స్ఫూర్తి ప్రదాతలు:- డా జి భవానీ కృష్ణమూర్తి

 సాహితి కవి కళా పీఠం 
సాహితి కథలు
=====================
 టీవీ లో "ఒకటి  ఒకటి.. రెండు రెండూ. ఐదు ఐదు ఐదు..."అంటూ వస్తున్న ఓ విద్యా సంస్థ ప్రకటన చూసి,
                "విద్య వ్యాపారమైపోయింది.. ఈ ఇద్దరు పిల్లల్ని ఎలా చదివించాలో ఏమిటో? "తల పట్టుకుని కూర్చున్నాడు కాంతారావు.
    "అయినా తప్పదు కదండీ. అసలు... " భార్య మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ "నువ్వు మాట్లాడకు. ఒక్కరితో ఆపేద్దాం అంటే విన్నావా?ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావ్... నీకు తోడు మా అమ్మ 'ఒకపిల్ల పిల్లాకాదు, ఒక కన్ను కన్నుకాదు ' అంటూ......."భార్య కాంచన మాటల్ని మధ్యలో ఆపేశాడు కాంతారావు.
  "చాల్లెండి....... పిల్లలు వింటే.. మీకు వాళ్లంటే ఇష్టం లేదనుకుని బాధ పడతారు.... అదేదో నా ఒక్కదాని తప్పిదమన్నట్లు...."మోచేత్తో అతన్ని ఓ పోటు పొడిచి,
"అసలు ఈ కార్పొరేట్ స్కూళ్ళని, కాలేజీలని పెంచి పోషించేది మన వంటి వాళ్లే. గొప్పలకి పోయి  అప్పులు చేసి,కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు తల్లిదండ్రులు.  ఎదుటివారి పిల్లలని చూసి అసూయ పడుతూ, తమ పిల్లలు ఎక్కడ వెనక పడిపోతారోనని భయపడుతూ పిల్లల్ని ఆందోళనకి, అశాంతికి గురి చేస్తున్నారు.దానితో వాళ్ళు  ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, ఇల్లువదిలి పారిపోయి ఉగ్రవాదులుగా, సంఘవిద్రోహశక్తులుగా మారి పోతున్నారు."అంది,బాధగా.
"కాంచనా! నువ్వు అంతదూరం ఎందుకు ఆలోచిస్తున్నావ్? ఆ ప్రకటన చూసి ...నేనేదో మాట వరసకి అంటే.. నువ్వు సీరియస్ గా తీసుకుని ఎమోషనల్ అవుతున్నావెందుకు "?అన్నాడు,మెల్లగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ.
"అదేమీలేదులెండి..అసలు గొప్ప గొప్ప వాళ్ళందరూ గవర్నమెoట్ పాఠశాలల్లో చదివినవాళ్లే తెలుసా?నేను కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదివాను "అంది.
    "తెలుసు. నేనూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడినే. వాళ్ళ స్నేహితులు పెద్ద స్కూళ్లలో చదువుతుంటే.. వీళ్ళు..." 
  "కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివితేనే భవిష్యత్తు ఉంటుందనే భ్రమ లోనుంచి బయటికి రండి స్వామీ... వాళ్ళని నేను మోటివేట్ చేస్తాను. అర్ధం అయ్యేలా చెప్పే వాళ్ళు లేక పిల్లలు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చూసి కార్పొరేట్ విద్య పై ఆకర్షితులవుతారు. అయినా అంత డబ్బు పెట్టి చదివిన పిల్లల చదువు ఎలా అఘోరిస్తోందో, నేను మా కాలేజీలో చూస్తూనే ఉన్నాను. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు...."పిల్లలు గీత సీత రావడం చూసి, ఆవిషయం పక్కన పెట్టి మామూలు మాటల్లోపడ్డారు.
********************
              కూతురు చెయ్యి పట్టుకుని హెడ్మాస్టర్ గదిలో అడుగు పెట్టాడు సీతారామారావు.
  "చెప్పండి.. ఏం కావాలి? అడిగారు,హెడ్మాస్టర్ గౌతమ్ కుమార్.
"మా అమ్మాయి కాంచనకి ఐదవ తరగతిలో అడ్మిషన్ కావాలి." 
    " పేరు? "
     "కాంచన".
  "ఇంతకు ముందు ఎక్కడ చదివింది?"
"విజయవాడలో.. సత్యనారాయణపురం గవర్నమెంట్  స్కూల్ లో..."అంటూ అందుకు సంబంధించిన పేపర్స్ ఇచ్చాడు.
     " మీ పేరు? "  "సీతారామారావు" 
  "మీరు ఏం చేస్తుంటారు?"
  "బ్యాంకు మేనేజర్"బ్యాంకు పేరు చెప్పాడు.
 "బ్యాంకు మేనేజర్ అయి ఉండి.... మీ అమ్మాయిని..... ఈ స్కూల్ లో చేర్పిస్తున్నారా?"రాయడం ఆపి, వింతగా చూశారు హెడ్ మాస్టర్.
    "ఏం చేర్పించకూడదా?" కాస్త కఠినంగానే అడిగాడు సీతారామారావు. 
     "అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదు సార్. సాధారణంగా దిగువ మధ్య తరగతి వారే తమ పిల్లల్ని ఈ బడిలో చేర్పిస్తారు.. కానీ, మీరు....."
    "అదే మనదౌర్భాగ్యం... అసలు పిల్లల్లో నేర్చుకోవాలని తపనవుంటే ఏ స్కూల్ లో  అయినా చదువుకుంటారు. ఆ ధ్యాస లేకపోతేనే.... చదువు కొనుక్కోవడం.. అదే.. కార్పొరేట్ స్కూల్స్ లో లక్షలు పోసి చదివించడం.... ఇంక అప్పుడు ఫెయిల్యూర్స్ ఉండరు. 
లక్షలుతీసుకుంటారు కనుక, కాకరకాయ బదులు కీకర కాయ అని రాసినా "ఏ " గ్రేడ్ ఇచ్చి పాస్ చెయ్యాల్సిందే. నాకు అది ఇష్టం లేదు. డబ్బుతో కొన్న డిగ్రీలతో కాకుండా సహజoగా నా బిడ్డవిద్యా వంతురాలు కావాలి. కావాలoటే ఏ సబ్జెక్ట్ లో అయినా అర్హత పరీక్ష నిర్వహంచండి "అన్నాడు సీతారామారావు.
మళ్ళీ తనే కూతురు వైపు తిరిగి "అమ్మలూ!పదహారో ఎక్కం అప్పగించు " అన్నాడు.
   కాంచన వెంటనే గడగడా పదహారో ఎక్కం అప్పగించింది.
చరిత్ర, సైన్స్, గణితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు కూతుర్ని. టకటకా జవాబులు చెప్పేసింది
    హెడ్మాస్టర్ తన సీట్ లో నుంచి లేచి వచ్చి "ఇంత తెలివైన విద్యార్థిని మా పాఠశాల ఉండడం మాకు గర్వకారణం." సీతా రామారావు చెయ్యి అందుకుని షేక్ హేండ్ ఇస్తూ, మరో చేత్తో కాంచన భుజం తట్టి, "రేపటి నుంచి బడికి రామ్మా. ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా, ఏ ఉపాధ్యాయులు సరిగాచెప్పకపోయినా నాకు వచ్చి చెప్పమ్మా" అని చెప్పాడు.
*******************.
           ఆరాత్రి పిల్లలని దగ్గర కూర్చోపెట్టుకుని తన గతాన్ని కథలా చెప్పింది." అలా తాతయ్య ఏ స్కూల్, కాలేజ్ అయితే ఏంటి. పిల్లల్లో చదువుకోవాలనే తపన ఉండాలి అనేవారు. నన్ను గవర్నమెంట్ స్కూల్ లో, కాలేజీ లో చేర్పించి, ఆ డబ్బులు దాచి ఉంచి, పెళ్లయ్యాక ఇచ్చారు. ఆ డబ్బులతోనే మనం ఈ మేడ కొనుక్కున్నాం.ప్రకాశం తాతయ్యగారు  డబ్బు లేక, పల్లెటూరిలో అవకాశాలు లేక, నాన్నని గవర్నమెంట్ స్కూల్లోనేచదివించారు. నేను ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్, నాన్న రైల్వే ఆఫీసర్ అయ్యాo కదా.కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వారి కంటే గొప్పస్థాయిలోనే ఉన్నాం ."
