సుప్రభాత కవిత : -బృంద
చెదరిన కురులు సరి చేసుకుని
మగత వీడని రెప్పలు తెరచి 
వెలుగుకు బెదరి అరమూసిన
కనులు తెరచిన ప్రకృతి.

బంగారు జలతారు అంచు 
పైటను చూసుకుని మురిసే 
పదహారేళ్ళ  పడుచులా 
పరవశిస్తున్న ప్రవాహం.

అరుణంతో మొదలై 
తామ్రం లా మెరిసి 
నారింజ రంగుతో మురిసి 
బంగారు వర్ణం దాల్చిన నింగి

సన్నని అలల సవ్వడిలో 
కమ్మని స్వరాన  స్తుతిస్తూ 
వేదమంత్రాలు జపిస్తూ 
రమ్మని రవిని ఆహ్వానిస్తున్న నది

తెలియని ఉత్సాహం పరచి 
దిశలకు వెలుతురు పంచి 
ఉదయరాగాలాపనతో 
హృదయాలను ఉప్పొంగించు దృశ్యం

పిలువకనే ఎదుట నిలిచే 
పరమేశ్వరుని కనుగొనక 
పరుగులు పెడుతూ అటునిటు 
తిరిగే మాయ కమ్మిన జనం 

ఎరిగిన ప్రకృతి పొందే 
అనిర్వచనీయమైన 
అద్భుత ఆనంద క్షణాల
ఒడిసిపట్టిన అంతరంగాలకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు