వీచే విశేషగాలి విస్తృతి తడిసిన మంచె సఖి
పొలం తల నిమిరి నాట్యంచేసే గుండె గువ్వలు
చెట్లు రెండు పాదు ఒక్కటే నీడ ఊరు విహారి
మనిషి నడక భరోసా వీసా మట్టి కల ఊరు
గంజి బతుకు ధీమా తాటిముంజ నీరు తేట
మధనపడని మనసు పల్లెవాడ పసిడి నేల
ఆకుల కుట్టిన విస్తరి చేతుల దబ్బుడం హారం
చీపురు ఊడ్చిన కసువు ఇల్లు ముంత అలుకు
శుభ్రమే పరిపరి మాట గాలి నోట గీత ఊరు
మనసు మాట ఒక్కటై సాగే క్రియ మట్టిమడిదే
లయల విలయ ప్రళయ గీతిక గెలిచిన ప్రణవి
తొలిపొద్దు తేటవెలుగు పాల తెలుపు జీవి ఠీవి
పాల కంకుల కల మురిపాల సీమ మీటే మది కథ
వంచనేలేని కంచాల అన్నమే తీర్చే పల్లె క్షుద్బాధ
శిబి దానకర్ణ పుడమి కలిలేని చిరకీర్తి ఆర్తి ఊరు
మనిషి గడప మనసు గుండె గుడిసె పేర్చే నీడ
అలసిన ఊరంత భీతిలేని నిదుర మట్టిసీమ
కోపతాపాల వేదం పాదులేని నవ కావ్యం ఊరు
ఆచితూచిన అడుగు మనసునడుగు మల్లెతీగ
గోడలల్లిన వాసన పూలు నిలువెల్ల గాలిగంధం
మనువు మనసు పెనవేయు తంగేడు సిరిపల్లె
-------------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి