రుద్రగిరిలో రుద్రయ్య అనే ఓ సాధువు వుండేవాడు. అతను ఎంతో గొప్ప మనసుతో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి సాధువు అని పేరుతెచ్చుకున్నాడు.
అతనికి వచ్చే ప్రతి పైసాను సమాజ హితం కోసం ఖర్చుచేసేవాడు. అందువల్ల అతను ఎక్కడికి వెళ్లినా మంచి పేరు వుంది.
ప్రజలు సమర్పించిన విరాళాలతో నిత్య అన్నదానం చేసేవాడు. దీంతో పాటూ పిల్లలు చదివేందుకు గురుకుల పాఠశాలను సైతం ప్రారంభించి విద్యాదానం చేసేవాడు.
ఓ సారి స్వామీజీ స్వయంగా విరాళాలు సేకరించేందుకు గ్రామానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఓ గుడి దగ్గర రుద్రయ్య విశ్రమించాడు. ఆయన వెంటే నలుగురు శిష్యులు కూడా నిద్రించారు. అదే సమయంలో బాగా ఆకలి వున్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ‘‘ అయ్యా.. ఆకలిగా వుంది.. ఏదైనా అంత అన్నం వుంటే పెట్టండయ్యా..!’’ అంటూ ప్రాధేయపడ్డాడు.
గాఢనిద్రలో వున్న రుద్రయ్య మేల్కొని ఎదురుగా వున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అన్నం తిని నాల్గు రోజులు అయినట్లు వుంది. కాలే కడుపుతో కన్నీరు పెడుతున్నాడు.
రుద్రయ్య అతని దీనావస్థను చూసి చలించిపోయి ‘‘ ఎవరు నాయనా నువ్వు? ఎందుకిలా అయ్యావు?’’ అడిగాడు.
‘‘ స్వామీ నేను ఓ అనాథని.. నాకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు..తిండి తిని వారం రోజులైంది. ’’ అని దీనంగా చెప్పాడు.
వెంటనే రుద్రయ్య తన భుజానికి తగిలించుకున్న సంచిలోంచి నాలుగు చపాతీలు తీసి అనాథకు ఇచ్చాడు. ఎంతో ఆనందంతో వాటిని తిన్నాడు అనాథ వ్యక్తి. ఆ రాత్రి వారి వద్దే నిద్రించాడు. తెల్లారిన తర్వాత రుద్రయ్య తన శిష్యులతో చేరి గ్రామం వైపు నడిచాడు. అతని వెంటనే నడిచాడు అనాథ వ్యక్తి. కొద్ది సేపటికి గ్రామంలోకి ప్రవేశించిన రుద్రయ్య జోలి పడుతుంటే విరాళాలు వెల్లువలా వచ్చాయి. సాయంత్రం వరకు తిరిగి వచ్చి డబ్బు లన్నీ ఓ గోనె సంచిలో మూటగట్టాడు. వాటితో పాటూ వస్తు సామగ్రి కూడా వచ్చింది. వాటిని భుజం మీద కెత్తుకుని మోయలేక మోస్తూ ముందుకు నడిచాడు. రాత్రి పడగానే ఓ గుడిలో పడుకున్నాడు. ఆ విరాళాల మూటని పక్కనే వున్న ఓ జమిందారు ఇంట్లో దాచి పెట్టారు. తెల్లారింది. రుద్రయ్య నల్గురు శిష్యులను లేపి జమిందారు వద్దకు వెళ్లి తాను దాచిన విరాళాల మూటను తీసుకుని నడకదారి పట్టారు. విరాళాల మూటను చూసిన శిష్యులకు సందేహం వేసింది. తీస్కెళ్లి ఆశ్రమంలో మూట విప్పారు. నాణేలు చాలా వరకు తగ్గాయి. నోట్లలోనూ తేడా కనిపించింది. ఇక చేసేదేమీ లేక డబ్బును దాచి మరుసటి రోజు వరద బాధితులకు పంచడానికి బయలుదేరారు. మంత్రి చేతుల మీదుగా విరాళాల డబ్బును పంపిణీ చేశారు.
కొద్ది సేపటికే బాధితులు తీసుకున్న డబ్బును వెనక్కి తీసుకొచ్చి ‘‘ మీ నకిలీ నోట్లు మాకొద్దు..!’’ అని అనరాని మాటలు అంటుంటే రుద్రయ్య వినలేక విన్నాడు.
ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చారు. రుద్రయ్యను విషయం ఏమిటని అడిగారు.
రుద్రయ్య విస్తుపోయి తనకేమీ తెలియదని దాతలు ఇచ్చిన విరాళాలు పంచుతున్నానని తెలిపాడు.
పోలీసులకు అనుమానం వచ్చి ‘‘ ఇదేమిటి స్వామీ.. ఇలా జరిగింది?’’ అని ప్రశ్నించారు.
రుద్రయ్య దిక్కుతోచని వాడిలా ‘‘ డబ్బు సంచిని జమీందారు ఇంట్లో దాచాము.. అంతే అందులో ఏ ముందో కూడా తెలియదు’’ అని చేతులు జోడించాడు.
వెంటనే పోలీసులు జమిందారు ఇంటికి వెళ్లారు. అప్పటికే ‘‘జమిందారుపై అధిక వడ్డీల వ్యాపారి... మనుషుల్ని జలగల్లా పీడిస్తాడు..’’ అనే ఫిర్యాదు వుంది. అతడిని ‘‘ ఏం జరిగిందో చెప్పు’’ అని స్టేషన్‌లో బందించి శిక్షించారు.
ఇంట్లో భార్యాపిల్లలు ఒంటిరిగా వుండడం చూడలేక భయపడి ‘‘నేనే విరాళాల మూటలో డబ్బు కాజేసి నకిలీ నోట్లు వుంచాను..’’ అని అంగీకరించాడు. దీంతో జమిందారు దొంగ స్వభావం బయటపడినది. రుద్రయ్య సాధు స్వభావం ఏమిటో తెలిసిపోయింది. స్వార్థ బుద్ధితో డబ్బు సంపాదించాలనుకున్న జమిందారు స్వార్థ బుద్ధికి జైలు శిక్ష పడింది.
క్షమించి తనకు శిక్షను తగ్గించమని పోలీసులకు చెప్పాలని నిస్వార్థ సేవకుడైన రుద్రయ్య స్వామి పాదాలపై పడి వేడుకున్నాడు సాధుబుద్ధి ఏమిటో తెలుసొచ్చిన జమీందారు.
సాధు బుద్ధి !:- - బోగా పురుషోత్తం, తుంబూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి