సునంద భాషితం :-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -736
స్వేద జనమిత్త శాటక త్యాగ న్యాయము
****
స్వేద అనగా చెమట.జనమిత్త అనగా పోయునేమో లేదా పుట్టునేమో నని.శాటక అనగా వస్త్రమును. త్యాగ అనగా విడిచి పెట్టు, వదిలిపెట్టు వదులుకోవడం త్యజించడం అనే అర్థాలు ఉన్నాయి.
ఇదొక గమ్మత్తయిన న్యాయము. ఒంట్లోంచి చెమటపోసి కట్టుకున్న బట్టలు మురికి అవుతాయనీ,తడిచిపోతాయనే భయంతో ఒకానొక వ్యక్తి ఒంటిమీద బట్టలు వేసుకోవడమే మానేశాడట". అందుకే మన పెద్దలు హాస్యంగా 'ఇదెక్కడి చోద్యం రా బాబూ!' అనుకుంటూ న్యాయమును ఇలా చెప్పారు. 
"చెమట పోయుననే భయము వలన వస్త్రము మానినట్లు." 
ఇదిగో ఇలాంటిదే మరోటి చూద్దాం.
"యతోహ మనన్తాప త్యాపి దుర్జన చక్షుర్దోష భయా దవివేకాదిభి  ర్మంత్రిభి ర్వంధ్యేతి ప్రఖ్యాపితా లోకేమమైవాపత్యా న్యన్య జనాపత్యతయా గీయన్తే సోయం స్వేద జనిమిత్తేన శాటక త్యాగ న్యాయః!!"
అనగా "చెడు దృష్టి కలవారు ఎవరైనా వచ్చి చూసినట్లయితే దృష్టి దోషము తగులుతుందేమో యను భయము వల్ల చాలా మంది పిల్లలు కలదే యైనను ఒకావిడ సంతానం లేదు.గొడ్రాలిని అని లోకమునకు చెప్పుకుంటూ తన సంతానాన్ని చూస్తూ వీరు నా పిల్లలు కాదు. ఎవరి పిల్లలో అని చెప్పుకొన్నట్లు."
 పై రెండు రకాలైన విషయాలను చదివినప్పుడు  కొన్ని రకాల ఆలోచనలు, పూర్వకాలంలో సమాజ పరిస్థితులు ఎలా ఉండేవో...అవన్నీ మన మనసులో తప్పకుండా మెదులుతుంటాయి.
ఒకప్పుడు చాలా పిల్లలు పుట్టినా  వారిలో కొందరు మాత్రమే బతికి బట్ట కట్టేవారు. పిల్లల్ని కోల్పోతున్న తల్లిదండ్రులు పిల్లలకు ఆయుఃక్షీణం కాకుండా ఎవరి దృష్టి సోకకుండా  ఉండాలని పేర్లు కూడా బాగా లేనివి పెంటయ్య,ఇస్తారి,బజారు, బండయ్య.. లాంటి పెట్టేవారు.
 అలాంటిదే ఈ న్యాయము.  గంపెడు సంతానాన్ని కని కూడా తనకు పిల్లలు లేరనీ, ఎదురుగా కనిపించే పిల్లలు కూడా తన పిల్లలు కాదని చెప్పేవారట.అలా ఎందుకమ్మా! అంటే అమ్మో నరదృష్టి - నరదృష్టికి నాపరాయి కూడా ముక్కలు అవుతుందని " అనేవారు. ఒకవేళ దురదృష్టవశాత్తు  బాగా సంతానం ఉన్న పిల్లలో ఎవరికైనా ఏమైనా వచ్చి చనిపోతే ఎవరో అలా చూడబట్ఠే అలా మరణం సంబంధించిందని అనుకునేవారు.అంతే కానీ వైద్య పరంగా తాము చేస్తున్న పొరపాట్లను ఎంత చెప్పినా నమ్మేవారు కాదు.
 ఇక మనం న్యాయము విషయానికి వచ్చే ముందు ఓ చిన్న సంఘటన. అది ఏమిటంటే ఒకావిడకు తమ బంధువులలో బాగా ఉన్నవాళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళికి పోవాలని ఉంటుంది. తనకు  ఖరీదైన చీరలు లేకపోవడం వల్ల అంతో ఇంతో ఉన్న పక్కింటావిడకు విషయం చెప్పి ఓ మంచి పట్టుచీర  కావాలని అడుగుతుంది.దాంతో ఆ పక్కింటావిడ మొహమాటం కొద్దీ మంచి ఖరీదైన పట్టు చీరైతే ఇస్తుంది.కానీ తీసుకున్నావిడ ఎక్కడ బడితే అక్కడ కూర్చుని, నలిపి పాడుచేస్తుందేమోనని భయం. అందుకే ఆమెకు పట్టుచీర ఇచ్చి, ఆమె కూర్చోవడానికి వీలుగా ఓ పీట కూడా తీసుకొని ఆమె వెనకాలే తిరుగుతూ ఉంటుంది.
అలాగే ఇక్కడ కూడా ఓ వ్యక్తి మంచి వస్త్రం అంటే ఓ లాల్చీ తెచ్చుకోనైతే తెచ్చుకుని ఉంటాడు.కానీ అది ఒకవేళ చెమటకి నలిగి  పాడవుతుందేమోనని... "వేసుకోవడం ఎందుకు?ఇచ్చిన వాళ్ళతో మాట పడటం ఎందుకని? అసలు వేసుకోవడమే మానేశాడన్న మాట.
 ఇలాంటి వారే కాదు  మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరు మహా పిసినారితనం ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే "అహ! నా పెళ్ళంట!"  సినిమాలో కోటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు.పైసా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు.కడుపుకు కూడా సరిగా తినరు. ఏదైతేనేం అనుకుంటూ  సరైన బట్టలు కూడా వేసుకోరు. అధిక సంపన్నులు అయినా కటిక దరిద్రుల వలె బతుకుతూ వుంటారు. అలాంటి వారిని కూడా ఇందులో చేర్చవచ్చు.
ఈ "స్వేద జనమిత్త శాటక త్యాగ న్యాయము" ముచ్చట చిన్నదేం కాదండోయ్! అలాంటి, ఇలాంటి వారిని చూసే మన పెద్దవాళ్ళు  ఇదిగో ఇలాంటి న్యాయాలు కూడా సృష్టిస్తూ వుంటారు. 
ఇలా మనుషుల్లో మూఢ నమ్మకాలూ,, ఇలాంటి పిసినారి వాళ్ళూ,వింత ఆలోచనల మనుషులు ఉంటారని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోగలిగాం.

కామెంట్‌లు