్చు.
ఇక బమ్మెర పోతన గారు రచించిన "దానశీలం" లో బలి చక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడు వచ్చిన వాడు "శ్రీమహా విష్ణువు కొంచెంతో పోడు జాగ్రత్త. ఆడిన మాట తప్పినా ఏమీ కాదు అతడికి దానం చేయవద్దు" అని చెబుతాడు. ఆ మాటలకు బలి చక్రవర్తి గురువుతో "తాను అబద్దాలు ఆడననీ గురువుకే అలాంటి దోషములు చేయకూడదని తాను సర్వనాశనం అయినా ఆడిన మాట తప్పనని" చెబుతాడు.
అలాగే సూర్యుడు కర్ణుని వద్దకు వచ్చి "ఇంద్రుడు మారువేషంలో నీ వద్దకు  కవచ కుండలాలను దానంగా తీసుకోవాలని వస్తున్నాడు జాగ్రత్త "అని చెబుతాడు.అప్పుడు సూర్యుడికి తిరిగి సమాధానం చెబుతూ అడిగిన వారికి దానం ఇవ్వడం ధర్మం అని, తాను తప్పకుండా దానం చేస్తానని అంటాడు.
పై ఉదాహరణల ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే శత్రువు అయినప్పటికీ ఆయా వ్యక్తులలో ఉన్న మంచి గుణాలను గ్రహించాలి.పాటించాలి.
అలాగే గురువైనా,గురువంతటి వాడైనా సరే వారిలోని దోషాలను ఎలాంటి సంకోచం లేకుండా వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.
 చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల గురువు లోని లోపాలు అలాగే ఉండిపోతాయి. శత్రువులోని మంచి గుణాలను గమనించి కూడా గ్రహించకపోతే కొంత నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అనేది ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవచ్చు.
 ఓ మంచి మాట, విషయం నేర్చుకునేటప్పుడు గానీ, చెప్పేటప్పుడు గానీ ఎలాంటి సంకోచం లేకుండా ఉండటమే మంచిది.దాని వల్ల మంచి చెడుల విచక్షణ తెలుస్తుంది. ఎలా ఉండాలో ఉండకూడదో అర్థమవుతుంది.
"శత్రోరపి గుణా వాచ్యా వాచ్యా దోషా గురో రపి న్యాయము"లోని అంతరార్థము ఇదే.

కామెంట్‌లు