శ్రుతి మించిన పిచ్చి : - సరికొండ శ్రీనివాసరాజు
 రమేశ్ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి చాలా దిగులుగా ఉన్నాడు. ఇలా ఉండటం అతనికి కొత్తేమీ కాదు. టీచర్లు కారణం అడిగితే చెప్పడు . ఇంట్లో ఎమైనా గొడవ అయిందేమో  అనుకుంటారు. తెలుగు ఉపాధ్యాయుడు వేంకటేశ్వర్లు గారికి అసలు విషయం తెలుసుకోవాలని అనిపించింది. అతని ఆప్త మిత్రుడు మహేశును పిలిపించి కారణం అడిగారు. "నాకు కూడా ఏమీ చెప్పరు సర్." అన్నాడు మహేశ్. ఈరోజు ఎలాగైనా తెలుసుకో." అన్నారు ఉపాధ్యాయులు.
         మధాహ్నం భోజన విరామం తర్వాత మహేశ్ మిత్రుని దిగులుకు కారణం అడిగాడు. "నిన్న క్రికెట్లో నా ఫేవరెట్ ప్లేయర్ తొందరగా అవుట్ అయ్యాడురా." అని దిగులుగా. "అయినా ఇండియా గెలిచింది కదరా!" అన్నాడు మహేశ్. "ఆయితే ఏం లాభం? నా ఫేవరెట్ ప్లేయర్ తొందరగా ఔట్ అయ్యాడురా." అన్నాడు రమేశ్. ఇది వెనుక నుంచి వింటున్న తెలుగు ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చి, "ఒరేయ్ రమేశ్! నీ ఫేవరెట్ ప్లేయర్ నిరాశ పరచిన ప్రతీసారీ రోజంతా దిగులుగా ఉంటావు. మరి నువ్వు అతి తక్కువ మార్కులు వచ్చిన ప్రతీసారీ నీ తల్లిదండ్రులు బాగా నిరాశ పడుతున్నారు. వారికి ఏమి సమాధానం చెబుతావు. ఇప్పటికీ ఎన్నిసార్లు నీ మార్కుల కారణంగా నిరాశ పడ్డారో? వారి బాధను తీర్చేదెవారు? దీనికి సమాధానం చెప్పు. నీ క్రికెట్ పిచ్చితో చదువు పూర్తిగా పక్కన పెట్టావు. నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు." అన్నారు వేంకటేశ్వర్లు గారు. ముఖం వేలాడేసుకున్నాడు రమేశ్.

కామెంట్‌లు