న్యాయాలు -872
జీవితోపి న జీవేత్స యది లోకేన దూష్యతే న్యాయము
****
జీవితోపి అనగా జీవితంతో . న జీవేత్ అనగా జీవించకూడదు ,బ్రతుక కూడదు.యది అనగా ఒకవేళ.లోకేన అనగా ఈ లోకంలో,ఈ ప్రపంచంలో.దూష్యతే అనగా దూషింపబడుతున్నాడు, అవమానానికి గురవుతున్నాడు అనే అర్థాలు ఉన్నాయి.
లోకము యొక్క దూషణకు పాత్రుడైన వాడు జీవించి ఉన్నా చచ్చిన వారిలోనే లెక్క అని అర్థము.
లోకంలో ప్రజలందరూ ఒక వ్యక్తిని విపరీతంగా ద్వేషిస్తూ అలాంటి వాడు బతకడం వృధా .భూమికి భారం.తల్లిదండ్రుల కడుపున చెడబుట్టాడు అన్నారంటే నిజంగా ఆ వ్యక్తి బతకడమే వృధా అతడు బతికి ఉన్నా చనిపోయినట్టే. అలాంటి వ్యక్తులను కన్న తల్లిదండ్రులు ఎంత దురదృష్టవంతులో అనే అర్థంతో కూడా కలిపి ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
అలాంటి వారిని గురించి ముందుగా వేమన ఏమన్నాడో చూద్దాం.
"తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు/ పుట్టనేమి వాడు గిట్టనేమి/: పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?/ విశ్వధాభిరామ వినురవేమ!"
తల్లిదండ్రులను గౌరవించని వాడు అనగా దయతో చూడని వాడు పుట్టలోని చెదతో సమానం. పుట్టిన తర్వాత బతికి ఉన్నా. లేదా చచ్చిపోయినా ఎవరూ బాధపడరు అని అర్థము.
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పుత్రుడైనా సరే మంచి వాడు కానప్పుడు వాడు పుట్టలోని చెదతో సమానం. చెద అసంఖ్యాకంగా పుడుతూ వుంటుంది.చస్తూ వుంటుంది.అలాగే వ్యక్తులూ కూడా.
మహాకవి ధూర్జటి కూడా అలాంటి దుష్ట వ్యక్తులను గురించి ఏమన్నాడో చూద్దాం.
" కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవన భ్రాంతులై/కొడుకులు పుట్టరె కౌరవేంద్రనకనేకుల్ వారిచే నే గతుల్/వడిసెం బుత్రులు లేని యా శుకునకుం బాటిల్లెనే దుర్గతుల్/ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!"
అనగా తమకు కొడుకులు పుట్టలేదని తెలివిలేని వారు బాధపడుతుంటారు.దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు ఉన్నారు. వారి వల్ల దృతరాష్ట్రుడికి ఎలాంటి మేలూ జరగలేదు.అదే శుక మహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. అంటాడు.
అలాగే గడిగె భీమ కవి రాసిన పద్యాన్ని కూడా ఒకసారి చూద్దాం.
"కలనైన సత్యంబు పలకనొల్లని వాడు- మాయమాటల సొమ్ము దీయువాడు/ కులగర్వమున పేద కొంపలార్చెడి వాడు - లంచంబులకు వెల బెంచువాడు/ చెడు ప్రవర్తనలందు జెలగి తిరుగువాడు-వరుసవావికి నీళ్ళు వదులువాడు/ముచ్చటాడుచు కొంప ముంచ జూచెడి వాడు - కన్నవారల గెంటుచున్నవాడు--"పుడమిలో నరరూపుడై పుట్టి యున్న/ రాక్షసుడు గాక వేరౌన రామచంద్ర!/;కృపనిధీ!ధర నాగర కుంట పౌరి/వేణు గోపాల కృష్ణ! మద్వేల్పు శౌరి!"
అనగా కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడని వాడు. మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించే వాడు.కుల గర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసే వాడు లంచాలకు విలువను పెంచే వాడు.చెడు ప్రవర్తనతో తిరిగే వాడు.వావి వరుసలు పాటించని వాడు.నవ్వుతూ ముచ్చటలాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలనుకునే వాడు.తల్లిదండ్రులను ఇంటినుంచి వెళ్ళగొట్టేవాడు ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే. మరి అలాంటి వాళ్ళు లోకంలోని ప్రజలందరితో ఛీ! అని దూషణలకు గురయ్యే వారే.మరి వాళ్ళిక జీవించి ఉన్నా చచ్చిన వారిలోనే లెక్క అని అర్థము.
అలాంటి వారు రామాయణం మహాభారతం భాగవతంలో ఎందరో అసుర గుణాలు కలిగిన వారు కనిపిస్తారు. అలాంటి వారు మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళను చూసినప్పుడు, వాళ్ళను గురించి విన్నప్పుడు, అలాంటి దుర్మార్గుల గురించి ప్రసార మాధ్యమాల్లో చూసినప్పుడు ఈ "జీవితోపి న జీవేత్స యది లోకేన దూష్యతే" న్యాయము మన మదిలో తప్పకుండా మెదులుతుంది.
చిన్న తనం నుంచే మన కళ్ళ ముందు తిరిగే, మన పాఠాలు వినే విద్యార్థులలో ఇలాంటి లక్షణాలు పొడసూపితే వెంటనే వారిని మార్చేందుకు.అది తప్పు అని చెప్పేందుకు ప్రయత్నించాలి. మొక్కగా ఉన్నప్పుడు వారిలో మార్పు తేకపోతే మ్రానులుగా మారిన తర్వాత ఏమి చేయలేము.కాబట్టి బాల్యం నుండే బాలలకు నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, పెద్దలు,గురువులదే.అందుకనే మన వంతుగా ప్రయత్నం చేద్దాం. మనం కలగన్న మంచి సమాజం- వ్యక్తులు కళ్ళముందు కనబడేలా చూద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి