న్యాయాలు -764
అబ్ధి ఫేనాది న్యాయము
******
అబ్ధి అనగా సముద్రము.ఫేనము అనగా సముద్రపు నురుగు.
అబ్ధి ఫేనాది అనగా సముద్రంలో పుట్టే నురుగు, బుడగలు మొదలైనవని అర్థము.
సముద్రంలో పుట్టిన నీటి బుడగలు, నురుగు మొదలైనవి క్షణములో పుట్టి మరు క్షణములో నశిస్తాయి అని అర్థము.
అలాగే సంసార సాగరంలో కలతలు, అపోహలు, కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ వుంటాయి. ఏవీ శాశ్వతంగా నిలువవు అనే అర్థంతో ఈ "అబ్ధి ఫేనాది న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
సంసారము ఒక మహా సాగరంలాంటిదని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు.దీని గురించి ప్రస్తావిస్తూ కొంతమంది వాళ్ళ చేదు అనుభవాలను చెప్పి ఆ సాగరంలోకి దిగొద్దని హెచ్చరిస్తుంటారు.
మరికొందరేమో సంసారం సాగరమైతేనేం. అందులో ఈదుతూ, ఆనందపు గమ్యం చేరుకోవాలనీ,అది మానవ జీవన ధర్మమని చెబుతుంటారు.ఇలా రెండు రకాల వ్యక్తులు చెప్పేదాన్ని బట్టి అదేదో చూడాలి అందులోకి దిగాలనే ఆసక్తి కొందరిలో పెరుగుతుంది.
మరి కొంతమందిలో ఆ సంసారం - సముద్రం ,అదో పెద్ద రొంపి, ఒంటరిగా వుండకుండా లేనిపోని బాదర బంధీలు ఎందుకని సంసారమంటేనే విముఖత చూపిస్తుంటారు.
ఇందులోకి ఆకర్షితులైన జీవులకు పెట్టిన పునరుత్పత్తి అనే చక్రమే ఇలా చేయిస్తుంది.ఆ చట్రంలో వ్యక్తులను అలవోకగా లాగి తమాషా చూస్తుంది.
అలా లాగడానికి ప్రేమ, అనురాగం,ఆప్యాయత లాంటి బంధాలను పెంచుతుంది.
సముద్రం చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఉదయాస్తమయాలలో పడే సూర్య కిరణాలతోనూ,పడిలేచే తరంగాలతోనూ, అలలు తీరంలో చేసే అల్లరితోనూ సముద్రం ప్రతి వారి మనసు దోచుకుంటుంది. అదే విధంగా సంసార సముద్రము కూడా మనుషులను ఆకర్షిస్తుంది.అందులోకి వెళ్ళి ఈదాలనిపించేలా చేస్తుంది. దీనికి తోడు గృహస్థ ధర్మము యొక్క గొప్పతనం గురించి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు విడమర్చి చెప్పాయి. సంసారమే జీవన పరమార్థమనీ, సంసారమే జీవితానికి సార్థకత చేకూరుస్తుందని చెప్పడం మనందరికీ తెలిసిందే.
అయితే ఎవరో నూటికి కోటికి ఒక్కరు మాత్రం వీటన్నింటికీ అతీతంగా సన్యాసిలా వుంటారు తప్ప మిగిలిన వారంతా సంసార సాగరంలో మునిగి తేలుతూ నురగలు,బుడగల్లాంటి సమస్యల బారిన పడుతూ లేస్తూ వుండేవారే.
సంసారము ఎలా వుండాలో భావానంద భారతీ స్వామి గారు చెబుతూ "పడవ నీళ్ళలో వుండాలి కానీ పడవలో నీళ్ళు వుంటే పడవ మునిగి పోతుంది" అలాగే "సంసారంలో నరుడు వుండాలి కానీ నరుడిలోనే సంసారం ఉండకూడదు". అంటారు.అలా వున్నప్పుడు క్షణాల్లో పుట్టే అపోహలనే నీటి బుడగలు, నురగలు విషము కక్కుతూ నిలువునా ముంచేస్తాయి అని అర్థము.
సంసార జీవితాన్ని ఆధ్యాత్మిక ధర్మాచరణతో గడుపుతూ జీవితాన్ని సార్థకం చేసుకొన్న వారూ ఉన్నారు.వారిలో శ్రీరామకృష్ణ పరమహంస,తుకారాం మొదలైన వారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
నీటి బుడగల్లాంటి అపోహలు,మాటపట్టింపులు, నురగలు కక్కే ఈర్ష్య అసూయలు ఒకోసారి సంసారంలో పొడసూపుతూ వుంటాయి.అంత మాత్రాన బెంబేలెత్తి పోకుండా కాసింత సహనంతో కూసింత ఓర్పును ప్రదర్శిస్తే సముద్రంలో నీటి బుడగలు,నురగల్లా అవే తేలిపోయాయి.
'అబ్ధి ఫేనాది న్యాయము"లోని అసలైన అంతరార్థం ఇదే.మనమంతా సంసారమనే సాగరంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే కాబట్టి పై విషయాలన్నీ గమనంలో పెట్టుకొని సాగరం పైకి ఎలా అందంగా కనిపిస్తుందో,అందరినీ అలరిస్తుందో మనమూ అందంగా ,ఆనందంగా అలాంటి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి