ఓ మనిషీ…
నీ దృష్టిలో...
ఈ సృష్టిలో...
నీ జీవితంలో…
కొందరు వరాల వర్షం...
కొందరు శాపాల శల్యాలు..!
కొందరు పూల మేడలు.
కొందరు ముళ్ళ జాడలు…
కొందరు జీవిత పాఠాలు చెప్పే
గుణపాఠాలు నేర్పే గురువులు..!
కొందరు కలలతో
నీ ఆశల్ని అందంగా
అలంకరించే కల్పతరువులు..!
కొందరు నడివీధిలో
నీ పరువును నిలువునా
దహించివేసే నిప్పు కణికలు..!
కొందరు నీవు మోయలేని
భారమైన బరువులు…
కొందరు...ఆపదలో ఉన్న
నిన్ను ఆప్యాయంగా
ఆదుకునే ఆపద్బాంధవులు..!
కొందరు
కడుపులో
కత్తులుంచుకొని
కౌగలించుకొనే బద్ద శతృవులు…
కానీ వీరంతా భగవంతుని సృష్టి కాదు..!
అందుకే
ఓ మనిషీ…
గుర్తుంచుకో..!
నీ జన్మ దైవసృష్టి...
నీ అమ్మ నాన్నల ఆశీర్వాదం...
నీ స్నేహం నీ స్వభావ సృష్టి...
నీ శత్రుత్వం నీ కోపతాపాల దాహం..!
పగా ప్రతీకారాలు...
అసూయా ద్వేషాలు...
ఖచ్చితంగా నీ మనసును
కాల్చి వేయవచ్చు కానీ
నీ కలల ప్రపంచాన్ని కాదు..!
నిజానికి నీలో పొంగి పొర్లే ఆ ప్రేమ
ఆ కరుణ ఆ జాలిదయ సద్గుణాలతో
నీవు ఈ ప్రపంచాన్నే జయించవచ్చు...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి