బానిస చూపులనించి
అస్తిత్వం వైపు
అణచివేతనుంచి
ఎదురుతిరిగే వరకు ప్రయాణంలో
చిక్కుల నెత్తితో
చిరిగిన ఆహార్యంతో
ఛిద్రమైన తెలంగాణా ఒకనాడు
ఉద్యమం ఊపిర్లతో
ఉరకలేసే ఆవేశంతో
ఆధిపత్యం కోసం ఆత్మగౌరవం కోసం
కుచ్చిళ్ళు దోపుకుంటూ
కుస్తీకి సిద్ధమై
కోపంతో ఊగిన
వీర తెలంగాణా మరునాడు
అధికారం సిద్ధించాక
ఆకాంక్షలు తీరే క్రమంలో
అలంకార ప్రియమై
తన రూపు సింగారించుకుంటున్న
జాణ తెలంగాణా నేడు
ఇకముందు ఇంకా అభివృద్ధి చెంది
నగలతో అలంకరించుకోదా!
సంపద చాటుకోదా!
సాటి వారిలో మేటిగా కనిపించవద్దా!
అది భవిష్యత్తెలంగాణకు ప్రతీకగా
ముఖ చిత్రం కాకూడదా?
తన పండుగలు, జీవనం
సంస్కృతి చిహ్నాలను చాటుతూ
ముందురోజుల ఘన వైభవానికి దిక్సూచిగా
విగ్రహం మేలిమిగానే ఉండాలెతప్ప
రాజకీయ రంగులతో
తెలంగాణా తల్లి భంగపడొద్దు
సుధీర్ఘ పోరాట చరిత్ర ప్రతిఫలానికి
వ్యక్తుల ఇష్టాల మకిలీ పడితే
ఇక వారు తమపై మట్టి తొవ్వుకున్నట్టే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి