న్యాయాలు-894
"నీచాః కలహమిచ్ఛంతి సంధి మిచ్ఛంతి సాధవః" న్యాయము
*****
నీచాః అనగా నీచుడు , చిన్నవాడు , హీనుడు. కలహ అనగా కలహము,జగడము, యుద్ధము, మోసము.ఇచ్ఛంతి అనగా కోరుకోవడం, ఆశించడం. సంధి అనగా కలయిక,పొందు, సందు.సాధవ అనగా మంచి వారు,భక్తి గలవారు, సజ్జనులు, పావనమైన వారు అనే అర్థాలు ఉన్నాయి.
నీచులు కలహమును కోరుతారు.సాధువులు సంధిని కోరుతారు.
దుష్టులు, దుర్మార్గులు తాము ప్రశాంతంగా ఉండరు.ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వరు. కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. అందుకే నీచులు కలహ ప్రియులు అంటారు. ఇక వీరికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దాం.
"మక్షికా వ్రణ మిచ్ఛంతి,ధన మిచ్ఛంతి పార్థివాః!/నీచా కలహ మిచ్ఛంతి, శాంతి మిచ్ఛంతి సాధవః!"
అనగా ఈగలు పుండ్ల మీదనే వాలుతాయి.పాలకులు ధనం పైనే దృష్టి పెడతారు.నీచులు కలహాన్నే కోరుతారు.సాధువులు శాంతినే ఆకాంక్షిస్తారు అని అర్థము.
కీటకాలలో ఈగ నీచమైనది.అది ఎక్కువగా అశుద్ధము మీద పుండ్ల మీద వాలడానికి ఇష్టపడుతుంది.ఈగలు గాయాలు పుండ్ల మీదనే వాలడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం.
అలాగే పాలకులు లేదా నాయకులు డబ్బు సంపాదన మీదనే దృష్టి పెడతారు.
ఇక నీచులు ఎల్లప్పుడూ కలహాన్నే కోరుతారు అనడానికి రామాయణంలోని రావణాసురుడు, మహా భారతంలోని దుర్యోధనుడు మొదలైన వారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రావణుడు సీతను అపహరించినప్పుడు సోదరుడైన విభీషణుడు అనవసరంగా శ్రీరాముని జోలికి పోవద్దని ఎన్నో విధాలుగా హితోక్తులు చెబుతాడు.అయినా పెడచెవిన పెట్టిన రావణుడు యుద్ధానికి కాలు దువ్వి రాముని చేతిలో మరణించడం మనందరికీ తెలిసిందే.
ఇక మహా భారతంలో దుర్యోధనుడు. ఇతడు బాల్యం నుండి కూడా పాండవుల మీద అకారణమైన ద్వేషం, శత్రుత్వం పెంచుకుంటాడు. వారితో ఎన్నో సార్లు కలహానికి కాలు దువ్వాడు.
మాయా జూదంతో పాండవులను ఓడించి వారిని పన్నెండేళ్ళు వనవాసం,ఒక సంవత్సరం అజ్ఞాత వాసంలో గడిపేలా చేశాడు.
అయినా ఇంకా పగ శత్రుత్వం చల్లారక తిరిగి వాళ్ళు రాజ్య పాలన చేయకుండా వుండేందుకు ,అజ్ఞాత వాసంలో పాండవులను కనిపెట్టి తిరిగి వారిని అరణ్యవాసానికి పంపాలన్న దురుద్దేశంతో విరాట్ రాజు కొలువులో ఉన్నారని తెలిసి వారిపై దండెత్తుతాడు.
అంతటితో ఆగకుండా కురుక్షేత్ర సంగ్రామానికి తలపడతాఠు. యుద్ధం జరగకుండా ఉండేందుకు, శాఃతిని నెలకొల్పేందుకు శ్రీకృష్ణుడు దుర్యోధనుని వద్దకు రాయబారిగా వెళ్ళి ఎంతగానో నచ్చచెబుతాడు. యుద్ధ ప్రయత్నం చేయకుండా, శాంతింపజేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు.కానీ నీచ స్వభావం కలిగిన దుర్యోధనుడు యుద్ధం చేసేందుకే సిద్ధమవుతాడు.
ఇలాంటి స్వభావం కలవారు కేవలం భారత, రామాయణంలోనే లేరు. మన చుట్టూ ఉన్న కుటుంబాలలోనూ సమాజంలోనూ తారస పడుతుంటారు.అందుకే ఇలాంటి వారిని ఉద్దేశించి "నీచులు కలహాన్నే కోరుతారు". అని మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
ఇక సాధువులు అనగా మంచివారు. వీరు ఎల్లప్పుడూ సమాజ క్షేమం కోసం పాటు పడుతూ, శాంతి భద్రతల కోసం పరితపిస్తూ ఉంటారు. రాముడు,కృష్ణుడు లాంటి సజ్జనులు సమాజ శ్రేయస్సు కోసము యుద్ధం లాంటి అనర్థాలు జరగకుండా శాంతియుతంగా ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు.
మనం ఈ "నీచా కలహ మిచ్ఛంతి సంధి మిచ్ఛంతి సాధవః" న్యాయము ద్వారా" నీచులు కలహాన్నే కోరుతారనీ, సజ్జనులు ఎల్లప్పుడూ శాంతిని,సమాజ శ్రేయస్సుకై తపిస్తారనేది" తెలుసుకోగలిగాం.
కాబట్టి మనం కూడా సజ్జనుల్లా సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు కృషి చేద్దాం. ఆచరణలో చూపిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి