టీచర్ పరీక్షా ఫలితాలను తెలుపుతుంది. విజయ అనే అమ్మాయికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. "నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? మరీ ఇంత తక్కువ మార్కులు వస్తే ఎలా?" అని బెత్తముతో బాగా దండించింది. విజయ వెక్కి వెక్కి చాలా సేపు ఏడ్చింది. తోటి విద్యార్ధులలో కొంతమంది చాలా బాధ పడ్డారు. విజయకు ఇది కొత్తేమీ కాదు. ఎప్పుడూ మార్కులు తక్కువ వస్తూనే ఉంటాయి. ఈసారి శిక్ష అతి కఠినంగా పడింది.
ఆ తరువాత కూడా విజయ చదువులో పురోగతి లేదు. మళ్ళీ పరీక్షలు మొదలు అయ్యాయి. విజయ కంటే ముందు నంబర్ అమ్మాయి వాణి విజయ వద్దకు వెళ్ళి, "ఈసారైనా మార్కులు బాగా తెచ్చుకుంటావా?" అన్నది. విజయ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఏడుస్తుంది. "ఇలా ఏడిస్తే చదువు వస్తుందా. కష్టపడి చదివడం నీ వల్ల కాదా? సరే ఈసారి నేను రాసేవి చూసి కాపీ చెయ్యి." అన్నది వాణి.
ఆప్పుడు విజయ ఇలా అన్నది. "కాపీ కొట్టి తెచ్చుకునే 100 మార్కుల కన్నా కష్టపడి తెచ్చుకున్న 10 మార్కులే మిన్న. నా దృష్టిలో చూసి రాయడం బిఛ్ఛం అడుక్కు తినడంతో సమానం. ఒకరికి తెలియకుండా వారి పేపర్ చూసి మక్కికి మక్కి కాపీ కొట్టడం దొంగతనంతో సమానం. నాకు అవి అస్సలు నచ్చవు." అన్నది విజయ. "అసలు నీ సమస్య ఏమిటి?" అని అడిగింది వాణి. నాకు "ఏమీ అర్థం కావడం లేదు." అన్నది విజయ. "టీచర్స్ చెప్పేటప్పుడు వేరే ఆలోచన లేకుండా శ్రద్ధగా వింటే చాలు. ఏదైనా సులభంగా వస్తుంది. నాతో కలసి చదువుకో. నీకు అర్థం కాని విషయాలన్నీ వివరంగా చెబుతా. కలసి చదివితే మార్కులు బాగా వస్తాయి." అన్నది వాణి. విజయ సంతోషంగా ఒప్పుకుంది. వాణీ టీచర్ వద్దకు వెళ్ళి, తమ మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పింది. టీచర్ విజయను దగ్గరకు పిలిచి "బంగారు తల్లీ! ఎంత మంచి దానవమ్మా!" అని దగ్గరకు తీసుకుంది.
నిజాయితీ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి