న్యాయములు-750
స్వాంగులిజ్వాలయా పరం దిధక్షు:న పరం దహేద్వానవా,స్వాంగులిదాహ మను భవతి న్యాయము
****
స్వ అనగా తాను.అంగుళి అనగా వేలు.జ్వాల అనగా అగ్ని ,మంట, కాగడా.పరం అనగా అధికము, అనంతరము,కాని,అట్లు కానిచో,అత్యధికముగా,సర్వ విధములుగా, మిక్కిలి,ఎదుట.స్వాంగులి అనగా తన వేలు.దాహ అనగా కాలుట, దప్పిక.మను అనగా మంత్రము,మనువు.భవతి అనగా నీవు, మీరు, జరుగుతున్న కాలము. స్వాంగులి జ్వాలయా పరం దిధక్షు అనగా తన వేలి కొసపై అగ్ని లేదా మంటను పెట్టుకొని: నా పరం దహేద్వానవా అంటే విరోధిని లేదా శత్రువును కాల్చే ప్రయత్నం చేసేవాడు: స్వాంగులి దాహమనుభవతి అనగా ముందుగా తన వ్రేలు కాలుతుంది అని అర్థము.
"తన వేలి కొనపై అగ్ని హోత్రం పెట్టుకొని విరోధిని లేదా శత్రువును దహింప ప్రయత్నించే వాడు- శత్రువును దహింపగలుగునో,దహింపలేడో.ఆ మాటను అలా వుంచితే-మొదట తన వ్రేలు కాలిపోవడం మాత్రం అవశ్యమనుభవించును" అని భావము.
ఈ న్యాయము చూడటానికి చదవడానికి పెద్దదిగా అనిపించినా ఇందులో ఉన్న విషయం ఏమిటంటే "ఇతరులకు హాని చేయాలనుకునే వారికి ముందుగా వారికే హాని జరుగుతుంది" అని అర్థము.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ఉంది.అదే భస్మాసురుని కథ. భస్మాసురుడు అనగానే వెంటనే మనకు "భస్మాసుర హస్తం" అనే జాతీయం గుర్తుకు వస్తుంది. మరింకేం అతడి కథా కమామీషు తెలుసుకుందాం.
భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని భక్తితో ప్రార్థించాడు.అప్పుడు శివుడు ఆ రాక్షసుని భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.భస్మాసురుడు" తాను ఎవరి తలపై చేయి పెడితే ఆ వ్యక్తి కాలి బూడిద అవ్వాలని" కోరుకోవడంతో శివుడు దానిని ప్రసాదించాడు.ఇంకేముంది ఆ వర గర్వంతో భస్మాసురుడు అహంకారం పెంచుకుని ముల్లోకాలకు మృత్యుపీడగా తయారయ్యాడు.
అంతే కాకుండా తనకు వరం ఇచ్చిన శివుని తలపైనే చేయి పెట్టి తనకు అడ్డు లేకుండా చేయాలని అనుకుని శివుని వెంట పడ్డాడు. శివుడు తాను ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోలేక భస్మాసురున్ని తప్పించుకోవడానికి పరుగులు తీయడం ప్రారంభించాడు .అది వైకుంఠంలో కొలువై ఉన్న శ్రీమహావిష్ణువు చూశాడు.
శివునికి సహాయం చేసేందుకు శ్రీమహావిష్ణువు వెంటనే తనను తాను ఓ అందమైన కన్యగా మోహినిగా మార్చుకున్నాడు.శివుని వెంబడిస్తున్న భస్మాసురుడిని సమీపించి ఎందుకలా పరుగెత్తుతున్నావని ప్రశ్నలతో అడ్డుకుని,తన హావభావాలతో ఆకట్టుకుంటాడు. అప్పుడు పూర్తిగా మోహిని మాయలో పడిన భస్మాసురుడు మోహినిని పెళ్ళి చేసుకొమ్మని బతిమిలాడుతాడు. మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు తనకు నృత్యం అంటే చాలా ఇష్టమని తనలా నృత్యం చేస్తేనే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. ఆ మాటలకు భస్మాసురుడు ఆనందంగా ఒప్పుకుని ఆమెతో కలిసి నృత్యం చేయడం మొదలు పెడతాడు.అలా చేస్తూ వున్న సమయంలో శివుడిని తాను కోరిన వరం మరిచిపోయి నృత్యంలో భాగంగా మోహిని ఏ విధంగా తలపై చేయి పెట్టుకుందో అదే విధంగా తాను పెట్టుకోవడంతో భస్మాసురుడు వెంటనే కాలి బూడిద అయ్యాడు.
ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అనగా ఇతరులను నాశనం చేయాలని,వారికి కీడు తలపెట్టిన వారికి ముందుగా వాళ్ళకే కీడు సంభవిస్తుంది .ఇది చెప్పడానికే ఈ న్యాయమును మన పెద్దలు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
అందుకే పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, గురుతుల్యుల ఆశీస్సులు ,దీవెనలే పొందాలి కానీ వారికి అపకారం తలపెట్టాలని చూస్తే తమకే అపకారం జరుగుతుందని తెలుసుకోవాలి.
ఇదండీ! "స్వాంగులిజ్వాలయా పరం దిధక్షు: న పరం దహే ద్వానవా:స్వాంగులి దాహమనుభవతి న్యాయము" లోని అంతరార్థము.ఇందులోనీతిని గ్రహించాలి.అలా ఎప్పుడూ ఎదుటి వారికి కీడు తలపెట్టే ప్రయత్నం చేయొద్దని తెలుసుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి