సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -732
సూక్తవాక న్యాయము
   *****
 సూక్త పదము ఉక్త పదానికి సు అనే ఉపసర్గను జోడింఛడం ద్వారా ఏర్పడింది.సు+ఉక్త అనేది వ్యాకరణ పరంగా చూసినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది.అయితే ఈ సూక్త పదానికి అందమైన ప్రసంగము లేదా పదాలు మరియు ఆనందకరమైన ప్రసంగం లేదా మంచి పదాలు అని అర్థము. వాక అనగా మాట ,భాషితము, వచనము ,వాక్కు. ఈ విధంగా సూక్త వాక అనగా వేదాల ప్రకారం కూడా ఇదే అర్థాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సూక్త వాకములు మొత్తం కూడా విశ్వం యొక్క మంగళకరమైన పదాలు, శబ్దాలు.అంతే కాకుండా ఇవి శాశ్వతమైనవి.
సూక్త వాకమును బఠించునట్లు అనగా మంచి వచనములను, మంగళకరమైన పదాలు, శబ్దాలను చదువునట్లు అని అర్థము."
"సూక్త వాకేన ప్రస్తరం ప్రహరతి" అనగా సూక్త వాకమును పఠించుచు ప్రస్తర ప్రహరణమును చేయవలయును అని శ్రుతి విధించుచున్నది.ప్రస్తర ప్రహరణమనగా  రాయి లేదా రత్నమును దర్భలతో విసురుతూ వచనములను పఠిస్తూ హోమము చేయుట అన్నమాట.
ఇందు విధి వాక్యమున "సూక్త వాకేన---" అని యుండుటచే ప్రస్తర ప్రహరణావసరమున సూక్తము నెంతవరకు అనగా పూర్తి సూక్తమునా? లేక దానిలో కొంత భాగమునా? ఎంత వరకు చదువవలసినది అనే సంశయము ఎవరికైనా వస్తుంది. కానీ  వేదమందు ఎక్కడ కూడా ఈ విషయమై నిర్ధారణ లేదు.ఇవ్వలేదు. అట్లు/ అలా వేదమెపుడును నిర్ధారణ చేయదు అన్నది కూడా వేద పండితుల అభిప్రాయము.
అంతే కాకుండా ఈ ప్రస్తర ప్రహరణ  అనేది అనేక దేవతల గూర్చి యాచరింపబడును.ఆయా సూక్తములలో ఆయా దేవతలను గురించి హోమాదికాలు చేయునప్పుడు యేయే సూక్తము ఎంత వరకు పఠింపవలయుననే విషయం మాత్రం వేదమున చెప్పబడలేదు.
కాబట్టి హోమము ఎలా చేయవలెను? అనే మీమాంస/ సందేహము వచ్చినప్పుడు యజమాని ఏ దేవతను గురించి తాను హోమము చేయుచున్నాడో ఆ దేవతకు సంబంధించిన సూక్త భాగమును గ్రహించి/తీసుకుని కర్మానుకూలముగా అనగా తనకు అవసరమైనంత మేరకు ఆ సూక్తమును చదువుతూ హోమము చేయవలెను.అది యజమాని యధీనము అని పెద్దలచే నిర్ణయింపబడి యున్నది. 
ఇంతగా వివరణాత్మకంగా చెప్పడానికి కారణము ఏదైనా యొక విషయమును తనకు సంబంధించినంత వరకూ అవసరమైనంత వరకే గ్రహించి మిగిలిన దానిని వదిలివేయుట గురించి చెప్పడానికి ఈ "సూక్త న్యాయము"  ఉదాహరణగా  నిలుస్తుందని మన పండితులు చెబుతుంటారు.
 ఇదంతా ఏమిటో చదువుతుంటేనే గందరగోళంగా ఉందని, ఇందులోది ఏదీ బోధ పడటం లేదని వాపోవలసిన అవసరం లేదు. దీనిని మన సామాన్య భాషలో చెప్పాలంటే తెలుగులో ఓ రెండు సామెతలు ఉన్నాయి.
అవి ఒకటి "కొండంత దేవుడికి కొండంత పత్రిపెట్టి పూజించలేం" అన్నట్లు- అనగా మనకున్న పరిధిలో మనకున్న వెసులుబాటును,శక్తి సామర్థ్యాలను, స్థాయిని బట్టి 'ఫలం, పత్రం,తోయంతో' దేవుడిని ప్రార్థిస్తాము.ఎవరు ఎంతగా చేయగలరో ఆ దేవుడికి మాత్రం తెలియదా అనేది మన పెద్దలకున్న సబబైన అభిప్రాయం.
ఇక రెండోది ఏమిటంటే పూజారి! పూజారి! నీ భక్తి ఎంత వరకు అంటే నీటి వసతి ఉన్నంత వరకు " అన్నాడో వెనుకటి పూజారి.ఆ రోజుల్లో ఇప్పటిలా ఎక్కడ తిప్పితే అక్కడ నీళ్ళు వచ్చే వసతి లేదు ఎక్కడి నుండో మోసుకొని వచ్చిన నీటితో తన శుచి శుభ్రత మరియు దైవార్చన ఉండేవట. 
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే  సూక్త పారాయణం, హోమము మొదలైనవి  చేస్తున్న యజమానికి కొంత వెసులుబాటు ఇచ్చారు.ఆ యజమాని శక్త్యానుసారమే తాను చేస్తున్న హోమంలో తనకు అవసరమైనంత వరకే గ్రహించి హోమాధికాలు చేయవచ్చును.
ఇంతెందుకండీ! ఈ మధ్య కాలంలో అమెరికాలో స్థిరపడిన మన ఇండియన్ పిల్లలు స్వంత ఇల్లులు కొనుక్కుని పూజారి సలహా మేరకు వాస్తు పూజ హోమం చేస్తున్నారు. మన దేశంలో విధంగా హోమం చేస్తే పది నిమిషాల్లోపే  ఫైరింజన్ వాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు. మరి అక్కడ ఇళ్ళన్నీ చెక్కలతో చేసేవి.ఏమాత్రం ఏమరుపాటుగా ఉండి నిప్పు అంటుకుందంటే అక్కడ బూడిద తప్ప ఇల్లు మిగలదు.
కాబట్టి అక్కడ పూజలు, హోమాలు చేయించే పూజారులు చిన్న చిన్న సమిధలతో ఎండు కొబ్బరి కురిడీలు మూడు లేదా ఐదింటితో హోమం జరిపించేస్తుంటారు.
 ఇదండీ! "సూక్త వాక న్యాయము" అంటే. ఒకవేళ ఇలాంటి హోమాధికాలు ఎవరైనా చేయాలనుకుంటే ఈ విషయాలను గమనంలో పెట్టుకుంటే ఎలాంటి ఆరాటం, ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని మన పెద్దల ఉవాచ.

కామెంట్‌లు