       "మేమూ గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతాం.. డబ్బులు పెట్టి డీగ్రీలు కొనుక్కోము " ఇద్దరూ ముక్తకoఠoతో అన్నారు.
     "ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి...."
       "ఉహు! డబ్బులసమస్య కదమ్మా...మేమూ పదవ తరగతి వరకూ చదివిన స్కూల్ బాగుంది.అయినా మేమూ చదువు కొనుక్కోవాలనుకోవడం లేదు. తాతయ్యల, మీ పెంపకంలో స్వశక్తి తో చదువుకోగలం అనే నమ్మకం మాకుంది. తెలియనివి చెప్పడానికి నువ్వు,నాన్నఉన్నారు. అంతగా అయితే పరీక్షల ముందు ఓ రెండు నెలలు కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతాం "చెప్పారిద్దరూ ముక్త కంఠంతో.
    "బంగారు తల్లులూ! నాన్న ఫీజులు కట్టలేక కక్కుర్తితో గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తున్నాడని...." 
    "నాన్నా! నువ్వు రైల్వే ఆఫీసర్, అమ్మ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్.... మీరు ఫీజులు కట్టలేని స్థితిలోఉన్నారని మేమేలా అనుకుంటాం.?చెప్పేము కదా, తాతయ్యల స్ఫూర్తి మాకు ఆదర్శం.
మీ ఇద్దరి జీవితాలు మాకు మార్గదర్శకాలు.గవర్నమెంట్ కాలేజీలో చదివి, ఒకరు ఇంజనీరింగ్, మరొకరం మెడిసిన్ లో గవర్నమెంట్ కాలేజీల్లోనే సీట్లు సంపాదిస్తాం.  ఆ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆటలు లేవు, విరామం ఉండదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి చదువు చదువు   అంటూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా   యంత్రాల్లా మార్చేసే ఆ చదువు మాకొద్దు. మా ముందు బేచ్ అబ్బాయి.... ఆ కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి తట్టుకో లేక.. అది వద్దంటే తల్లిదండ్రులు వినకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు" చెప్పింది గీత.
      "అవునమ్మా... పాపం చాలా మంచివాడు. బాగానే చదివే వాడు.. ఆ కాలేజ్ వద్దు అంటే,వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా చేర్పించారట."అంది సీత.
       కాంచన వారిద్దరినీ చెరో చేత్తో దగ్గరకు తీసుకుని "అమ్మలూ! మీకిష్టమైన కోర్స్, ఇష్టమైనచోట చదువు కోండి. డబ్బు గురించి అస్సలు ఆలోచించవద్దు." అంది.
       "మాకు తెలుసమ్మా..."తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి " గుడ్ నైట్
మమ్మీ, డాడీ!" అంటూ తమ గదిలోకి వెళ్లిపోయారిద్దరూ.
         కాంతారావు భార్య భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ " పిల్లల పెంపకం గురించి నీ దగ్గరట్రైనింగ్ తీసుకోవాలి అందరూ. " అన్నాడు.
       "వాళ్ళు చిన్నగాఉన్నప్పుడు నువ్వు రోజూ రాత్రి పిల్లల్ని నిద్ర పోగొడుతూ దేశనాయకుల కథలు, వారు గడిపిన సాధారణ జీవితం గురించి కథలు కథలుగా చెప్పేదానివి .అవన్నీ వారి పసిమనస్సులో ముద్ర వేసుకున్నాయి. ".
   "అవును. పసి మనసులు మైనం ముద్దలు. మనమే వారిని చక్కగా తీర్చి దిద్దుకోవాలి. మా అమ్మ నాన్నగారు నాకు నేర్పించారు. నేను వీరికి చెప్పాను "అందికాంచన, ముచ్చటైన తన పిల్లల్ని చూసి గర్వపడుతూ.

కామెంట్‌లు