సునంద భాషితం :-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -740
సైంధవోదక న్యాయము
******
సైంధవము అంటే ఇందుప్పు, గుఱ్ఱము,సింధువున బుట్టినది.ఉదకము అంటే జలము, నీరు అనే అర్థాలు ఉన్నాయి.
 సైంధవోదకము అంటే సింధువులో పుట్టిన నీరు.
 సముద్రములోని నీరు సూర్య కిరణాల వల్ల ఆవిరై‌  మేఘంగా మారుతుంది.అదే మేఘము వర్షమై కురుస్తుంది. నదులై పారుతుంది. అలా ప్రవహిస్తూ మరలా సముద్రంలోకి చేరుతుంది.దీనినే జల చక్రం అంటారు.
దీనికి దగ్గరి అర్థం వచ్చేలా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతంగా రాసిన ఓ పాటలోని  పల్లవిని చూద్దామా...
"అనగనగా ఆకాశం ఉంది/ ఆకాశంలో మేఘం ఉంది/మేఘం వెనుక రాగం ఉంది)రాగం నింగిని కరిగించింది/కరిగే నింగి చినుకయ్యింది/చినుకే చిటపట పాటయ్యింది/చిటపట పాటే తాకిన నేల/చిలకలు వాలే చెట్టయ్యింది."
ఎంత బాగుందో కదండీ పల్లవి! మనం దీనిని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది.
"అనగనగా సాగరముంది/ సాగర నీరు ఆవిరయింది/ఆవిరే నింగిన మేఘమైంది/కరిగిన మేఘం చినుకైంది/ చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల/ వాగూ వంకై ప్రవహించింది/ ప్రవహించేఇన చినుకే సంద్రం చేరి/ జల చక్రమై తిరుగుతూ వుంది."
ఇది కేవలం జలానికేనా ? కాదు కదా! సృష్టి అంతా ఇలాగే కొనసాగుతోంది.సమస్త జీవరాశి పుట్టడం, పెరగడం, నశించడం.. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో, ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ ఇది.
ఆధ్యాత్మిక దృష్టితో చూసేవారు జల చక్రం లాంటి సృష్టి స్థితి లయలలో పరమాత్ముని దర్శిస్తూ వుంటారు.
వారి దృష్టిలో ఇలా పరమాత్మ  అనేక రూపాలను ధరించి బ్రహ్మాండమంతా తనకు తానుగా అనేక రూపాల్లో  కనిపిస్తూ వుంటుందనీ,అనేక పేర్లతో పిలిపించుకుంటూ  చివరాఖరికి లయమై పరమాత్మలో  లీనమై పోతుందని" అంటారు.
దీనికి సంబంధించి ఎంత అద్భుతమైన వేదాంత పరమైన పద్యాన్ని రాశారో చూడండి సహజ కవి పోతన.
ఎవ్వనితో జనించు జగ మెవ్వని లోపల నందు లీనమై/యవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూల కారణం/బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా/డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్/"
ఎవరి చేత ఈ జగమంతా సృష్టించబడిందో, ఎవరిలో ఈ జగమంతా లీనమై వుందో,ఎవరి చేత నాశనం చేయబడుతుందో,ఈ సృష్టికి మూల కారణం ఎవ్వరో మొదలు,చివర మధ్య అంతా తానై వున్నవాడు ఎవరో ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు కోరుతున్నాను."అని అర్థము.
ఇలా ఈ విశ్వంలో/ ప్రపంచంలో సృష్టి స్థితి లయలు నిరంతరం జరుగుతూ వుంటాయనే అర్థంతో ఈ సైంధవోదక న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అలా ఆధ్యాత్మిక దృష్టితోనే కాకుండా భౌతిక దృష్టితో చూసినా మహా సముద్రంలాంటి ఈ  ప్రపంచంలో జనన మరణాలు తప్పని ఈ జీవితంలో మనదైన మానవీయ ఉనికిని చాటుకుంటూ  జీవిద్దాం.

కామెంట్‌లు