కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడమాకు (బాలల విజ్ఞాన కథ) - డా.ఎం.హరి కిషన్-9441032212-కర్నూలు

 శివ వణికిపోతూ వున్నాడు. చేతిలో అంగడి నుంచి కొనుక్కొచ్చిన సరుకుల సంచీ వుంది. అటూ ఇటూ దిక్కులు చూస్తూ భయం భయంగా అడుగులు వేయసాగాడు. రాత్రి ఎనిమిది అవుతా వుంది. వీధిలో ఎవరూ లేరు. ఇళ్లలోంచి టీవీల చప్పుడు వినబడుతుంది. వీధిలైట్లు వెలుగుతున్నా భయం పోవడం లేదు. 'ఈ ఒక్క వీధి దాటితే చాలు. ఇంకే భయము లేదు' అనుకున్నాడు.
చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు పోసాగాడు. అమ్మమీద కోపం ముంచుకు వచ్చింది. 'ఎప్పుడూ ఇంతే... పొద్దున్నో సాయంకాలమో పనులు చెప్పకుండా ఇలా రాత్రిపూట చెప్తుంది' అని గొణుక్కున్నాడు.
అటూ ఇటూ చూస్తూ నడుస్తుండగా దారికి ఒకపక్క పడుకున్న నల్లకుక్క కనబడింది. బాగా లావుగా వుంది. శివ వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచింది. పడుకున్నా దాని కళ్ళు మాత్రం శివనే చూస్తున్నాయి. ఆ సందులో నాలుగైదు వీధికుక్కలు వున్నాయి. చిన్నపిల్లలు కనపడితే చాలు మీదికి వచ్చేస్తాయి. అందుకే శివకు రాత్రిపూట అక్కడ ఒంటరిగా తిరగాలంటే భయం.
ఆ కుక్క వంకే చూస్తూ ఒక్కొక్క అడుగే ముందుకు వేయసాగాడు. కుక్క శివ వంక చూసింది. శివ దాని వంక చూశాడు. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. దాన్నే సూటిగా చూస్తూ మరొక అడుగు ముందుకేశాడు. కుక్క నెమ్మదిగా తల పైకెత్తింది. శివ పైప్రాణాలు పైన్నే పోయాయి. అలాగే చూస్తూ మరొకడుగు భయపడుతూనే ముందుకు వేశాడు. కుక్క నెమ్మదిగా నిలబడి గుర్రుమనింది. శివకు దిక్కుతోచలేదు. ఆగాడు. చేయెత్తి 'ఉష్...' అని అదిలించాడు. కుక్క ఒక అడుగు వెనక్కి వేసి ఈసారి గట్టిగా గుర్రుమనింది కోపంగా.
శివకు ఏం చేయాలో తోచడం లేదు. చేతులు వణికిపోతున్నాయి. కాళ్లు తడబడుతున్నాయి. చూపు కుక్క మీదినుంచి తిప్పడం లేదు. 'అది మీదపడి దాడి చేయకముందే వేగంగా అక్కడినుంచి పారిపోవాలి' అనుకున్నాడు. సంచీ గట్టిగా పట్టుకొని దబ దబ దబ ఉరకసాగాడు. తనవైపే వురుకుతూ వస్తున్న శివను చూసి కుక్క అదిరిపడింది. గట్టిగా అరుస్తూ శివ మీదికొచ్చింది. శివ కేకలు పెడుతూ వేగం పెంచాడు. అది మీదికి దూసుకొచ్చి శివ కాలు పట్టుకోబోయింది.
అంతలో ఆ వీధిలోని ఒక తాత అటువైపు వచ్చాడు. జరుగుతున్నది చూసి 'హేయ్... థాయ్' అంటూ పక్కనే వున్న రాయి తీసి వేగంగా కుక్క మీదకు విసిరాడు. ఆ అరుపుకు, మీద పడిన రాయి దెబ్బకు కుక్క కుయ్యిమంటూ తోక ముడుచుకొని పారిపోయింది.
శివ వణుకుతూ తాత చేయి గట్టిగా పట్టుకున్నాడు. తాత వాని తలమీద చేయి వేసి నిమురుతూ "భయపడకు అదేం చేయదులే. మీ ఇంటి వద్ద దిగబడతా రా" అన్నాడు.
శివ ఇంకా వణుకుతూనే "ఈ కుక్కలు లేకపోతే ఎంత బాగుంటుందో. ఎవరూ పట్టకపోరా వీటిని" అన్నాడు. తాత నవ్వేసి "నిజానికి కుక్కలు మనల్ని ఏమీ చేయవు. కానీ మనం భయపడుతూ వాటి కళ్ళలోకి సూటిగా చూస్తాం కదా... అలా చూస్తూ నడవడం మొదలుపెట్టగానే కుక్కలు చాలా భయపడిపోతాయి. మనం దాన్ని ఏమన్నా చేస్తామేమో అని అరుస్తాయి. మనం అలాగే చూస్తూ పరుగెత్తేసరికి దాని మీదకు వస్తున్నామేమో అనుకొని వాటిని అవి కాపాడుకోవడానికి మన మీదికి వస్తాయి. కాబట్టి మనం కుక్కనే కాదు ఏ జంతువు కనపడినా దాని కళ్ళలోకి సూటిగా చూడకూడదు. మన దారిన మనం దాన్ని గమణిస్తు పోవాలి. అలాగే అది మీదికి వస్తుందేమో అని భయమేస్తే చేయి చక్కగా పైకి ఎత్తి నడవాలి. అప్పుడు ఆ కుక్కకి మనం చాలా ఎత్తుగా వున్నట్లు కనపడతాము. దాంతో కూడా అవి మన జోలికి రావు. అడవుల్లో తిరిగేవాళ్లు తమకన్నా ఎత్తయిన కట్టెలు పట్టుకొని తిరిగేది కూడా ఇందుకే. పులులు గానీ ఇతర క్రూర జంతువులు గానీ ఆ ఎత్తయిన కట్టెను చూసి ఎదుటి మనిషి అంత ఎత్తుగా ఉన్నాడేమో అనుకొని దాడి చేయవు" అన్నాడు.
ఆ మాటలు వింటూ వుంటే నెమ్మదిగా శివకు భయం పోసాగింది.
"నీకు ఇంకో సరదా సంగతి చెప్పనా పులి గురించి" అన్నాడు తాత.
చెప్పమన్నట్లుగా ఆసక్తిగా చూశాడు శివ.
"పులి ఎప్పుడైనా సరే వెనకనుంచి దాడి చేస్తుందే గాని ముందునుంచి దాడి చేయదు. అందుకే అడవుల్లో తిరిగేటప్పుడు మనిషి తల వుండే మాస్క్ తీసుకొని తల వెనుక వైపు తగిలించుకోవాలి. అప్పుడు పులి గందరగోళ పడిపోతుంది. దానికి ఎటువైపు నుంచి చూసినా మొహమే కనపడుతుంది. దాంతో దాడి చేయదు" అన్నాడు.
మాటల్లోనే ఇల్లు వచ్చేసింది. "ఇంకోసారి ఒంటరిగా వెళతావా లేక ఎప్పటిలాగే భయపడతావా" అన్నాడు నవ్వుతూ తాత.
శివ చిరునవ్వు నవ్వి "తాతా... నువ్వు మంచి మంచి కిటుకులు చెప్పావు కదా. ఈసారి అవి పాటిస్తూ ఒక్కన్నే ధైర్యంగా వెళతా" అన్నాడు ఇంట్లోకి  అడుగుపెడుతూ.
కామెంట్‌లు