సమాజాన్ని మానవత్వం వైపు ప్రభావితం చేసేది సాహిత్యమే:వి.సి ఆచార్య రజనీ

 సమాజాన్ని మానవత్వం వైపు ప్రభావితం చేస్తూ, నైతికతతో కూడిన చైతన్యాన్ని కలిగించేది సాహిత్యమేనని డా.బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ప్రెస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని అన్నారు.రచయితలే జాతి నిర్మాతలని పేర్కొన్నారు.ఆదివారం స్ధానిక శాంతినికేతన్ జూనియర్ కళాశాలలో 
తెలుగు రచయితల వేదిక నూరవ నెల సమావేశంలో వి.సి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఇదే వేదికపై "హంసవాహిని" (కవితా సమాహారం) పుస్తకాన్ని వి.సి ఆవిష్కరించారు. సమావేశానికి తెరవే అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ పదిహేనేళ్ళ క్రితం కోనే శ్రీధర్ స్థాపించిన ఈ తెరవే ఎందరో సాహితీవేత్తల, భాషాభిమానుల ప్రోత్సాహం వలనే వంద నెలల చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి మాట్లాడుతూ తెరవే ఆధ్వర్యంలో  ఆవిష్కరించిన హంసవాహిని సంకలనం ఐదవదని అన్నారు. గతంలో నాగావళి తరంగాలు, గాంధేయం, కవితా వసంతం, సాహితీకిరణాలు సంకలనాలు తెలుగు రచయితల వేదిక సభ్యుల రచనలతో వెలువరించామని అన్నారు. సెట్ శ్రీ విశ్రాంత సి.ఇ.ఓ సురంగి మోహనరావు, జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహనరావువిశ్రాంత డి.ఇ.ఓ. బలివాడ మల్లేశ్వరరావు, ఆత్మీయ అతిథిగా అంబేద్కర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటా లీలావరప్రసాదరావు, సంస్థ వ్యవస్థాపకులు కోనే శ్రీధర్ వేదికనలంకరించి ప్రసంగించారు. వావిలపల్లి రాజారావు పుస్తక సమీక్షను నిర్వహించారు.వాండ్రంగి కొండలరావు తాను రచించిన "గ్రామ నామాలు" అనే పుస్తకాన్ని వి.సి రజనీకి సమర్పించారు.కుదమ తిరుమలరావు వందనాల నూరవ తెరవే అంటూ తెలుగు రచయితల వేదిక వంద నెలల ప్రస్థానాన్ని చదివి వినిపించారు. హంసవాహిని సంకలనంలో స్థానం పొందిన కవులకు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, పుష్పగుచ్చాలతో వి.సి ఆచార్య రజనీ ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు