దురాశ: సరికొండ శ్రీనివాసరాజు
 డవిలో పెద్దపులి జింకను వెంబడిస్తుంది. జింక శరవేగంగా పరుగెత్తి బాగా అలసిపోయింది. ఈలోపు పెద్దపులి కంట మరో జంతువు పడటంతో జింకను  వదిలేసింది.  జింక బతుకు జీవుడా అనుకుంటూ "ఈ అడవికి నేను రాజునైతే ఎంత బాగుంటుంది?" అనుకుంది.  అక్కడే ఉన్న సింహం విని, "నేను వృద్ధాప్యంలో ఉన్నాను. మరి కొన్ని రోజుల్లో ఈ అడవిలో మేధావి అయిన విజయ అనే ఏనుగును అడవికి రాజును చేయాలని అనుకుంటున్నాను. ఈ కొన్ని రోజులు నిన్ను అడవికి రాజును చేసి,  నా గుహలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటా.  చక్కగా రాజ్య పాలన చెయ్యి. " అని చెప్పి, అడవి జంతువులను అన్నిటినీ పిలిపించి,  "ఈరోజు నుంచి 30 రోజుల పాటు మన అడవికి రాజు ఈ జింక. జింక చెప్పినట్లు వింటూ దానికి సహకరించడండి." అని సింహం అన్నది. 
     జింక అడవి జంతువుల మధ్య తిరుగుతూ వాటి సమస్యలు తెలిసుకొని పరిష్కరిస్తుంది.  క్షణం తీరిక లేకుండా యథాశక్తి తిరుగుతుంది. రాను రాను అడవి జీవులకు జింకపై నమ్మకం ఏర్పడింది.  కొన్నాళ్ల తర్వాత "విజయ అనే ఏనుగు పైకి మంచిగా కనిపిస్తున్నా అది నివురు గప్పిన నిప్పు.  భవిష్యత్తులో అది ఈ అడవికి రాజు కావాలని చూస్తుంది. ఆ తర్వాత ఈ అడవి రహస్యాలను దుర్మార్గులకు చేరవేయాలని దాని కుట్ర. నేను చెప్పినట్లు మరెవరితో అనవద్దు." అని అడవిలో కనిపించిన జీవికల్లా ప్రచారం చేయడం మొదలు పెట్టింది జింక. 
     నెల రోజులు గడిచాయి. సింహం మరల బయటకు వచ్చి,  అడవి జంతువులను అన్నిటినీ సమావేశ పరచింది.  అడవికి ఎవరు రాజు అయితే బాగుంటుందో అడిగింది. అన్నీ విజయ అనే  ఏనుగు రాజు అయితే బాగుంటుంది ఉన్నాయి. జింక బిత్తరపోయింది.  "ఈ జింక తాను అడవికి శాశ్వతంగా రాజు కావాలనే ఆశతో మొదట్లో మంచిగా పరిపాలిస్తూ, ఆ తర్వాత కావాలని విజయపై దుష్ప్రచారం మొదలు పెట్టింది.  దీని దురుద్దేశం అందరికీ అర్థం అయింది. " అన్నాయి అడవి జీవులు.  విజయను అడవికి రాజును చేసింది సింహం.  జింకను శాశ్వతంగా ఆ అడవి నుంచి బహిష్కరించింది. 

కామెంట్‌లు