ప్రయాణంతో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం:- ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య

 తల్లిదండ్రులు తమ పిల్లల్ని బస్సులు, వ్యాన్లలో దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల దూరభారం, అలసట, దుమ్ముధూళి వంటివి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం, ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. బస్సులు, వ్యాన్లు, ఆటోలలో ప్రతిరోజు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి, వచ్చే విద్యార్థులు తరచుగా అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా దగ్గు, జలుబు, ఆస్తమా వంటి వాటితో బాధపడుతున్నారన్నారు. పిల్లల ఈ అనారోగ్య పరిస్థితులు వారి విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, అందుకోసమే తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. మంగళవారం ఆయన పాఠశాలలో పిల్లలకు ఉచిత దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలను ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు. పేద, ధనిక, కుల,మత భేదాలు లేకుండా సమానత్వ భావనను పెంపొందించడానికి ప్రభుత్వ పాఠశాలలే చక్కటి వేదికలని, పిల్లల్లో సమానత్వ భావనను సాధించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సేవా భావం కనిపిస్తుందని, అదే ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాపార ధోరణి గోచరిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రజల సమిష్టి ఆస్తి అని, అందుకే ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా పిల్లల తల్లిదండ్రులపై ఎక్కువ బాధ్యత ఉందన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల నిర్వాహణకు నెలకు సుమారుగా దాని స్థాయిని బట్టి రూ. 6 నుంచి 10 లక్షల ఖర్చవుతుందని, అదంతా ప్రజల సొమ్మనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలన్నారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టి, కొందరు తల్లిదండ్రులు ప్రైవేటు విద్యపై మోజు పెంచుకోవడం బాధాకరమన్నారు. చెమటోడ్చికష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేసుకోవద్దని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థి నాగిరెడ్డి ఆర్యాన్ష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యాన్ష్  స్వీట్ తినిపించి, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, విద్యాబుద్ధులతో వర్ధిల్లాలని  ఉపాధ్యాయులు దీవించి, ఆశీర్వదించారు. పాఠశాల పిల్లలు ఆర్యన్ష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎ.సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు