ఆత్మవిశ్వాసం : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రీపురం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు జరుగుతున్నాయి. అమ్మాయిల కబడ్డీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవైపు 10వ తరగతి అమ్మాయిలు ఒక జట్టుగా ఉంటే మరొక సీనియర్స్ టీం జట్టు 7వ తరగతి అమ్మాయి సుందరమ్మ నాయకురాలిగా మరో ఏడుగురు పోటీ పడుతున్నారు. సుందరమ్మ 7వ తరగతి చదువుతున్నా లావుగా,  బలంగా ఉండటం చేత సీనియర్ టీంకు కెప్టెన్ అయింది.  10వ తరగతి జట్టు నాయకురాలు అలివేలు.  
       ఆట మొదలైంది.  మొదటి సగం సమయం అయ్యే సరికి సుందరమ్మ జట్టు లీడింగులో ఉంది.  రెండో సగం సమయం పూర్తి అయ్యేసరికి అలివేలు టీం పట్టుదలతో ఆడి లీడింగులోకి వచ్చింది.  కానీ వ్యాయామ ఉపాధ్యాయులు ఆటను కొనసాగిస్తున్నారు. ఆట సాగుతూ సాగుతూ ఎంతసేపు సాగిందంటే తిరిగి సుందరమ్మ టీం లీడింగులోకి వచ్చే దాకా సాగింది.  వెంటనే ఆటను ఆపివేసి,  సుందరమ్మ టీంను విజేతగా నిర్ణయించారు వ్యాయామ ఉపాధ్యాయులు.  "ఇది అన్యాయం." అన్నారు అలివేలు టీం వారు.  బోరుమని ఏడుస్తున్నారు. గద్దాయించారు వ్యాయామ ఉపాధ్యాయులు. 
        ఏడుస్తున్న అలివేలు టీం వద్దకు చేరింది శ్రావణి టీచర్.  "ఎందుకు ఏడుస్తున్నారు. పట్టుదల ఉంటే సుందరమ్మ టీంను తేలికగా ఓడించవచ్చు." అన్నది శ్రావణి టీచర్.  "బాబోయ్ ఏనుగులా ఉంది సుందరమ్మ.  మామూలు మనుషులం మేము ఆమెను పట్టటం బాబోయ్.  చివర్లో టీచర్ కంటిన్యూగా సుందరమ్మనే కూతకు పంపింది. బాబోయ్! ఆమెను మేము ఎలా పట్టలేస్తాం?" అన్నది అశ్వని.  "పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. " అన్నది శ్రావణి టీచర్.  
         బాలల దినోత్సవం సమీపిస్తుంది. శ్రావణి టీచర్ అలివేలు జట్టును ప్రత్యేకంగా పిలిచింది.  ఈ బాలల దినోత్సవం రోజున అలివేలు మరియు సుందరమ్మ టీంలకు కబడ్డీ పోటీ నిర్వహిస్తా అని, గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు అని ప్రకటించింది.  "బాబోయ్! మా వల్ల కాదు. " అన్నది అలివేలు.  "అవుతుంది.  పట్టుదల,  ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యం అవుతుంది.  సుందరమ్మ టీంలో సుందరమ్మ మాత్రమే ఒంటిచేత్తో గెలిపిస్తుంది.  సుందరమ్మ అవుట్ అయితే మిగతా వారు సులభంగా దొరికిపోతారు. ఏడుగురు 10వ తరగతి అమ్మాయిలు ఒక్క 7వ తరగతి అమ్మాయికి భయపడతారా?" అన్నది శ్రావణి టీచర్.  ధైర్య వచనాలను, ఆత్మవిశ్వాసాన్ని నూరి పోసింది..
        బాలల దినోత్సవం నాడు కబడ్డీ పోటీ మొదలైంది. మొదటగా కూతకు వచ్చింది సుందరమ్మ.  అందరూ ఒక్కటై గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ఆరుగురిని తేలికగా ఔట్ చేశారు.  ఈసారి అశ్వని కూతకు వెళ్లింది.  మెరుపులా వెళ్లి, సుందరమ్మను టచ్ చేసి, లేడీ పిల్లల పరుగెత్తి వచ్చింది. సుందరమ్మ ఔట్.  క్షణాల్లో మరల ఆల్ ఔట్.  మ్యాచ్ అంతా పూర్తిగా వన్ సైడ్ అయింది.  అలివేలు టీం ఘన విజయం.  నివ్వెరపోయింది వ్యాయామ ఉపాధ్యాయురాలు.  


కామెంట్‌లు