వెనుకకు నెట్టిన చీకటి తెరల
కనక కాంతుల కమ్మని వేకువ
కలతలు కనిపించనీయని
కమనీయ కలల వేదిక!
తెలి వెలుగుల తొలి కిరణం
తాకినంత తనువంతా పులకరమై
తనలోనే దాగిపొమ్మని వేడే
తేటనీరు నిండిన కాసారం.
విరిసివిరియని కమలాల
తెరిచి తెరవని లేత రేకుల
ముగ్ధ సౌందర్య కాంతులు
సంగమించె సూర్య కాంతితో!
హరిత వర్ణ వలువలు కట్టిన
ధరణి పట్టే మరకత హారతి
పుత్తడి వెలుగుల కూడి
సువర్ణ శోభల మెరిసే ముచ్చటగా!
పైరు పచ్చికల పరాచికాల
తేలి ఆడిన మారుతము
చెరువు నీటిని తానమాడి
కరములు జోడించి నిలిచి
కరువు తీరా ప్రభుని రాక
కనులారా చూసి తరించి
తరువులన్నిట తానై
కలయ తిరిగి కబురు చేరవేసెనేమో!
పుడమిని తొడగిన సంబరము
కడకన్నుల కాంచిన అంబరము
ఎడము లేక సప్త వర్ణములు నింపి
గడుసరిలా తొంగి చూసి నవ్వేనేమో!
వెలుగుబంతి తన వెలుగులాట
మొదలుబెట్టి భూనభముల
వెలయించి బంగరు కాంతుల
కాంచనమయము చేసె కమనీయముగా!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి