అత్యుత్సాహం : సరికొండ శ్రీనివాసరాజు
   పాఠశాలలో క్విజ్ పోటీ జరుగుతుంది. 10వ తరగతిలో  పోటాపోటీగా చదివే అమరేంద్ర,  మహేంద్ర టీంలలో ఏదో ఒక టీం ఫస్ట్ రావడం ఖాయం అని చాలామంది అంచనా.  అయినా వీరి పోటీని తట్టుకుని బహుమతి సాధించాలని జయంత పట్టుదల.  తన జట్టుకు నమ్మకంతో కోరుకున్న విజయేంద్ర మీద జయంత నమ్మకం. విజయేంద్ర 9వ తరగతి విద్యార్ధి.  చాలా తెలివైన వాడు. "మనం ఎలాగైనా గెలవాలి.  మీరు మంచి ప్రిపరేషన్ తో రావాలి." అని  జయంత తన జట్టు విద్యార్థులకు చెప్పాడు.
       క్విజ్ పోటీ మొదలైంది.  ఒక్కొక్క జట్టును ప్రశ్నలు అడుగుతున్నారు.  వేరే జట్టును ప్రశ్నలు అడిగినా సరే వెంటనే తన తెలివి తేటలు ప్రదర్శించడానికి విజయేంద్ర ఠక్కున తనకు తెలిసిన జవాబు తన జట్టు నాయకునికి చిన్నగా చెప్పేవాడు.  అతడు చెప్పిన జవాబు అవతలి వారికి వినబడి, ఠక్కున వారు ఆ జవాబు చెప్పి, మార్కులు కొట్టేసేవారు.  జయంత విజయేంద్రతో "తొందరపడకు. మనకు రావలసిన మార్కులు పోతాయి. " అన్నాడు.  మనోడు వింటేనా? తమ జట్టు వంతు రాగానే తాను చెప్పదలుచుకున్న జవాబు మరొకరు చెబితే.  ఆ కీర్తి వారికి వస్తుంది కదా!" అని విజయేంద్ర ఆలోచన. మరల అవతలి టీంను ప్రశ్నలు అడగగానే మనోడు గొంతు మరింత తగ్గించి తమ జట్టు వారికి చెప్పేవాడు.  మరల అవతలి టీం క్యాచ్ చేసి,  ఆ జవాబులు చెప్పేవారు. 
      మరీ అవతలి జట్లను తీసీ పారేయాల్సినంత లేరు. కొన్ని ప్రశ్నలు వారికి తెలిసినా కొన్ని తెలియని వాటికి విజయేంద్ర పుణ్యమా అని విజయేంద్ర నోటి నుంచి విని చెప్పేవారు.  విజయేంద్ర పుణ్యమా అని ప్రత్యర్ధి జట్లు ప్రథమ,  ద్వితీయ స్థానాన్ని పొంది, బహుమతి సాధించాయి.  మళ్ళీ ఇంకెప్పుడూ ఏ జట్టూ విజయేంద్రను తమ జట్టుకు కోరుకోలేదు.  విజయేంద్రకు వయసుకు మించిన తెలివితేటలు ఉన్నాయి.  కానీ ఏం లాభం? అత్యుత్సాహం అతని కొంప ముంచింది.  

కామెంట్‌లు