భక్త కబీర్ దాస్ త్యాగజీవి:- యామిజాల జగదీశ్
 మొక్కకు పువ్వు ఎట్లాగో సమాజానికి మహాత్ములు అటువంటి వారు. పువ్వులో కనిపించే శోభంతా మొక్క నుండి గ్రహించినదే. మొక్కలో అవ్యక్తమైన చైతన్యాన్ని వెలికి తీసి అందులోని సౌందర్యాన్ని పువ్వు తాను పులుముకుని ప్రకాశిస్తుంది. అలుముకుని ఆనందిస్తుంది. అలాగే కొందరు మహాత్ములు కూడా సమాజంలో ఓ వెలుగై వెలుగొందుతారు. సమాజ శ్రేయస్సుకోసం తమను అర్పించుకుంటారు. ప్రతి శతాబ్దంలోనూ కొందరు మహాత్ములు ఎదురవుతుంటారు. అటువంటి వారిలో కబీర్ దాస్ ఒకరు. కబీరుని నీరూ అనే నేత పని చేసే మహమ్మదీయుడు పెంచసాగాడు. కబీరు అంటే మహాత్ముడని అర్థం.
కబీరుకు చిన్నప్పటి నుండే భక్తి శ్రద్ధలు అలవడ్డాయి. అతను ఎక్కువ కాలం ఒంటరిగానే జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడూ భగవంతుని గురించి ధ్యానిస్తూ వచ్చాడు. కబీరుకి జ్ఞానార్జనపై ఆసక్తి ఎక్కువ. అతను వేసే ప్రశ్నలకు గురువులు సమాధానం చెప్పడానికి విసుక్కునేవారు.
ఓసారి కబీరు నడిచి వెడుతుంటే దారిలో ఓ స్త్రీ జొన్నలు తిరగలిలో వేసి తిప్పుతున్న దృశ్యం కనిపించింది. కబీరులో కలవరం మొదలైంది. హృదయాన్ని ఎవరో పిండుతున్నట్లు అనిపించింది. కంఠం గద్గదమైంది. శిశువులా ఏడ్చాడు. అదే సమయానికి ఓ సాధువు అటువైపుగా వచ్చాడు. అతని పేరు నిరంజనుడు. విలపిస్తున్న కబీరును చూసి ఆ సాధువు అతనెందుకు ఏడుస్తున్నాడో అడుగుతాడు.
అప్పుడు కబీరు తాను చూసిన దృశ్యాన్ని చెప్తాడు. జొన్నలు పిండిగా మారుతున్నట్లే జీవులందరూ కూడా మృత్యువాత పడి మరణిస్తున్నారని, ఈ మృత్యు తిరగలి నుండి బయటపడే మార్గం చెప్తారా అని కబీరు అడుగుతాడు.
కబీరు వైరాగ్యాన్ని గ్రహించిన సాధువు దిగులు పడకు నాయనా, ఆశించే మనసుండాలి గాని అనుభవించడం తథ్యం, నువ్వు చూసిన దృశ్యాన్ని మరొక్కసారి తదేకంగా చూడు నాయనా, తిరగలిలో పడిన జొన్నలన్నీ పిండి కావడం లేదని, కొన్ని తిరగలి మధ్య ఉన్న కొయ్య మేకు  చుట్టూ చేరుకున్నాయని, అవి మాత్రమే తిరగలిలో పడి పిండిగాకుండా నిలిచిపోతున్నాయని, అలాగే సంసారమనే తిరగలిలో పడ్డా ఎవరైతే భగవానుడనే మేకును ఆశ్రయిస్తారో వారు మృత్యువాత పడరంటాడు.
ఆ మహాత్ముని దివ్యబోధతో కబీరు ప్రభావితుడై భగవన్నామామృతపానమే తన దినచర్యగా మార్చుకుంటాడు. జ్ఞాపకం చేస్తే గానీ ఆకలి తెలిసేది కాదు కబీరుకి. నిద్ర కూడా అందని అనుభూతిగా మిగిలిపోయింది.
ఇతరులను మోసగించడం కన్నా ఇతరులతో మోసగింపబడటమే శ్రేయోదాయకమని కబీరు అభిప్రాయం. మోసగించడంలో అశాంతి మిగులుతుందని చెప్పిన కబీరు మోసగించబడటంలో శాంతి కలుగుతుందని అన్నారు.
బంగారం గిట్టని వాడూ, కాంతను ముట్టవి నాడూ నిజమైన సాధువని, తాను అతని పాద ధూళి వంటి వాడనని కబీరు చెప్తుండేవాడు.
కామినీ కాంచనాలను జయించినవాడే నిజమైన  వేదాంతి అని ఆయన అన్నారు.
ధనహీనులకు రామనామమే ధనమని చెప్పిన కబీరు తాను జీవించడమే కాకుండా తోటి వారిని కూడా సన్మార్గంలో నడిపించాడు. భగవన్నామంలో కబీరు విశ్వాసం మేరుపర్వతం వంటిది. సంపూర్ణ శరణాగత మార్గంలో జీవితం గడిపిన కబీరు భగవన్నామ ప్రభావం తెలుసుకున్న భక్తులకు  ప్రాణం ఇవ్వడానికైనా తాను సిద్ధమని చెప్పుకునే వారు.
కబీరు త్యాగజీవి.
-     

కామెంట్‌లు