న్యాయములు-756
"క్షతే ప్రహారా నిపతం త్యభీక్ష్ణమ్" న్యాయము
*****
క్షతే అనగా గాయపడిన.ప్రహారా అనగా దెబ్బ , గాయము,చంపుట.నిపతం అనగా పడుట,దిగుట.అభీక్ష్ణమ్ అనగా మాటిమాటికీ జరుగునది, నిరంతరము, అత్యధికము,అత్యంతము అనే అర్థాలు ఉన్నాయి.
దెబ్బ తగిలిన చోటుననే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయని అర్థము.
మనం పనులు చేసేటప్పుడో, నడిచేటప్పుడో రాయినో కర్రనో మరింకేదైనా తాకి దెబ్బ తగిలించుకుంటుంటాం. అది తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ అక్కడ దెబ్బ తగలడం గాయం మరింత బాధ పెట్టడం జరుగుతుంది. ఇది సహజంగా మనందరికీ అనుభవమే.ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొనే మన పెద్దలు ఈ "క్షతే ప్రహారా నిపతం త్యభీక్ష్ణమ్" అనే న్యాయాన్ని ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించిన మన పెద్దవాళ్ళు జీవితానికి అన్వయించి చెప్పేటప్పుడు ఓ ఆసక్తికరమైన కథను చెబుతుంటారు. మరి అదేమిటో చూద్దాం.
ఓ అమ్మాయికి తల్లీ తండ్రీ అడిగినంత కట్నం ఇచ్చి తమకు ఉన్నంతలో ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపిస్తారు.
తమ కూతురు కొత్త కాపురం ఎలా వుందో చూసి రమ్మని తల్లి కూతురు ఇంటికి పంపిస్తుంది.ఎంతో దూరం ప్రయాణించి పడవ ఎక్కి నదిని దాటి తన కూతురు ఇంటికి వస్తాడు. అత్తారింట్లో కూతురు అత్తమామలు,భర్తతో కలిసి తనను ప్రేమగా చిరునవ్వుతో ఆహ్వానించడం, మర్యాదలు చేయడం చూసి కూతురు సుఖంగానే ఉందని మనసులో చాలా సంతోషపడతాడు.
ఎప్పుడెప్పుడు ఈ విషయాన్ని భార్యతో చెప్పుకొందామా అనుకుంటూ వెళ్ళేముందు కూతురును చాటుగా పిలిచి " బిడ్డా! సుఖంగానే ఉన్నావు కదా! అంతా మంచే కదా!అని అడుగుతాడు. ఆ మాటలకు కూతురు "ఇక్కడ నా సుఖం మోచేతి దెబ్బలా ఉంది నాన్నా!" అని తలదించుకుంటుంది.
ఆ మాటకు అర్థం తెలియని తండ్రి "కూతురు ఏదో సరదాగా అని వుంటుంది. మోకాలికో వేలికో దెబ్బలు తాకుతాయి కానీ మోచేతికి దెబ్బలు ఎందుకు తాకుతాయి? కూతురు పెట్టుకున్న కన్నీళ్ళు చూడని ఆ తండ్రి తన కూతురు సుఖంగానే ఉందని అనుకుంటాడు.
తృప్తిగా "ఔనా బిడ్ఢా! సంతోషం": అని చెప్పి వెళ్ళిపోతాడు . అలా వెళ్ళేటప్పుడు బాగా దాహం అవుతుంది. అప్పట్లో దిగుడు బావులు ఉండేవి. నీళ్ళు తాగడానికి మెట్లు దిగుతుంటే రెండు వైపులా మోచేతులకు దెబ్బలు తాకుతాయి. కీలు మీద తాకేసరికి 'అబ్బా! నొప్పి ! అని బాధపడుతుంటే కూతురు మాటలు గుర్తుకు వస్తాయి. అయ్యో! నా కూతురు సుఖంగా, సంతోషంగా లేదా! ఇంతగా బాధ పడుతుందా! అనుకుంటూ పడవ ఎక్కి కూర్చోబోతుంటే ఇంతకు ముందు తాకిన చోట మళ్ళీ దెబ్బలు తాకుతాయి.కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతాయి.' అబ్బా!' అని విలవిల్లాడుతూ తన బిడ్డను తలుచుకుని " నా బిడ్డ పైకి కనిపించడంలేదు కానీ లోలోపల అంత బాధ పడుతుందన్న మాట" అని వేదన చెందుతాడు. చెబితేనే తప్ప చూడటానికి అంతగా కనబడని దెబ్బలు ఇవే కదా అనుకుంటాడు. తన కూతురు బాధను తీర్చేదెలా, ఏం చేయాలో? తెలియక బాధ పడుతూ వుంటాడు.
ఇక్కడ కథలోకి వెళితే మనకు అర్థం అయింది ఏమిటంటే మన శరీరంలో కొన్ని ప్రాంతాల్లో తరచూ గాయాలు తాకుతూ ఉంటాయి.అయితే అంతటితో ఆగకుండా తాకిన చోటనే మళ్ళీ మళ్ళీ తాకి ఇబ్బంది పెడుతుంటాయి.
ఇవి కేవలం దేహానికే కాదు ఒకోసారి మనసుకు కూడా మాటల గాయాలు అవుతుంటాయి.వాటిని ఎంతగా పట్టించు కోవద్దు అనుకున్నా మళ్ళీ మళ్ళీ ములుకుల్లాంటి మాటల గాయాలు తగులుతూనే వుంటాయి. ఎంత తట్టుకోలేని బాధనో తాకిన వారికి తెలుస్తుంది..
కొందరు నవ్వుతూనే సరదా మాటల పేరుతో మనసును పదే పదే గాయ పరుస్తూ వుంటారు.కాబట్టి ఎవరి మనసునూ గాయపరచకూడదు. మోచేతి దెబ్బలా మార్చకూడదు.ఆ కొందరిలో మనం అస్సలు ఉండకూడదు .
"క్షతే ప్రహారా నిపతం త్యభీక్ష్ణమ్ న్యాయము " అంటే ఇదే నండి.ఇలాంటి పనులు అసలు చేయకూడదు. అందరి ఆనందంలో మన ఆనందం వెతుక్కోవాలి.అంతే కానీ బాధను పెట్టకూడదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి