సుప్రభాత కవిత : -బృంద

కలతల చీకటి కరిగించి 
వెలుతురు పువ్వులు పూయించి 
మనసున ధైర్యం రగిలించి 
అడుగు ముందుకు వేయించే 
వేకువ

మౌనం ఆక్రమించిన మదిని 
మెరుపులా చైతన్య పరిచి 
మోడుగా మారిన జీవితంలో 
చివురు మొలిపించే వేకువ

కన్నీట కరిగిన క్షణాల 
పన్నీట ముంచి మురిపించి 
మున్నీట నిలిచిన నావకు 
తీరైన తెన్ను చూపించే వేకువ

అలజడుల అల్లాడిన 
అంతరంగాలకు 
అపురూపమైన వరమేదో 
అనుగ్రహించే వేకువ

రంగు వెలసిన కలలకు 
హంగులేవో కల్పించి 
కమ్మని వర్ణాలు అద్ది 
రూపమిచ్చి కరుణించే వేకువ

కలవరాల కౌగలిలో 
కలలే ఎరుగని కనులకు 
కడగండ్లు  తీరేలా 
కరుణ కురిపించే వేకువ

కోరికల కోరుట మరచి 
కోరికే నేరమవునేమో  అని ఎంచి 
కోరక  దాచిన వెన్నో తీర్చి 
కొత్త వెలుగులు పంచే 
కొంగొత్త  వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు