కవిత్వం ఒక సరస్వతీ జలధార..!:-కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కవి కూకట్లపల్లి -అత్తాపూర్....హైదరాబాద్
కవిత్వం...
సరస్వతీ జలధార ప్రవాహం 
కవి కలం తీరాన్ని తాకే పడవ..!

కవిత్వం... 
వ్రాయడం ఒక కళ 
కవి కలం ఒక కలల గర్భం...
కవి కవితలు పాఠకుల 
కళ్ళకు స్వప్నాల చిరుజల్లులు..!

ఎగిసే ఆలోచనల...అలలతో 
కరిగే...కలల మేఘాలతో 
శిథిలమైన...శిలలవంటి
హృదయాలపై చైతన్యపు...
వలలు...విసురుతుంది కవిత్వం..!

కవిత్వం...
కవి హృదయపు తపస్సుకు...
సరస్వతిదేవి కురిపించే వరాలవర్షం..!

కవి కలలన్నీ...
కడలిలోని చిరు అలలే
అవి ఆవలితీరం చేరాలంటే
కవికి కావాలి భావాల బంగారు నావ..!

అంతరంగ అగాధంలోకి
దూకిన కవికి దొరుకుతాయి 
ఆలోచనల ఆణిముత్యాలు 
ఆపై అవే కాగితాలపై 
మెరిసే అక్షరాల నక్షత్రాలు..!

రేయింబవళ్ళు నిద్రలేని కన్నులకూ...
రక్తాన్ని సిరాగా మార్చిన గుండెలకూ...
శ్వాసల్లో అక్షరాల్ని చెక్కిన తపస్సుకి..
కవిత్యం చరిత్రలో ఒక శిలాశాసనం..!


కామెంట్‌లు